జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య

| సాహిత్యం | వ్యాసాలు

జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య

- ఎ. నర్సింహారెడ్డి | 03.11.2018 12:14:28pm

సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు, అసమ్మతివాది, వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్ట్‌ జమాల్‌ అహ్మద్‌ ఖషోగి టర్కీలోని (ఇస్తాంబుల్‌) సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లి ʹఅదృశ్యంʹ కావడం దిగ్భ్రాంతికరం. సౌదీ ప్రభుత్వం ఖషోగిని హతమార్చింది. సౌదీలో ఉన్నది రాచరిక పాలన. అక్కడ స్వేచ్చా స్వాతంత్య్రాలకు తావులేదు. ఇటీవలి కాలంలో సౌదీ రాచరిక వ్యవస్థ మరింత క్రూరంగా మారింది. అసమ్మతి ఎక్కడ తలెత్తినా అణిచేయడం, విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో చంపేయడం ఒక అలవాటుగా సౌదీ అరేబియాకు మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చాలా కాలంగా సౌదీ అరేబియాను వెనకేసుకు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సౌదీ పాలకుడు యువరాజు సల్మాన్‌ అత్యంత ఆప్తుడు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బలోపేతమై తాను మొత్తం అధికారాలు చేజిక్కించుకున్న తర్వాత అసమ్మతివాదుల అపహరణలు, హత్యలు, అదృశ్యాలు పెరిగిపోయాయి. సౌదీ రాచరిక వ్యవస్థ దేశంలో, అంతర్జాతీయ రంగంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. రాచరిక వ్యవస్థ అంటేనే నిరంకుశమైనది. అందులోనూ మతం రంగు పులుముకున్న సౌదీ రాచరికం అత్యంత అమానవీయమైనది, భయంకరమైనది.

ఖషోగి తన మొదటి భార్యకు విడాకులిచ్చి, టర్కీలో ఉన్న ప్రేయసి హటీజ్‌ చెంగిజ్‌తో పెళ్లికి రంగం సిద్ధం చేసుకున్నాడు. విడాకుల సర్టిఫికెట్‌ను తీసుకునేందుకు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు అక్టోబర్‌ 2న వెళ్లాడు. తన కాబోయే భార్యను బయట ఉండమని, ఒంటరిగా వెళ్లారు. ఆయనకు సౌదీ రాచరిక వ్యవస్థపై అనుమానాలు ఉన్నందున, తాను బయటకు రాకపోతే, టర్కీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని కూడా హెచ్చరించారు. భయపడినట్టే సౌదీ రాయబార కార్యాలయం లోపలికి వెళ్లిన జమాల్‌ ఖషోగి తిరిగి బయటకు రాలేదు. 10 గంటల తర్వాత కూడా ఖషోగీ బయటికి రాకపోవడంతో ఆమె టర్కీ అధికారులకు చెప్పింది. అప్పటికే జరగాల్సినది జరిగిపోయింది. జమాల్‌ ఖషోగి అక్టోబర్‌ రెండవ తేదీలో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలోకి వెళ్లినప్పుడు చివరిసారి కనిపించారు.

59 ఏళ్ల ఖషోగి సౌదీలో పేరుమోసిన జర్నలిస్టు. ఆఫ్ఘానిస్తాన్‌లో సోవియట్‌ దాడి, ఒసామా బిన్‌ లాడెన్‌ ఉత్థానం, గల్ఫ్‌ యుద్ధం, సద్దాం హుస్సేన్‌ పతనం, యెమన్‌, సిరియా, పాలస్తీనా సంక్షోభాలు మొదలైనవెన్నో కవర్‌చేసిన అగ్రశ్రేణి పాత్రికేయుడు. అల్‌-అరబ్‌ న్యూస్‌ ఛానెల్‌కు ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌, అల్‌వతన్‌ అనే సౌదీ పత్రికకు సంపాదకుడు. రాజకుటుంబానికి సన్నిహితుడు కానీ కొన్ని హత్యారాజకీయాల్ని సహించలేక యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో విభేదించి దేశం నుంచి పారిపోయి అమెరికాలోని వర్జీనియాలో తలదాచుకుంటున్నారు. గతంలో వివాహమాడిన మహిళ నుంచి విడాకుల ధ్రువపత్రం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పత్రం అప్పగిస్తామని చెప్పి సౌదీ రాయబార కార్యాలయ అధికారులు ఖషోగిని ఇస్తాంబుల్‌కు రప్పించుకున్నారు. బయటకు పొక్కిన సమాచారం ప్రకారం ఖషోగిని బంధించి హత్య చేయడానికి సౌదీ నుంచి పదిహేను మంది టర్కీ రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను హింసించి హత్య చేశారనీ, శరీరాన్ని ముక్కలుచేసి బయటకు తరలించారని ఆరోపణలున్నాయి.

ఖషోగి సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలోకి వెళ్లినట్టుగా బయట కెమెరాల్లో కనిపిస్తుంది. కానీ బయటకు వచ్చినట్టు దాఖలాల్లేవు. ఏమయ్యాడని ప్రపంచమంతా ప్రశ్నించింది. బయటకు వెళ్లిపోయాడని, తమకు తెలీదని సౌదీ ప్రభుత్వం రెండు వారాల పాటు బుకాయించింది. ఈలోగా ఆయన లోనికి వెళ్తున్న సిసిటివి దృశ్యాలు బయటికొచ్చాయి. దాంతో సౌదీపై ఒత్తిడి మరింత పెరిగింది. ఆయనను సౌదీ రాజప్రభుత్వం చంపేసి ఉంటుందని కథనాలు ఊపందుకున్నాయి. అమెరికా సైతం ఏమయ్యాడో చెప్పాలని సౌదీ సర్కారును డిమాండు చేయడంతో చేసేది లేక ఆయన తమ కాన్సులేట్‌లో తమ అధికారులచేత హతుడయ్యాడని సౌదీ సర్కారు ఒప్పుకుంది. అయితే ఇద్దరి మధ్య ఘర్షణలో చనిపోయాడని మాత్రమే పేర్కొంది. ఒక వ్యక్తి ముష్టిఘాతాల కారణంగానే చనిపోయాడన్న సౌదీ ప్రకటన అబద్దమని అమెరికా, టర్కీ దర్యాప్తు సంస్థల విచారణలో రుజువైంది. ఖషోగి హత్య వెనుక సౌదీ కాబోయే రాజు సల్మాన్‌ హస్త ముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఖషోగికి సౌదీ రాచ కుటుంబాలతో విస్తృతమైన సంబంధాలున్నాయి. సుదీర్ఘకాలం సంపాదక స్థాయిలో పనిచేసినందు వల్ల పాత్రికేయులతోనే కాకుండా, సమాజంలోని భిన్న వర్గాలతో పరిచయం ఉన్నది. విదేశాల్లో కూడా పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనకు సౌదీ అరేబియాలోనే కాకుండా, అరబ్బు ప్రపంచమంతటా అభ్యుదయ వాదులలో గుర్తింపు ఉన్నది. ట్విటర్‌లో ఆయనను ఇరువై లక్షల మంది ఫాలో అవుతుంటారు. అమెరికాలోని ప్రముఖ దినపత్రికకు వ్యాసాలు రాస్తుంటారు. సౌదీ అరేబియా యువరాజు సల్మాన్‌ తమ దేశంలోని అసమ్మతి వాదులను అణిచివేస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. సౌదీ అరేబియా పొరుగున ఉన్న ఖతార్‌తో కయ్యానికి దిగడాన్ని, యెమెన్‌లో దాడులు చేయడాన్ని, లెబనాన్‌తో గొడవలను, మహిళా హక్కుల ఉద్యమకారిణిని లౌజైన్‌ అల్‌-హత్‌ను అబుదాబిలో అపహరించి సౌదీలో నిర్బంధించడాన్ని ఆయన విమర్శిస్తూ వ్యాసాలు రాశారు.

పత్రికా ప్రముఖుడైన ఖషోగి వ్యాసాలను భరించలేని సౌదీ ప్రభుత్వం ఆయనను హతమార్చింది. ఆయననను హింసించి హత మార్చినట్టు కొన్ని అధారాలు బయటపడ్డాయి. ఈ ఆధారాలు ఖషోగి ధరించిన యాపిల్‌ వాచ్‌ ద్వారా ఆయన కాబోయే భార్య దగ్గర ఉన్న ఫోన్‌కు చేరుకున్నాయని అంటున్నారు. లేదా టర్కీ ప్రభుత్వం సౌదీ అరేబియా కార్యాలయంలో రహస్యంగా అమర్చిన రహస్య కెమెరాల ద్వారా బయటకు వచ్చి ఉంటాయి. సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో తాము గూఢచర్యం చేసినట్టు టర్కీ బహిరంగంగా అంగీకరించదు. ఏది ఏమైనా ఖషోగి అదృశ్యంపై నిష్పాక్షిక విచారణ జరిగేవిధంగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు ఖషోగ్గి అదృశ్యాన్ని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఖషోగి అదృశ్యం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉంటే, కఠినంగా వ్యవహరిస్తామని మాట మాత్రంగా అన్నారు. ఆ వెంటనే సౌదీకి ఆయుధ సరఫరా మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు. సౌదీ యువరాజు సల్మాన్‌ అణిచివేత విధానాలకు ట్రంప్‌ వత్తాసు ఉన్నదనేది జగమెరిగిన సత్యం.

సౌదీలో ఏం జరిగినా పాశ్చాత్య దేశాలు స్పందించవు. భౌగోళికంగా పశ్చిమాసియా వాటికి అత్యంత కీలకమైన ప్రాంతం. అలాగే గల్ఫ్‌ దేశాల్లో అపారంగా ఉన్న చమురు నిక్షేపాలు వాటికి అవసరం. అందుకే అక్కడ నియంతృత్వ పోకడలున్నా, మానవ హక్కుల ఉల్లంఘన సాగుతున్నా అమెరికా మొదలుకొని ఏ అగ్రరాజ్యమూ నోరెత్తదు. ఏడాది క్రితం అధికార పగ్గాలు అందుకున్న యువరాజు సల్మాన్‌ సౌదీ విజన్‌-2030 పేరిట డాక్యుమెంటు విడుదల చేసి దేశాభివృద్ధిలో మహిళలు పాలుపంచుకునేలా కొన్ని అవకాశాలు పురుషులతో సమానంగా కల్పించాడు. దీన్నే పాశ్చాత్య దేశాలు కీర్తించాయి. కానీ నిరుడు అవినీతి వ్యతిరేక చర్యల పేరిట గంపగుత్తగా యువరాజులను, మంత్రులను, వ్యాపారులను ఎడాపెడా అరెస్టు చేసి జైళ్లలో పెడితే ఈ దేశాలు నోరెత్తలేదు.

ఖషోగి హత్యకు ప్రధాన సూత్రధారి సౌద్‌-అల్‌-కథానీ, సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌)కు అత్యంత సన్నిహితుడు. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌)కు కథానీ నమ్మినబంటు. తన రాజ కుటుంబానికి రక్తం అంటకుండా ఖషోగిని మరో దేశంలో చంపేందుకు ప్రణాళిక రచించాడు. 15 మందితో హంతక ముఠాను ఏర్పాటు చేశాడు. ఖషోగీ రూపాన్ని పోలి ఉండే ముస్తఫా అల్‌ మదానీని చేర్చుకున్నాడు. ఈ మదానీ కూడా ఖషోగీ వయసు వాడే. అంతే ఎత్తు, గడ్డం కళ్లజోడు తగిలిస్తే అచ్చం అలానే కనిపించాడు. ఖషోగీ కాన్సులేట్‌లోకి వెళ్లడానికి 4 గంటల ముందే మదానీ అందులోకి వెళ్లాడు. వెళ్లేటప్పుడు అతను బ్లూ-వైట్‌ చెక్స్‌ షర్టు ధరించాడు. గడ్డం లేదు. ఖషోగిని మదానీ, మిగిలిన హంతకులు కాన్సులేట్‌లోనే మట్టుబెట్టారు. తరువాత గంట సేపటికి మదానీ కాన్సులేట్‌ వెనుక డోర్‌ నుంచి బయటపడ్డాడు. విశేషమేమంటే బయటికొచ్చేటప్పుడు ఖషోగి ధరించిన గ్రే కలర్‌ షర్టు, నల్లరంగు కోటుతో వచ్చాడు. గడ్డంతో కనబడ్డాడు. ఈ దృశ్యాలన్నీ నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. అంటే ఖషోగి వెనక డోర్‌ నుంచి కాన్సులేట్‌ బయటకు వెళ్లాడని ప్రపంచాన్ని నమ్మించడానికి ఈ డూప్‌ స్టోరీని అమలు చేశారు. కానీ సిసిటివి పుటేజిని జూమ్‌చేసి చూస్తే మదానీ నకిలీ గడ్డం, పోలికలు తక్కువగా ఉన్న రూపం, ఖషోగి దుస్తులు ధరించిన తీరు.. అన్నీ బయటపడ్డాయి. ఈ దృశ్యాలను టర్కీ ప్రభుత్వం విడుదల చేసింది.

ఖషోగి హంతకులకు సౌద్‌ అల్‌ కథానీ రియాద్‌ నుంచి స్కైప్‌ ద్వారా ఆదేశాలు పంపాడు. ఖషోగి అడుగుపెట్టిన వెంటనే హంతకముఠా అతన్ని లోపలికి బలవంతంగా తీసుకెళ్లింది. ఖషోగిని కథానీ అరబిక్‌లో బండబూతులు తిట్టినట్లు, ఇష్టానుసారం కొట్టండని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. చివరకు ʹఆ కుక్క తల నరికి నా దగ్గరికి తీసుకురండిʹ అని హంతకులను కథానీ ఆదేశించాడు. ఈ ఆడియో సంభాషణకు సంబంధించిన టేపు ప్రస్తుతం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. సౌద్‌ అల్‌ ఖతానీ సూత్రధారి అని స్థానిక మీడియా కథనాలు రాసింది. స్కైప్‌ ద్వారా సౌదీ రాయబార కార్యాలయంలో నిఘా వర్గాలకు, దౌత్యాధికారులకు ఆయన సూచనలు చేశారని టర్కీ నిఘా వర్గాలు బయటపెట్టాయి. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ టర్కీ వద్ద ఉందని తెలుస్తున్నది. సౌదీలో సోషల్‌ మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడం, 200 మంది ప్రజాస్వామిక వాదుల్ని జైల్లో పెట్టడం, 2017లో లెబనాన్‌ ప్రధానిని నిర్బంధించిన వ్యవహారాల్లో ఖథానీ పేరు ప్రధానంగా వినిపించింది.

ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సుల్‌ జనరల్‌ ఇంటిలో ఆవరణలో ఉన్న తోటలోని బావిలో ఖషోగి శరీర భాగాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా అక్టోబర్‌ 23న వెల్లడించింది. ముక్కలు ముక్కలుగా శరీర అవయవాలు, ముఖం పూర్తిగా చెక్కెసిన స్థితిలో లభించినట్లు తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపిన ప్రముఖ జర్నలిస్టు జమాల్‌ ఖషోగి (59) దారుణహత్య కేసులో కీలక మలుపు. మరోవైపు ఖషోగిని పక్కా ప్రణాళిక ప్రకారమే అత్యంత క్రూరంగా హత్య చేశారనీ టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆరోపించారు. సౌదీ అరేబియాకు చెందిన 15 మంది ఈ హత్యల్లో పాల్గొన్నారని వెల్లడించారు. హంతకులు హత్యకు ముందురోజే సౌదీకి చెందిన 15 మంది మూడు వేర్వేరు విమానాల్లో టర్కీకి చేరుకున్నారు. టర్కీకి చేరుకున్న నిందితులు అక్కడి సౌదీ రాయబార కార్యాలయంలో పాశవికంగా ఖషోగిని హతమార్చారని చెప్పారు. క్రూర, దారుణ కుట్రతో కూడిన హత్యగా దీన్ని ఎర్డోగన్‌ అభివర్ణించారు.

ఈ దారుణంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు సౌదీ అరేబియా అంగీకరించాలని కోరారు. ఖషోగి హత్యపై అసత్యాల్ని ప్రచారం చేసి అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేసిందంటూ సౌదీపై ఎర్డోగన్‌ నిప్పులు చెరిగారు. మంగళవారం అధికార పార్టీతో ఎంపీలతో ఎర్డోగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖషోగి హత్యకు ముందే ప్రణాళికలు రచించారు. తన వివాహ పత్రాల కోసం అక్టోబర్‌ 2న ఖషోగి సౌదీ రాయబార కార్యాలయానికి వస్తారన్న సమాచారం ముందే తెలుసుకున్న ఈ బృందం అక్కడికి చేరుకుని అతడిని అతి క్రూరంగా హత్యచేసిందని ఆయన అన్నారు. హంతుకులపై విచారణ జరుపాలని ఎర్డొగాన్‌ డిమాండ్‌ చేశారు. హత్యకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో టర్కీ ఎంతవరకు సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలకుడుతుందనేది అనుమానమే.

సౌదీ అరేబియా ప్రభుత్వం విదేశాల్లో ఉన్న అసమ్మతి వాదులను కూడా వదలకుండా వారిని అపహరించడం, హతమార్చడం ప్రమాదకర ధోరిణి. ఈ సంప్రదాయం ఇతర దేశాలు కూడా అనుసరిస్తే, భూగోళంపై స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండవు. ఖషోగి హత్య సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలతోనే జరిగిందని ఆరోపణలు వెళ్లువెత్తాయి. అయినా ఎర్డోగన్‌ మాత్రం ఆయన పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖషోగి హత్య సమయంలో రాజ కుటుంబానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి నుంచి నాలుగుసార్లకు పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు టర్కీకి చెందిన ఓ పత్రిక పేర్కొన్నది. ఖషోగి హత్య అత్యంత దారుణ తప్పిదమని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్‌ అల్‌ జుబేర్‌ అన్నారు. దర్యాప్తు తర్వాత వాస్తవాల్ని ప్రపంచానికి వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఖషోగి హత్యను బెడిసికొట్టిన కుట్రగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ఖషోగి హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు మంత్రుల వీసాలు రద్దు చేయనున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో తెలిపారు.

సౌదీ రాచరికం మతం పేరుతో కఠిన శిక్షలను అమలుచేస్తూ, ప్రత్యర్థులను అణిచివేస్తున్నది. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ నెలకొనాలని కోరుతున్న అనేకమందిని జైళ్లలో కుక్కింది. అనేక మందిని హతమార్చి కూడా ఆ విషయాన్ని అంగీకరించడంలేదు. ఇప్పటికీ కనీసం వంద మంది విద్యావేత్తలు, ఇస్లామిక్‌ పండితులు, ప్రజాస్వామ్య ఉద్యమకారులు, ఇతర ప్రముఖులు సౌదీ జైళ్లలో ఉన్నారు. దేశంలో సంస్కరణలు కోరుతున్నందుకు అనేక మంది రాజవంశీయులను కూడా గృహ నిర్బంధంలో పెట్టింది. సౌదీ అరేబియా రాజ కుటుంబాలకు చెందిన ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ తుర్కికి అసమ్మతివాదిగా పేరున్నది. సౌదీ ప్రభుత్వానికి భయపడి ఆయన జెనీవాలో తలదాచుకుంటున్నాడు. 2003లో ఆయనను సౌదీ ప్రభుత్వం జెనీవాలో అపహరించి, తమ దేశానికి తరలించి జైలో పెట్టింది.

లెబనాన్‌ ప్రధానిని తమ దేశానికి అతిథిగా ఆహ్వానించి, నిర్బంధించి, రాజీనామా ప్రకటన చేయించింది. కానీ అంతర్జాతీయ ఒత్తిడి రావడంతో విడుదల చేసింది. అమెరికా కూడా ఇరాక్‌, అఫ్ఘానిస్థాన్‌, లిబియా దేశాలపై దాడులు సాగించిన అనంతరం ఎవరిని ఏ దేశంలో నిర్బంధించి ఎక్కడికి తరలిస్తున్నారో అంతుచిక్కని పరిస్థితి ఏర్పడ్డది. చైనా, రష్యా దేశాలు కూడా ఇటువంటి నిర్బంధాలకు, దాడులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అంతరంగికంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా సౌదీ అరేబియా వ్యవహారసరళి ప్రమాదకరంగా ఉన్నది. పశ్చిమాసియాలో పలు ప్రభుత్వాలను కూలదోయాలని, కొన్ని దేశాలను ముక్కలు చేయాలని అమెరికా ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. ఈ పథకంలో సౌదీ అరేబియా ప్రధాన పాత్రధారి. సౌదీ అరేబియా మరికొన్ని అరబ్బు దేశాలు ఖతార్‌ను ఏకాకిని చేయడానికి ఆ దేశంపై ఆంక్షలు విధించడం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రోద్బలం ఉన్నది. యెమెన్‌పై దాడుల వెనుక కూడా ఇరాన్‌ను దెబ్బకొట్టాలనే అమెరికా వ్యూహం ఉన్నది.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు, ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం పలు దేశాలపై పెరిగింది. మరోవైపు మూడు దశాబ్దాల కాలంలో ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు బలహీనపడటం, అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కడం, కొన్ని దేశాలు ఇతర దేశాలపై దాడులకు దిగడం, అపహరణలు సాగించడమనే ప్రమాదకర ధోరణి పెరిగిపోయింది. ఈ పోకడను వెంటనే అరికట్టకపోతే ప్రపంచ దేశాల, ప్రజల స్వేచ్చా స్వాతంత్య్రాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ పూర్వ రంగంలో సౌదీ అరేబియాను కట్టడి చేయకపోతే ఆ దేశంలోని ప్రజలకే కాదు. అంతర్జాతీయ శాంతికి కూడా భంగకరం. అంతర్జాతీయ సమాజం సౌదీ అరేబియా విధానాలను తీవ్రంగా ఖండించాలి. సౌదీ అరేబియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పడానికి అక్కడి ఉద్యమకారులకు తోడ్పాటు అందివ్వాలి.
నిరంకుశత్వానికీ, భావప్రకటన స్వేచ్ఛకు ఎప్పుడూ పొసగదు. నియంతల పాలనంటే పడగనీడ బతుకులే, రాచరికానికి నియంతృత్వం జతకూడితే ప్రజలకు ఏ హక్కులూ ఉండవు. అసమ్మతి, అసంతృప్తి తలెత్తితే, కర్కశ అణచివేత చర్యలు చేపడతారు. ఇవాళ దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, ప్రయోజనాలే పునాది. విలువల గురించి ఎవరికీ పట్టింపు లేదు. ఈ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విమర్శలతో అమెరికా ఇప్పటికైతే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతోంది. కానీ పూర్తిగా నమ్మడానికి లేదు. అది మున్ముందు టర్కీ, సౌదీలకు రాజీ కుదిర్చి దీన్ని కప్పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. విలువలు వదిలి నిరంకుశ, అనాగరిక వ్యవస్థల్ని భుజాన వేసుకుని ఊరేగే దేశాలున్నంత కాలం ఖషోగి లాంటివారు మాయమవుతూనే ఉంటారు. అందుకే ఈ కేసులోని సూత్రధారులకూ, పాత్రధారులకూ శిక్షలు పడేంత వరకు అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No. of visitors : 238
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •