ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం

| సంభాషణ

ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం

- వరలక్ష్మి, పావని | 03.11.2018 11:50:45am

లోకాన్ని గురించి కొత్తగా తెలుసుకుంటున్న రోజుల్లో టి.ఎం.ఎస్‌ పాఠాలు వినడం చరిత్ర మాకిచ్చిన ఒక అపురూప అవకాశం. అదెంత అపురూపమైనదంటే మాకవి తొలితొలి పాఠాలైతే, ఆయన చెప్పిన చివరి పాఠాలవి. ఆఖరున కలుసుకున్న బ్యాచ్‌ మేమే. ఎన్నో యువబందాలు ఆయన్ని కలుసుకొని ఆయనతో స్నేహం చేసి ఉంటాయి. డీలక్స్‌ హోటల్‌ కబుర్ల గురించి, రాడికల్స్‌ గురించి చాలామంది చెప్తారు. మేమా కాలానికి చెందినవాళ్ళం కాము. కానీ ఆయనను కలిసిన నాటి నుంచి ఆయన అమరత్వం వరకూ మా ప్రతి అనుభవం ఒక రాజకీయ, సైద్దాంతిక, సాహిత్య పాఠమే.. అమెరికా ట్విన్‌ టవర్స్‌ కూలిపోయిన సంవత్సరంలో తొలిసారి మేమాయన్ని కలిసాము. కాబట్టి మాది నక్సల్బరీ శ్రీకాకుళాల, ర్యాడికల్‌ ఉద్యమాల రోమాంచిత నోస్టాల్జియా కాదు. టి.ఎం.ఎస్‌ విరసానికి దూరమై అప్పటికి పదేళ్లయింది. బహుశా అప్పటికాయన తత్వశాస్త్ర పాఠాలు కూడా చెప్పటం లేదు. ఆయన గురించి మాకు పెద్దగా తెలీకపోయినా మేమాయాన్ని కలవడానికి వెళ్లాం.

అప్పటికి మాకు పుస్తకాల పట్ల వ్యామోహం తప్ప సాహిత్య, సైద్ధాంతిక జ్ఞానం లేవు. ఒక్కముక్క రాసినవాళ్ళం కూడా కాదు. ఇక టి.ఎం.ఎస్‌ రాసిన ఒక్క వ్యాసమైనా మేం చదవలేదు. తిరుపతిలో చదువుకోబోతున్నాం అని తెలిసి, మా ప్రొద్దుటూరు సాహితీ మిత్రులు ఆయన పేరు చెప్పి కలవమన్నారు. ఓ పెద్దాయన ఉత్తరం, అడ్రెస్‌ రాసిచ్చాడు. సెల్‌ ఫోన్లు ఖరీదైన వ్యవహారంగా ఉన్నరోజులు. బైరాగి పట్టెడలో అడ్రెస్‌ వెతుక్కుంటూ వెళ్లాం. ఇంటికి పాణిగ్రాహి నిలయం అని పేరుంటుందని చెప్పారు. హాస్టల్‌ నిర్బంధం దాటి అలా ఆయన్ని చేరుకోవడం అంతా ఇంకో కథ. మేము వేరు వేరు కోర్సులు చేస్తూ వేరువేరు హాస్టళ్ళలో ఉండేవాళ్ళం. జైలే నయం అనిపించేలా ఉండేది మాలో ఒకరి హాస్టల్‌. పరిచయం చేసుకొని ఉత్తరం ఇచ్చాక ఆ ఉత్తరం రాసిన మా మాస్టారు గురించి గొప్పగా తలచుకోవడం గుర్తు. అలా మమ్మల్ని దగ్గరికి తీసాక, కాస్త బెరుకు తగ్గింది. మా చదువుల గురించి క్యాంపస్‌ గురించి అడగి, మా ఆసక్తులు తెలుసుకొని మాట్లాడ్డం ప్రారంభించాక ʹʹఈ పెద్దాయన చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు కదాʹʹ అనుకున్నాం. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి అన్నాడు. ఇక బైరాగి పట్టెడకు దారిపడింది.

మేం సైన్స్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులం కదా, సైంటిఫిక్‌ టెంపర్‌ గురించి చాలా చెప్పేవాడు. ఛాందస భావాలను ఆయన చీల్చి చెండాడుతుంటే భలే ఎంజాయ్‌ చేసేవాళ్ళం. ఆయన కబుర్లు ఇలా ఉండేవి: ʹʹమా కాలేజీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌ ఉండేవాడు. ఒకరోజు తిరుమల కొండకు పోయి గుండు చేయించుకొని వచ్చాడు. నీకు ఫిజిక్స్‌ చెప్పే అర్హత లేదు అని మేమాయనతో దెబ్బలాడాంʹʹ. ʹʹతిరుపతి దేవుడు స్త్రీయా, పురుషుడా... విగ్రహాన్ని చూడాలని పట్టుబట్టాం. మాకు నచ్చజేప్పలేక చచ్చారు.ʹʹ... ఇలాంటివే రాడికల్‌ విద్యార్థుల కబుర్లు చాలా చెప్పేవాడు. ఆలాంటి రోజుల్లోనే ఓ సారి పెళ్లి మంత్రాలు, ప్రార్థనా గీతాల అర్థాలు విడమరచి చెప్పేసరికి, ఆశ్చర్యపోవడం మావంతు అయ్యింది. భక్తి, ఆచారాల్లో ఇన్ని బూతులుంటాయని మేం కల్లో కూడా అనుకోలేదు. ఇక దీంతో బుర్రలో ఏమూలనో ఉన్న నమ్మకాలు కూడా పటాపంచలయ్యాయి. ఆయనెంత కరుడుగట్టిన భౌతిక వాది అంటే.. ఓ రోజు మనసు అనేది లేదని చెప్పాడు. అదేంటి.. అంత మంది కవుల కవిత్వం ఏం కాను అని అమాయకంగా అడిగేసరికి.. ఆయన చాలా గంభీరంగా ముఖం పెట్టి.. మనసంటే ఏంటి అని అడిగాడు.. మేం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే... గుండె ఉంటుంది... మెదడు ఉంటుంది. మెదడు భావోద్వేగాలకు, ఆలోచనలకు కేంద్రం.. గుండె శరీరానికి రక్త ప్రసారం చేస్తుంది. ఇప్పుడు మనసంటే ఏంటో చెప్పు? అని ప్రశ్నించేవాడు.. నిజంగానే.. ఈ చిన్న చర్చ మాపై ఎంతటి ప్రభావాన్ని వేసిందంటే.. ఇప్పటికీ మనసనే మాట వాడేందుకు ఇష్టం ఉండదు. మనసు, హదయం అన్నప్పుడల్లా టి.ఎం.ఎస్‌ గుర్తొస్తాడు.

ఇలాంటి చర్చల తర్వాత మేము మా హాస్టళ్ళకు తిరిగి వెళ్లి ʹʹమాకొక సారు పరిచయమయ్యారు. ఆయనెంత సూపరంటే మీరాయనని కలిసి తీరాలʹʹని మా స్నేహితులకు చెప్పేవాళ్ళం. వీలైనప్పుడు వాళ్ళనూ వెంటబెట్టుకెళ్ళేవాళ్ళం. వెళ్ళగానే ʹʹఆ..ఏంటమ్మా విశేషాలుʹʹ అని అడగటం, మేమోదో ఒకటి చెప్పడం, ఇక ఆయన అల్లుకుపోవడం. మధ్యలో మేం పెద్దగా మాట్లాడేవాళ్ళం కాదు. టి.ఎం.ఎస్‌ ఆరాచకం గురించి చాలా చెప్తారు కానీ ఆయన ఏదైనా ఒక భావాన్ని/వాదాన్ని ఎస్టాబ్లిష్‌ చేయడంలో చాలా నిర్మాణాత్మకంగా ఉంటాడు. ఆయన చెప్పిన కబుర్ల గురించి ఎప్పుడు ఆలోచించినా ఇది అర్థమయ్యేది. చాలా క్యాజువల్‌ మాటతో మొదలుపెట్టి ఆ రోజు ముగిసేసరికి అత్యంత నిర్మాణాత్మకంగా సిలబస్‌లో పాఠం పూర్తి చేసినట్లుగా మా బుర్రకెక్కించాల్సింది ఎక్కించి వదిలిపెట్టేవాడు. అదే ఆలోచించుకుంటూ, చర్చించుకుంటూ వెళ్ళేవాళ్ళం.

బహిశా ఆడపిల్లల స్వేచ్ఛ గురించి కూడా మాట్లావాడేమో, జైలు వంటి హాస్టల్‌లో చాలా చికాకులు పడేవాళ్ళం కాబట్టి బాగా కనెక్ట్‌ అయ్యాం. ఏ రూల్సూ లేకుండా విచ్చలవిడిగా తిరిగుతూ అమ్మాయిల వెంటపడే అబ్బాయిల మీద కసిగా కూడా ఉండేది. అప్పటికి నిర్దిష్టంగా ఫెమినిస్టు సాహిత్యం చదివింది లేదు. టి.ఎం.ఎస్సే చదవమన్నాడు. ఆయనతో మాట్లాడిన కబుర్లు ప్రొద్దుటూరు మిత్రులకు ఉత్తరాలు రాసేవాళ్ళం. ఇలా ఫెమిజాన్ని స్టడీ చేయమన్నాడు అని రాస్తే మా కమ్యూనిస్టు మిత్రులు చికాకు పడ్డారు. ఫెమినిజం ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో చిన్న క్లాసు వేస్తూ ఉత్తరం రాసారు. అప్పుడాయన ఏ సందర్భంలో చెప్పాడో గుర్తులేదు కాని మేం మాత్రం ʹకమ్యూనిస్టులం కాకపోయి ఉంటే కచ్చితంగా ఫెమినిస్టులం అయ్యేవాళ్ళంʹ అని కామన్‌ గా ఫీలవుతాం. మార్క్సిస్టు గతితార్కిక పునాదులు గట్టిగా వేసింది ఎవరో ఇప్పుడు చెప్పక్కర్లేదు. దేన్నైనా లోతుగా అధ్యయనం చేయకుండా అభిప్రాయాలనేర్పరచుకోకూడదు కదా. టి.ఎం.ఎస్‌ విద్యార్థులు నేర్చుకోగలిగేది ఇదే. అస్తిత్వవాదాల హోరులో ఎదురు నిలబడి వర్గపోరాట పంథాను దఢంగా ఎత్తిపట్టి మావోయిస్టుగా కొనసాగగలగడం.

క్రమంగా ఆదివారమొస్తే ఎన్ని ఇబ్బందులనైనా దాటుకొని ఆయన్ని చూడాలనిపించేది. మాలో ఒకరికి హాస్టల్‌ రూల్స్‌లో కొంతలో కొంత స్వేచ్ఛ దొరికేది. అందువల్ల ప్రతి ఆదివారం కలిసేది. ʹʹపోయినవారం రాలేదే? ఇంటికెళ్ళావా? నువ్వు బాగా హోం సిక్‌ ఉన్నట్టుందే!ʹʹ అని అడిగేంతగా దగ్గరయ్యారు. ʹʹనెక్స్ట్‌ వీక్‌ నేను ఉండటం లేదమ్మాʹʹ అని ఫలానా చోటికి వెళ్తున్నా అని చెప్పేవారు. ఆయన స్టేచర్‌ తెలిసిన తర్వాత ఇది గర్వకారణమే కదా. అట్లా మేమూ తెగ ఫీలయ్యేవాళ్ళం. మూడు నాలుగు సభల్లో ఆయన ఉపన్యాసం విన్నాం. ప్రజాసంఘాల మిత్రులేమో ఒకప్పుడున్నంత వాడి వేడి లేవనేవారుగాని మాకు మాత్రం అవి అపురూపమే. సాహిత్యానికీ ఓ లక్ష్యం ఉంటుందని బహుశా ఆయన పరిచయం తర్వాతే మాకు బాగా అర్థమయ్యింది. దొరికిందల్లా చదివినా మాకు పరిచయమైన సాహితీ మిత్రులవల్ల, వాళ్ళు నడిపే గ్రంధాలయం వల్ల చవకబారు పుస్తకాలైతే చదవలేదు. అప్పటికి విరసం, అరుణతార పరిచయమే. అయితే సాహిత్యోద్యమం గురించి, సాంస్కతిక, భావజాల రంగంలో వర్గపోరాటం గురించి ఆయన పాఠాలు విన్న తర్వాత విరసం ఆవరణలోకి కాస్త ఆసక్తిగా తొంగిచూసామేమో.

ఇలా రాస్తుంటే ఒక విషయం గుర్తొస్తోంది. అప్పట్లో కనిపించిన ప్రతి పుస్తకాన్ని నమిలి మింగి.. ఆహా ఎంత అద్భుతంగా ఉంది అనుకునే వాళ్లమే కానీ.. అంతకు మించి ఆలోచించే వాళ్లం కాదేమో.. ఓసారి ఆయన ఇంటికి వెళ్లేప్పుడు ట్విన్‌ టవర్స్‌ కూలినప్పుడు వచ్చిన ఒక కవితను పట్టుకుని చాలా ఉత్సాహంగా వెళ్లాం. ఆయనకు ఈ కొత్త కవిత్వం గురించి బోలెడు ఉద్వేగంతో చెబుతుంటే.. ఆయన ఆ.. చదివాను.. అందులో కవిత్వమెక్కడుందీ.. అనే సరికి మేం అవాక్కయ్యాం. మొదటి సారి..ఆయన మార్కు ముక్కుసూటి విమర్శ.. ఫస్ట్‌ హ్యాండ్‌ ఆనుభవం. ఆధునిక కవిత్వం గురించి, విమర్శనాత్మక అధ్యయనం గురించి ఆ సాయంత్రమంతా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రతి పాఠం (పాఠమని ఇప్పుడనిపిస్తోంది కానీ.. అప్పుడు మాత్రం పెద్దాయనతో కాసేపు మాట్లాడి వద్దామనుకోవడమే) సాహిత్య, రాజకీయాల్లోకి కొత్త ద్వారాలు తెరిచేది. లిటరేచర్‌ విద్యార్థులు కాని మాకు తెలుగు సాహిత్యం, విమర్శ గురించిన ఎన్నో విలువైన పాఠాలు ఆయన దగ్గరే మొదలయ్యాయి. ముఖ్యంగా విమర్శకు సంబంధించిన అవగాహన పెరిగింది. అప్పట్లో సాహిత్య విమర్శకు సంబంధించిన ఒక పెద్ద పుస్తకాల జాబితానే ఇచ్చారు, చదవమని. కేవలం సాహిత్యమనే కాదు.. ఫిలాసఫీ, పొలిటికల్‌ ఎకానమి, చరిత్రకు సంబంధించిన బోలెడు పాఠాలు, చర్చలు నడిచేవి. ఒక్కోసారి.. కొన్ని పుస్తకాలు చదవమని సలహాలు వచ్చేవి... మరికొన్ని సార్లు ఆయనే తన దగ్గరున్న పుస్తకాలు ఇచ్చి చదవమనే వారు. అట్లా ఒకసారి గ్రేట్‌ డిబేట్‌ గురించి చెప్పి.. ఆయన దగ్గరున్న పుస్తకం ఇచ్చాడు. ఇంగ్లీషు చదవడం అలవాటు లేదేమో.. అతి కష్టమ్మీద చదివామనిపించాం కానీ.. ఎంత అర్థమైందో చెప్పడం కష్టమే.. అలాంటప్పుడే అనుకునే వాళ్లం... ఇలా కొరుకుడు పడని పుస్తకాలు ఇవ్వకపోతే.. వాటి గురించి ఆయనే కాస్త చెప్పొచ్చు కదా అని.

ఇలాంటి రోజుల్లోనే తిరుపతి విరసం మిత్రులు మధుసూదనరావు గారితో మార్క్సిస్టు తరగతులు ప్రారంభించారు. ప్రతి ఆదివారం సాయంతం క్లాసు. పదార్ధం, చైతన్యం మొదటి పాఠం. ఒక రోజంతా పదార్ధం, దాని స్వరూప స్వభావాల గురించే చెప్పాడు. ప్రతి సూత్రానికి పది ఉదాహరణలు. ఆ క్లాస్‌ అత్యద్భుతం. ఫిజిక్సో, బయాలజీయో, ఇంకేదో సబ్జెక్టో విన్నట్టుగా లేదు. ప్రకతిలో చలించే మనిషి గురించి...అంటే మన గురించి, మన భావాల, ఉద్వేగాల, జ్ఞాన, అజ్ఞాన ప్రపంచాల గురించి సరికొత్తగా తెలుసుకున్నాం. మా జీవితాల్లోకి కొత్తగా చూసుకొని, మానవ సమూహం గురించి కొత్తగా తెలుసుకుంటున్న ఉత్సాహం మరిచిపోలేనిది. ఉత్పత్తి సంబంధాలను, శ్రమ ఔన్నత్యాన్ని, దోపిడిని, వర్గపోరాటాన్ని అర్థం చేసుకునే ప్రయాణం ప్రారంభించి, నూతన సంస్కతిని, మహోన్నత మానవ విలువలను నిర్మించే కలలు ఆవిష్కరించుకున్నాం. ఆయన క్లాసులు అర్ధాంతరంగా ఆగిపోవడం నిరాశకు గురి చేసింది. ఇక ఆయన ఆరోగ్యం ఏ మాత్రం సహకరించడం లేదు. ఆ దశలోనూ ఆయన ఇంట్లో ఒకరోజు విరసం చరిత్ర చెప్పాడు. అనారోగ్యానికి తోడు ఆర్థిక సమస్యలు. అప్పటికే ఇళ్ళు అమ్మేసుకొని, రెండిళ్ళు మారాడు. అదే చివరి పాఠం. తర్వాత ఒకరోజు కలవడానికి పోయినప్పుడు బొత్తిగా మాట్లాడే స్థితిలో కూడా లేడని, బాగా అలసిపోతున్నాడని ఇంట్లోవాళ్ళు చెబితే ఆయన్ని చూసే ధైర్యం చేయక వెనుదిరిగి వచ్చాం.

విరసం సభ్యుడిగా చనిపోవాలనుకుంటున్నానని సంస్థకు దరఖాస్తు పెట్టుకున్నాడు. అప్పటికి మా కోర్సులు ముగిసి ఊరికి తిరిగొచ్చేసాం. కావలి మాహాసభల్లో ఎవరినో చూసి టి.ఎం.ఎస్‌ వచ్చాడనుకుని.. పరిగెత్తుకుంటూ వెళ్లాం. ఆయన లెటర్‌ మాత్రమే పంపించాడని తెలిసింది. ఆయన సభ్యత్వం పునరుద్ధరించబడ్డాక చివరిసారి కలిసినప్పుడు ప్రభుత్వంతో నక్సలైట్‌ పార్టీల చర్చలు జరుగుతున్నాయి. ఆరోజు ఆయనతో జరిపిన చర్చలు మాకు మరో కనువిప్పు. మాలో ఆయన భావాలు దఢపడ్డాయని ఆయన గుర్తించాడా? ఏమో! ఆయనతో పరిచయంలో ఉన్నన్ని రోజులు, లేదా ఆయన ఉన్నన్ని రోజులు మేం విరసం నిర్మాణంలోకి వస్తామని ఊహించను కూడా లేదు. అధ్యయనం సరే, ఏదైనా ఒక నిర్మాణంలో చేరి పనిచేయాలని ఒకసారి సలహా ఇచ్చారు. అప్పటికి మేము రాసే వాళ్ళం కాదు కాబట్టి విరసం నిర్మాణం గురించి సజస్ట్‌ చేసే అవకాశం లేదు.

ఇన్ని రోజుల తర్వాత ఆయన గురించి రాస్తున్నప్పుడు ఆయన రాసిన చివరి అక్షరాల్లో చిక్కుకొని ఉద్వేగం పొరలుతున్నది. ఇది ఆశ్చర్యమే. కాని విరసానికి ఆయన రాసిన ఆత్మవిమర్శనాత్మక దరఖాస్తును ఇప్పుడు చూస్తుంటే ఆయన కొత్తగా అర్థమవుతున్నాడు. మేమాయాన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఏవో కారణాలతో సంస్థకు దూరమయ్యాడని మాత్రమే తెలుసు. అదప్పుడు మాకు పట్టించుకునే విషయమూ కాదు. కానీ సంస్థ అంటే ఏమిటో నిర్మాణం అంటే ఏమిటో ఇప్పుడు బాగా తెలుసుకున్నాం. ʹʹఆ దశాబ్దంలో నా తప్పుల గురించి నేను నామీదే పోరాటం చేసుకొని బైటపడగాలిగానుʹʹ అని ఆయన ఆత్మవిమర్శ రాసుకున్నాడు. అక్కడే కదా మేమాయాన్ని కలిసింది! సంస్థకు దూరమై, వ్యక్తిగత ప్రతిష్ట నిలుపుకోడానికి మాతసంస్థల మీద బురదజల్లే వాళ్ళనే ఎక్కువగా మేం చూస్తున్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి టి.ఎం.ఎస్‌ని చూస్తే విరసానికి దూరమయ్యాక దాదాపు సైలెంట్‌ అయ్యాడు. ఆయన పేరు ప్రఖ్యాతులతో ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ సంస్థకు దూరమయ్యాక ఆ దశాబ్దంలో ఆయన రాసింది, మాట్లాడింది పెద్దగా లేదు. రాష్ట్రమంతా చుట్టే మనిషి జబ్బుపడ్డవాడిలా దాదాపు ఇంటికి పరిమితమైపోయాడు. మేం పలకరించడానికి పోయినప్పుడు ఒంటరిగా కూర్చొని సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడు. సందర్భం వచ్చినప్పుడల్లా విరసం గురించి, విప్లవోద్యమం గురించి, మావో ఆలోచనల గురించి ఎంతో గొప్పగా చెప్పేవాడు.

విప్లవ సాహిత్యోద్యమానికి ఆయన కాంట్రిబ్యూషన్‌ తక్కువేమీ కాదు. కానీ నేనింత చేసానని ఎన్నడూ చెప్పుకొని తిరగలేదు. ʹʹవిరసానికి నేను చేసినదానికన్నా విరసం నాకు చేసిందే చాలా ఎక్కువ. నాకు సాహిత్యరంగంలో చిన్న చిరునామా దొరకడానికి, సాహితీపరుడిగా గుర్తింపు రావడానికి విరసమే కారణంʹʹ అని రాసాడు. తప్పులు మాత్రమే కాదు నేరాలు చేసానని రాసాడు. విప్లవోద్యమాన్ని, ప్రజాపోరాటాలను ఎంత గాఢంగా, లోతుగా అవగాహన చేసుకుంటేగాని ఈ వినయం సాధ్యం కాదు. ఆయన జీవితంలో ఆఖరి సంవత్సరాలను మేము చూసాం. ఎంత దగ్గరగా చూసామని అడిగితే చెప్పలేం కానీ ʹʹవిరసం అభిమానిగానే గడిపిన దశాబ్ది పై కాలంలో సాహిత్యపరంగా, రాజకీయపరంగా నాకు తెలిసి ఏ తప్పూ చేయలేదు. పైగా ఎంతో కొంత విరసం ప్రతిష్ట పెరగడానికే దోహదం చేసానుʹʹ అని ఆయన రాసినదాంట్లో రెండో వాక్యానికి మేం సాక్షులుగా నిలిచాం. కాకతాళీయమో ఏమో గాని 2004 జనవరిలో ఆయన విరసం సభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఆ ఏడాదే ఆయన చనిపోయారు. ఆ మరుసటి ఏడాది 2005 జనవరిలో మేమిద్దరం విరసం సభ్యత్వం తీసుకున్నాం. ఇందుకు నేరుగా ఆయన ప్రేరణ లేదు కానీ మాకు మార్క్సిజాన్ని, దానితోపాటు వర్గపోరాటంలో సాంస్కతికోద్యమ పాత్రను విడమరచి చెప్పిన చెప్పిన ఉపాధ్యాయుడిగా ఆయన పాత్ర ఉంది.

(అక్టోబర్ 28న తిరుపతిలో త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం ఆవిష్కరణ సందర్భంగా)

No. of visitors : 312
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •