వరి గొలుసుల మార్మిక సవ్వడి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

వరి గొలుసుల మార్మిక సవ్వడి

- డా. వెల్దండి శ్రీధర్‌ | 03.11.2018 11:58:23am

పాతికేళ్ళుగా కవిగా కాలంతో పాటు కలిసి నడుస్తూ, తనను తాను సామాజిక చలన సూత్రాల ఆకురాయికి రాసుకుంటూ, తెలంగాణ తెలుగును పుక్కిటబట్టి పుంఖాను పుంఖాలుగా కవిత్వం రాస్తున్న కవి అన్నవరం దేవేందర్‌. ఈయన వెలువరించిన తాజా కవిత్వ పుస్తకమే ʹవరి గొలుసులుʹ. భారతదేశంలో 70 శాతం ప్రజల ప్రధాన ఆహారం వరి ధాన్యం. ఎన్నో గొలుసులను తెంపుకున్న పిదప వరి గొలుసులు వేస్తుంది. ఈ దశ వరి గింజ ప్రయాణంలో చివరిది. అంటే ఫలసాయం చేతికి అందే దశ. ʹవరి గొలుసులుʹ అనే పేరు పెట్టడంలోనే కవి తన దృష్టి కోణాన్ని ధ్వనిస్తున్నాడు. దీనికి నిదర్శనంగా ఈ పుస్తకంలో 50 శాతం కవిత్వం వ్యవసాయశాస్త్రం చుట్టు అల్లుకున్నదే. మహారాష్ట్ర ʹభూమి పుత్రుల పాద యాత్రʹ దగ్గరి నుండి అన్నం ʹపల్లెంʹలోకి చేరేదాకా మట్టి గురించి, మెతుకు గురించి, శ్రమ గురించి మన హృదయాలు కదిలిపోయేలా కవిత్వం సాగిపోతుంటుంది. మిగిలిన యాభై పుటల్లో మానవ సంబంధాలు, స్నేహ మాధుర్యం, ఆరోగ్య తత్వం నిండిపోయి సగటు పాఠకుడికి ఏదో ఎరుకను బోధిస్తుంది.

నిజానికి దేవేందర్‌ పేరు చెప్పగానే సాధారణ పల్లె మనిషిలాంటి నిరలంకారమైన, నిరాడంబరమైన కవిత్వమే జ్ఞప్తికి వస్తుంది. ఇందులో కూడా అలాంటి కవిత్వమే ప్రతి పుట నిండా తాకుతుంది. ఎంచుకున్న వస్తువును తనదైన ముద్రతో చదువరుల మనసులకెక్కించడంలో పాటించే శైలి కూడా అలాగే ఉంటుంది. పల్లె ʹబొడ్రాయిʹ దగ్గర నిలబడి, నగరపు చౌరస్తాలో కూర్చుని ప్రతి విషయాన్ని చాలా జాగరూకతతో పరిశీలిస్తాడు కవి. తన కనుచూపు మేరలోకి వచ్చిన ప్రతి సంఘటనను గుండెలో నిలుపుకొని దానికి కొంత చెమటను, ఇంకొంత దు:ఖాన్ని, మరికొంత నొప్పిని పూసి కవిత్వమై కాగితంపై పరుస్తాడు.

మానవ ప్రయాణంలో ఇన్నేండ్లు జరిగిపోయిన తరువాత గత కొంత కాలంగా ప్రతి మనిషి ఏదో ఒక మాధ్యమంలో రైతు దీన స్థితి గురించి, వ్యవసాయ ప్రాధాన్యత గురించి కదిలిపోతున్నాడు. కలవరిస్తున్నాడు. కవులయితే మరింత ఎక్కువగా కవిత్వమై పారుతున్నారు. దేవేందర్‌ కూడా అందుకు అతీతుడు కాదు.

ʹʹయాసంగి వానా కాలం ఎర్రగాలు
మూడు కాలాలు మూడు తీర్లుగ పంట
కంచంలో తెల్లని మెతుకు అయ్యేందుకు
మన్నులో మన్నైన పాణం
పుటుకంతా పరుల కడుపు నింపే సాయతʹʹ

పెట్టుబడి, దిగుబడి, గిట్టుబాటు ధరలు తదితర ఆర్థికశాస్త్ర లోతులు తెల్వని రైతుల దృష్టి లోకుల ఆకలి తీర్చడమే. అది నిరంతర తపస్సు. లాభ నష్టాలు వాళ్లకు గిట్టవు. వ్యవసాయమే వాళ్ల బలం, బలహీనత. అందుకే భూమి మీద ఇంకా మానవ ప్రాణి ఏదో తెలియని అహంకారంతో విర్రవీగుతుంది. రైతులంతా క్రాఫ్‌ హాలీడే ప్రకటిస్తే అర్థం అవుతుంది. మెతుకు విలువ. బతుకు విలువ. ఈ లోకంలో వరిగొలుసుల సవ్వడి వినిపించినంత కాలం ఈ నేల మీద మనిషి అలికిడికి ఎదురు లేదు. వరి గొలుసులు కాస్త తెగి, రైతులు తెగిపడితేనే ప్రపంచానికి నూకలు చెల్లేది. అందుకే రైతులంతా మూకుమ్మడిగా మద్దతు ధర ప్రకటించుమని, గిట్టుబాటు ధర కల్పించుమని, రుణ మాఫీ చేయుమని, నీటి వసతి కల్పించుమని రోడ్డు మీదికెక్కి మరీ పాద యాత్రలు చేయాల్సి వస్తోంది. అయినా ఈ ప్రభుత్వాలు, వ్యాపారులు, సహకార సంఘాలు కదలవు. కాసింత జాలి చూపవు.

ʹʹఅవి బురద పొలం దున్నిన కాళ్లు
ఎద్దూ ఎవుసం సుట్టు తిరిగిన అరికాళ్లు
దుబ్బ చెల్కల నడిచిన పాదాలు
కొయ్యకాలు గుచ్చుకున్న అడుగులు
ఊరూరి దుక్కం ఒక్కటై పారిన
మరాఠా రైతాంగపు మర్లపడ్డ పౌరుషంʹʹ

ఎక్కడైతే పొలంలో ఉండాల్సిన కాళ్ళు రోడ్డు మీదికొచ్చి పాద యాత్రలు చేస్తాయో, ఏ దేశంలో అయితే రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతుంటాయో, ఏ నేల మీద సరైన ధరకు అమ్మలేక రైతు పంటను రోడ్డు మీద పారబోస్తాడో అక్కడ తప్పకుండా మానవత్వం కాలి బూడిదైందని, మెతుకును బతికించుకోలేని ప్రభుత్వాలు రాజ్యం చేస్తున్నాయని అర్థం. అందుకు తార్కాణమే మహారాష్ట్ర భూమి పుత్రుల మహా పాదయాత్ర. ఎన్ని పాదాలు నెత్తురోడాయో, ఎన్ని పాదాలకు పొక్కులు పొడిచి కనీసం నడవడం కూడా దుర్లభమనిపించిందో, ఎన్నిపాదాలు ఆకులు, తెగిపోయిన చెప్పులు వేసుకొని కనీస హక్కుల కోసం పరితపించాయో ప్రపంచమంతా వీక్షించింది. అయినా ప్రభుత్వాలు కదలకపోవడం గర్హనీయం.

ʹʹఆడికీడికి ఆసుపోసుడు
రాట్నం మీద గిరిగిరి తిరిగే దారం
కిటికిలకెల్లి కటకట మొగ్గం సప్పుడు
కమ్ముకున్న కొత్తబట్ట వాసన
అది శాలోల్ల ఇల్లు వసుధకు వస్త్రపు హరివిల్లుʹʹ

పారిశ్రామిక విప్లవం తరువాత చేతి వృత్తుల చేతులు సగం విరిగిపోయాయి. ప్రపంచీకరణ తరువాత మిగిలిన సగం విరిగిపోయి మనిషిప్పుడు చేతులు లేని, పనిలేని ఒట్టి ఎండిన కట్టెలాగా జీవితంపై నిలబడి బేలగా చూస్తున్నాడు. అంతకు ముందు పల్లె ఇంటిలోని ప్రతి వాకిలీ జీవనోత్సవ గీతంతో పుణీతమయ్యేది. వృత్తుల కాంతిపుంజం ఇంటి నిండా ఏదో వెలుతురును పరిచేది. శ్రమజీవుల సింగారం, పనిమంతుల అనురాగం కలిసి పల్లెను కళాత్మక జీవన సౌందర్యంతో అలంకరించేది. ఇప్పుడు ఇదంతా గత వైభవంగా మిగిలిపోయింది. అందుకే దేవేందర్‌ ʹవాకిలి గీతʹమై పగిలిపొయ్యేది. తల్లడమల్లడమయ్యేది.

ʹʹనడిచేటప్పుడు నాగలి దున్నేటప్పుడు
ఎడ్ల మేపేటప్పుడు
ఎల్లవేళలా ఆయన జబ్బమీద తువ్వాల
ఒక రెపరెపలాడే పతాకంʹʹ

స్త్రీలకు పైట ఎంతో, పురుషులకు తువ్వాల అంత. పాశ్యాత్య ప్రభావం వలన మన వేష, భాషలు మారాయి కాని నిజానికి మన దేశ శీతోష్ణ స్థితికి చీర, పంచె కట్టే సరైనదని ఒక అధ్యయనం. భుజమ్మీద తువాలుంటేనే పురుషుల మూర్తి సమగ్రమయ్యేది. ఒకప్పుడు తువ్వాలు లేనిదే కడప దాటి పోయేవారు కాదు. తువ్వాలంటే రెండు మూరల గుడ్డ పేలిక కాదు. అది మనిషి జీవితంలోని ప్రతి సందర్భంలో ఒక పనిముట్టుగా సాయపడే తాత్విక పేగుబంధం. అందుకే ఓ కవి ʹభుజమ్మీది తువ్వాలు ఎన్ని దు:ఖ సముద్రాల్ని మోసిందోʹ అంటాడు.

ʹʹవేల ఏండ్లుగా వాల్లు మన్ను నుంచి
వడ్లూ, జొన్నలు, గోధుమలు పండిస్తున్నరు
సింధూ నాగరికత నుంచే వాల్లు ఇత్తనమై
కుండలు గురుగులకు జీవం పోస్తున్నరు
అనాది నుంచే వాల్లు మన దేహం కోసం
చీరలు ధోతులు దుప్పట్లు నేస్తున్నరు
సర్వ మానవాళి అరిపాదాలకు
ముండ్లుగుచ్చకుండా చెప్పులు ముడుస్తున్నరుʹʹ

ఈ దేశం ఎవరిది? ఎక్కడి నుండో తరలి వచ్చి విశ్రాంతి వర్గంగా ఉన్న బ్రాహ్మణులు, ఆధిపత్య వర్గాలదా? లేక ఉత్పత్తిలో భాగస్వాములయ్యే మూలవాసి బహుజనులదా? అనేది ఎప్పటికీ చర్చగానే మిగిలిపోతుంది. ఎందుకంటే పాలకులంతా ఆధిపత్య వర్గాలవారు. పాలితులంతా సబ్బండ వర్ణాలవారు. ఎన్ని రోజులు బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉంటారో అన్ని రోజులూ ఏదో రకమైన దోపిడి కొనసాగుతూనే ఉంటుంది. మనిషి మనుగడ కోసం ఎన్నో వృత్తులకు జీవం పోసి, వాటి ఉనికికి ప్రాణం ధారపోసిన వృత్తి కులాల వాళ్లను కరివేపాకులాగా తీసి పక్కకు పెడుతున్నాం. కాని అభివృద్ధి ఫలాలు చివరి మనిషికి కూడా చేరాలంటే ఇకనైనా బహుజనులకు రాజ్యాధికారం అప్పగించాలనే ʹతత్వంʹ ఇప్పటి పాలకులకు ఎప్పటికి అలవడుతుందో! కాలమే తేల్చాలి. దేవేందర్‌ ఈ మర్మమెరిగిన కవి కాబట్టే బహుజనుల ప్రాధాన్యతను చాలా తాత్వికంగా, చారిత్రకంగా చెప్పాడు.

అంతిమంగా దేవేందర్‌ కవిత్వం చెమట పక్కన నిలబడి, దు:ఖాన్ని పట్టించుకున్న కవిత్వం. భూమికి పుట్టుమచ్చల్లా ఉన్న గుట్టలు కరిగిపోతున్నా, ʹతల్లివేరుʹలాంటి ఊరు మాయమవుతున్నా, దుక్కం మూటగట్టుకొని ఊరూ వాడా తిరిగి చివరికి తన పత్తిచేనుకే చేరుకున్న రైతు ఆత్మహత్య గురించి మాట్లాడినా, శూద్రుల విద్యా వికాసాన్ని గురించి తపించిన జ్యోతిబా పూలే గురించి చెప్పినా, ఒంటరి మహిళల అవమానాలను వర్ణించినా, త్యాగాల ప్రతిరూపమైన అమ్మ కమ్మదనాన్ని ఎత్తిచూపినా, నెత్తుటి పుండు నేరెల్ల గురించి విప్పి చెప్పినా, ఆత్మీయ సోపతిగాళ్ల గురించి రాసినా, స్థూపాలై నిలిచిన మట్టి మనుషుల గురించి పొగిలిపోయినా దేవేందర్‌ కవిత్వమంతా నేల మీదనే సాము చేస్తుంది. వాస్తవ రేఖ మీద కొట్లాడుతూ ఏ వెలుతురు కోసమో తపిస్తుంది. ప్రతి కవిత ఒక బాధామయ లోకాన్ని చవిచూపిస్తుంది. మనిషితో కలిసి నడిచే ఏ కవైనా ఇంతకు మించిన కవిత్వం రాయలేరేమో! అయితే ఎక్కువ భాగం సామాజిక సంఘటనా ప్రేరిత కవిత్వం కావడం మూలంగా కొన్ని సార్లు కవిత్వం పాలు తగ్గిందేమోననిపిస్తుంది. కాని ఊహపోహల్లో తిరుగాడే కవిత్వంలోనైతే ప్రతి పాదంలో కవిత్వాన్ని పొదగ వచ్చు. సమాజాన్ని దాన్ని మూలమలుపులను వెనువెంటనే కవిత్వం చేసేటపుడు ఇలాంటివి తప్పవేమో! ఏది ఏమైనా దేవేందర్‌ కవిత్వంలో కాంతి హీనమైన రాతి వెలుగు కంటే, గుప్పెడు గుండెను వెలిగించే రత్నాల కాంతే ఎక్కువ.


No. of visitors : 324
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •