పిడికెడు ఆత్మగౌరవం కోసం

| సాహిత్యం | వ్యాసాలు

పిడికెడు ఆత్మగౌరవం కోసం

- దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు | 03.11.2018 11:44:31am

మీకు చ్యాతనైతే, మీకు చ్యాతనైతే నా శరీరాన్ని నగరం నడి బొడ్డున ఖననం చేయండి...!!
ఒక జీవన రవళిని వినిపించే విదుర(వెదురు) వనాన్నై వికసిస్తాను....!!

అగ్రకుల అమ్మాయిని చూసాడని కారణంతో కంచికచర్లలో కోటేశు అనే యువకున్ని అగ్రకుల భూస్వామ్య వర్గం పట్టపగలు సజీవ దహనం చేసింది. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన కలేకూరి పీపుల్స్ వార్ వైపు ఆకర్షితులయ్యాడు. కొద్దికాలంలోనే పీపుల్స్వార్ భావజాలం నుంచి విభేదించి బయటకు వచ్చి, మార్క్సిస్టు ఆలోచనా ధోరణికి విరుద్ధం గాడాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాలను తన రచన ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చేరవేశాడు. అనేక దళిత బహుజన ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.

ఇందిరా అనే నవ వధువు టంగుటూరులో హత్యకు గురికావడంతో ఆ సంఘటనను ఉద్దేశించి "" కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసీ విరియని ఓ చిరునవ్వా""అనే పాటను రాశాడు. ఇది మైహిలో ద్యమానికి నాంది పలికింది. శ్రీరాములయ్య సినిమా లో "ʹభూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలో""అనే పాట కారంచేడులో దళితుల మారణకాండను ఉద్దేశించి రాసినది.

మేధావులు భూమిపై కొద్దికాలమే జీవిస్తారు అలాంటి వారిలో కలేకూరి ఒకరు. ఆయన జీవించిన అతి కొద్ది కాలం తన జీవితాన్నే మొత్తం అట్టడుగు వర్గాల కోసమే అంకితం చేశాడు. ఆయన నిస్వార్థ జీవి. ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొంత సమాచారాన్ని సేకరించాను, ఆయన చేతిలోని "యువక "కలం నుంచి జాలువారిన ఆత్మఘోషను ఒకసారి వినండి. కొన్ని కవితలు చదవడానికి, చదివి కవిత లోని ఆర్తిని అనుభవం లోనికి తెచ్చుకోవడానికి కేవలం సాహిత్య విద్యార్థులం అయితే సరిపోదు. మరీ ముఖ్యంగా, శక్తివంతమైన గొంతుక వున్న ఒక దళిత కవి రాసిన కవితనీ, అతడి గొంతు లోని బాధనీ, ఆగ్రహాన్నీ సహానుభూతితో అర్థం చేసుకోవడానికి వేల సంవత్సరాలుగా ఈ దేశం వర్ణ వ్యవస్థ కుంపటి పైన ఎట్లా తగలబడి పోతున్నదో, ఆ కుంపటిని రాజేస్తూ వున్న పురాణాలు ఏమిటో, స్మృతులేమితో విశ్లేషించుకుని అర్థం చేసుకునే హృదయం కావాలి.

ప్రపంచం ఆధునిక కాలంలోకీ, అత్యాధునిక కాలంలోకీ వెళ్లిందని సంబరాలు జరుపుకునే కాలంలో కూడా గ్రామాలలోనూ, నగరాల లోనూ, చివరికి ఘనత వహించిన విశ్వవిద్యాలయాల లోనూ ఇంకా కొన్ని కులాల వాళ్ళు వెలివాడలకు ఎందుకు పరిమితం చేయబడుతున్నారో, వాళ్ళను అట్లా పరిమితం చేస్తోన్న శక్తుల రాజకీయాలేమిటో తెలిసి వుండాలి. ఇంతా చేసి, కులం మిగిల్చిన అవమానాల గాయాలని తడుముకుంటూ కవిత చెప్పే ఒక దళిత కవి ఈ దేశం నుండి కోరుకుంటున్నది ఏమిటి? తనని మనుస్మృతి సృష్టించిన అస్ప్రుశ్యునిగా కాకుండా, మానవత్వం సృష్టించిన మనిషిగా చూడమని. కవి ʹయువకʹ

(కలేకూరి ప్రసాద్) మాటల్లో చెప్పాలంటే – ʹపిడికెడు ఆత్మ గౌరవాన్నిʹ యివ్వమని. కలేకూరి ప్రసాద్ రాసిన ఈ ʹపిడికెడు ఆత్మ గౌరవం కోసంʹ విస్తృత ఆదరణ పొందిన కవిత. ఈ దేశ చరిత్ర లోను, పురాణాల లోను ఉటంకించిన దళితుల, శూద్రుల ప్రస్తావనని స్పృశిస్తూ కూడా ఎక్కడా ఉపన్యాస చాయలు లేకుండా గొప్ప ఆర్తితో చివరి వరకూ సాగిపోవడం ఈ కవిత ప్రత్యేకత. కవిత లోని దాదాపు ప్రతీ లైను మనల్ని ఈ దేశ పురాణాల చీకటి మూలల్లోకో, ఈ దేశ చరిత్ర మకిలి అధ్యాయాల్లోకో తీసుకు వెళ్తుంది. ఆ చీకటి మూలల్లోనో, ఆ మకిలి అధ్యాయాల్లోనో దుఃఖించే దళితుల్ని చూపిస్తుంది!

పిడికెడు ఆత్మ గౌరవం కోసం
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
ʹపునరపి మరణం – పునరపి జననంʹ
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేహం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు

ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు

సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను

ʹనేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ/
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డానుʹ అని ప్రారంభించాడు కవితని. నిజమే!

ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఎప్పుడు సృష్టించ బడిందన్న ప్రశ్నకు చారిత్రక ఆధారాలు లేవు గానీ, అది వెలుగులోకి వస్తూనే కొందరిని పంచముల పేరిట సమాజానికి అంటరాని వాళ్ళను చేసింది.
ʹపునరపి మరణం – పునరపి జననంʹ అంటూ కవి ఆది శంకరాచార్యుని ʹభజగోవిందంʹ ప్రస్తావన తీసుకొచ్చాడు కవి.

ఇంతకూ, శంకరాచార్య ఏమన్నాడు? ʹ మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారాన్ని దాట జాలక నానా బాధలకు గురవుతూ వున్న నాకు ముక్తి ప్రసాదించు మురారీ!ʹ భజగోవింద పారాయణం చేసిన సవర్ణులకు సంసారం నుండి ముక్తి లభించిందేమో గానీ, వేల ఏళ్ళు గడిచినా వర్ణ వ్యవస్థ చట్రం నుండి దళితులకు విముక్తి లభించలేదని కవి వాపోతున్నాడు.

ʹనా దేశం ఈ దేశంలో కరిగిపోయి / గంగా సింధూ మైదానమైందిʹ అంటున్నపుడు, భారత దేశం వెలుపలి నుండి వలస వచ్చిన ఆర్యులు ఈ దేశ మూలవాసుల నాగరికతను ధ్వంసం చేసి సింధూ నాగరికతను (Indus Valley Civilisation) నిర్మించిన చరిత్రను తవ్వుతున్నాడు కవి. అట్లా ఈ దేశంలోకి చొరబడిన వాళ్ళు ఇక్కడి మూలవాసుల శ్రమతో పంటలు పండించారు అని చెప్పడానికి ʹనా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే / ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసిందిʹ అంటున్నాడు. యుగాలు మారినా దళితుల వెతలు మారలేదని చెప్పడానికి, ʹత్రేతా యుగంలో నేను శంభూకున్ని / ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశుʹ అని అంటున్నాడు.

శంభూకుడు ఎవరు ?


రాముడు రాజ్యమేలే కాలంలో ఒక బ్రాహ్మణుడు, అకాల మృత్యు వాత పడిన తన కొడుకు శవాన్ని రాముడి ముందు పెట్టి, రాజ్యంలో ఎదో అరిష్టం జరుగుతున్నందువల్లనే తన కొడుకు ఇట్లా మరణించాడని వాపోతాడు. అప్పుడు ఆ అరిష్టానికి కారణం శూద్రుడైన శంభూకుడు బొందితో స్వర్గం వెళ్ళడానికి తపస్సు చేస్తూ వుండడమే అని తెలుసుకుని, హుటా హుటిన వెళ్లి, తపస్సులో వున్న శంభూకుని శిరస్సు ఖండిస్తాడు.

మరి, కంచికచెర్ల కోటేశు ఎవరు ??


భారత దేశం స్వతంత్ర దేశంగా మారిన తరువాత ఒక అగ్ర వర్ణ యువతిని ప్రేమించాడు కారణ నేరానికి ఆ అగ్ర వర్ణ భూస్వాముల చేతిలో హతమైన ఒక దళిత యువకుడు. చుండూరు దళితుల ఊచకోత నేపథ్యంలో రాసిన కవిత కాబట్టి, ఈ సంఘటన కన్నా ముందు జరిగిన దళితుల ఊచకోత సంఘటనలను ఉటంకిస్తూ

ʹనా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ / ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం / నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు ʹ అంటున్నాడు కవి. వేతనాల పెంపు డిమాండ్ చేసినందుకు దాదాపు 44 మంది దళిత కూలీలను అగ్ర వర్ణ భూస్వాములు ఊచకోత కోసిన సంఘటన 1968 ప్రాంతంలో తమిళనాడు లోని కీలవేన్మనిలో జరిగింది. 1985 లో కారంచేడు, 1987 లో నీరుకొండ హత్యాకాండలు జరిగితే, చుండూరు ఘటన 1991 లో జరిగింది.

దేశానికి స్వాతంత్రం వొచ్చి, దళితులకు చదువులు, ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పించబడిన తరువాత కాలంలోనే దళితుల పైన దాడులు స్థలాలనే కవి తన జన్మ స్థలం అంటున్నాడు. బహుశా, డాక్టర్ అంబేద్కర్ వేసిన బాటలో చదువుకుని, ప్రశ్నించడం మొదలు పెట్టాకే దళితుల పైన దాడులు ఎక్కువ అయ్యాయనీ, అందుకే కవి ఆయా స్థలాలను తన జన్మ స్థలం అంటున్నాడని అనిపిస్తుంది ! చుండూరు ఘటనతో దళితుల పైన దాడులు పరాకాష్టకు చేరడంతో ʹచుండూరు / రాచ పుండూరు / నామవాచకం కాదు సర్వనామం అంటున్నాడుʹ.

ʹబతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని ʹ అనడంలో తరాలు మారినా మారని దళితుల స్థితి హిందూ వర్ణ వ్యవస్థ పట్ల ఒక తీవ్ర నిరసనగా నిలబడి వుందని చెప్పడమే!

తన మరణం, వర్ణ వ్యవస్థ పైన పోరాటం కొనసాగడానికి ఒక స్పూర్తిగా నిలవాలనే ఆశతో కవి –

ʹనన్ను బాధితుడు అని పిలవకండి /
నేను అమరున్ని ʹ అని పదే పదే చెప్పడం కనిపిస్తుంది.
ఇదంతా సరే – భారతీయ సమాజాన్ని కేవలం ఒక వర్గ వ్యవస్థగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి, భారతీయ సమాజాన్ని వర్ణ / కుల వ్యవస్థగానె అర్థం చేసుకోవలసి వుంటుందని చెప్పిన అంబేద్కర్ – పూలే ఆలోచనా ధోరణిని అక్కున చేర్చుకున్నానని చెప్పడం కోసమేనా ʹశీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని / నిటారుగా నిలబెట్టేందుకు / సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడినిʹ అని అంటున్నాడు?

ఇవాళ కొత్తగా దళితుల్ని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోన్న వాళ్ళను కవి కలేకూరి ప్రసాద్ అప్పుడే ఊహించి రాసాడా అన్నట్టు వున్న ఈ కవితా వాక్యాలు చదవండి -

ʹమీకు చాతనైతే / నగరం నడిబొడ్డున ఖననం చేయండి /
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి /
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను /

మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తానుʹ
దేశ మూలవాసులైన దళితులను వెలివాడల లోకి విసిరి వేసిన ఈ దేశ అమానవీయ వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ ఎగిరిన పతాక ఈ కవిత!

ముఖ్యంగా,
ʹమీకు చాతనైతే
/ నగరం నడిబొడ్డున ఖననం చేయండి /
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండిʹ లాంటి చివరి పాదాలు చదువుతున్నపుడు మీకు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇటీవలి సంఘటనలు ఏవైనా జ్ఞప్తికి వొచ్చాయా ? వొచ్చేవుంటాయి.

No. of visitors : 205
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •