ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

- డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 19.11.2018 03:43:55pm

కవిగా మొదలు కావడం చాలా సులభం. నిలదొక్కుకోవడం, కాలం వెంట ఒంటికాలుతోనో, ఒంటరిగానో, గాయాలతోనో, దు:ఖంతోనో కలిసి నడవడం మాత్రం చాలా కష్టం. నాలుగు దశాబ్దాలుగా తనను తాను నిత్యం ʹతేజాబ్‌ʹలో ముంచుకుంటూ, శుద్ధిచేసుకుంటూ సామాన్యుడి బాధను కవిత్వంగా తర్జుమా చేస్తూ, ప్రతిపక్షంలో నిలబడి ప్రశ్నల కొడవళ్లను సంధిస్తూ, దండల కోసమో, దుశ్శాలువాల కోసమోకాక కవిత్వాన్ని చాలా బాధ్యతగా రాస్తున్న కవి జూకంటి జగన్నాథం. 1975 నుండి రాస్తున్న కవిత్వాన్నంతా 2013లోనే సమగ్ర సంకలనంగా తీసుకొచ్చిన జూకంటి ఆ తరువాత ʹచెట్టును దాటుకుంటూʹ, ʹపసʹ కవితా సంపుటాలను వెలువరించారు. ఇప్పుడు తాజాగా ʹఊరు ఒక నారుమడిʹ.

పొలాన్ని నాటు వేయడానికి ముందు ఏదో ఒక మడిలో నారు పోస్తారు. అతి కొంత ఎదిగిన తరువాత దాన్ని ఆ మడి నుండి వేరు చేసి పొలమంతా నాటు వేస్తారు. చిత్రమేమిటంటే నారు పెరిగిన మడి బలహీనమైపోయి ఎన్ని ఎరువులు దట్టించినా ఆ మడిలో పైరు బలంగా రాదు. మిగతా పొలం మాత్రం చాలా ఏపుగా పెరుగుతుంది. నిజానికి మనమంతా గ్రామాల్లో నారుగా పెరిగి పట్నాల్లో నాటు వేయబడిన వారమే. నారుమడి బలహీనమై పోయినట్టు ఇప్పుడు గ్రామాలన్నీ వట్టిపోయి పట్టణాలన్నీ బలిసిపోతున్నాయి. అందుకే కవి ఊరును నారుమడితో పోల్చి ఈ కవితా సంపుటికి ʹఊరు ఒక నారుమడిʹ అని పేరు పెట్టాడు. పేరులోనే ఫలసాయమంతటి కవిత్వం దాగి ఉంది. ఇక పుటలు తెరిచి అక్షరాల వెంట పోతుంటే ఊరు, మనిషి, వృత్తులు, విలువలు ఎంతగా నలిగిపోతున్నాయో అవగతమవుతుంది.

మానవ సంబంధాలన్నీ ఇప్పుడు వ్యాపార సంబంధాలే. విలువల్నీ, వలువల్నీ తుంగలో తొక్కి తైతక్కలాడుతున్నారు. ఇండియా అంతా సరుకు అమ్ముకునే బజారైపోయింది. లేదంటే అరొక్కటి ఆన్‌లైన్‌లోనే తెప్పించడం. ప్రభుత్వాలు కూడా షరతులు లేని అనుమతులు మంజూరు చేస్తూ బహుళజాతి కంపెనీలు మన దేశంలో కంపెనీ పెట్టడమే అదృష్టంగా, పూర్జ జన్మలో లభించిన వరంగా భావిస్తున్నాయి. అందుకే ఎన్నెన్నో దేశాలు సందర్శించి మా దేశంలో వ్యాపారం చేసుకోండని వాళ్లను కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడడం.

ʹʹమా ఎవుసం ఏట్లె కలుస్తేంది

మీ విత్తనం మాపై పెత్తనం చేస్తే చాలు

ఆత్మహత్యలను కర్మఫలంపై తోసేస్తాం

ధర్నాలు నిరసనలను శాంతి భద్రతలుగా రాసేస్తాంʹʹ

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి రావడమే లక్ష్యం. ఇక్కడి పరిశ్రమలు, ఉత్పత్తులు, మానవ జీవితాలు ఏమైనా కానీ. నిరసన తెలిపితే లాఠీ ఝళిపిస్తారు. ఉమ్మస్తే తుడుచుకుపోతారు. గురి అంతా లాభాలపైనే ఎన్ని జీవితాలైనా పొక్కిలి కానీ. విధ్వంసమైపోనీ వాళ్లకు లెక్కలేదు. అసలు మనిషిని మనిషిలా చూడడమే లేదు. ఏ మనిషైనా అయితే కరెన్సీ నోటుగా కనిపిస్తాడు. లేదా వస్తువుగా దర్శనమిస్తాడు అంతే.

ʹʹప్రాయోజిత ప్రజాస్వామ్యంలో
చేతులారా ప్రశ్నను పోగొట్టుకొని
చెల్లని నోటును చేతుల పట్టుకున్న
నాన్‌వర్చువల్‌ ఇంటలెక్చువల్స్‌
ముమ్మాటికి ఇది ద్రోహ కాలం
కాకుంటే దాసాను దాసుల
దోషుల విలాసంʹʹ

ఇప్పుడు ప్రపంచమంతా ఒక దళారితనం పర్చుకుపోయింది. దేశమంతా క్యాష్‌లెస్‌ లావాదేవీలు. ఎవని దగ్గరా బుడ్డ పైసా ఉండడానికి వీలులేదు. పేదోని చింపుల అంగీ కూడా లెక్కలోకి రావాల్సిందే. ఏది కొన్నా, ఏది అమ్మినా అయితే ఆధార్‌ కార్డు ఖాతాలోకో, లేకుంటే పాన్‌ కార్డు లెక్కలోకో వచ్చి తీరాల్సిందే. నీరవ్‌ మోదీలు, విజయ్‌ మాల్యాలు ఎంత కొల్లగొట్టినా ఫరవాలేదు. సామాన్యుడు మాత్రం ఒక్క బియ్యపు గింజ ఎక్కువ తినడానికి వీలు లేదు. ఒక్క కోడి గుడ్డు అదనంగా కొనడానికి అవకాశం లేదు. ఏం తిన్నా, ఏం కక్కినా ప్రతిదీ లెక్కలోకి రావాల్సిందే. జిఎస్టీ కట్టి తీరవలసిందే. ఒక్క రూపాయి కూడా ఇన్‌కంటాక్స్‌ ఎగ్గొట్టడానికి వీల్లేదు. అంతా తెర వెనక ఏవో శక్తులు సమర్పిస్తున్న ప్రజాస్వామ్యం. దానికి తలాడిస్తే ఓకే. లేకుంటే నిన్నొక యూజ్‌లెస్‌ ఫెలోగా చూస్తుంది వ్యవస్థ.

దేన్నీ నిలదీసి అడగలేని కాలమొకటి మనిషి దేహం మీద ఎక్కడి నుండో వచ్చి వాలింది. అంతా నిర్లిప్తత. దేనికీ సరిగా స్పందించని తరం. అంతా ఒక ఉదాసీన వైఖరి. సకలం ముడుచుకొని అడిగితే ఏందో? అడగకపోతే ఏ కష్టం వస్తుందో? నని ʹఎవరికి వారు ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటున్న ఇష్ట కాలంʹ ఒకటి వచ్చిపడింది.

ʹʹఎవరూ అడ్డు పడిందీ లేదు
పొలం పోనీ ఫలం పోనీ
ఊరు పోనీ పేరు పోనీ
కడుపులో గడ్డపారతో పెకిలిస్తున్నా
మొర వినని దయలేని కాలం
మనసు మసిలి పోతున్నా
కంట కన్నీరు కార్చని మొండి కాలంʹʹ

కళ్లుండీ చూడలేనితనం, చెవులుండీ వినలేని బద్దకం, చేతులుండీ ఏ చర్యనూ ఆపలేని శూన్యం. కనీసం మాట సాయం చేయని బండ మనుషులు, పిరికి పందలు ఉన్నారని కవి ఆవేదన చెందుతాడు. ʹబతుకు ముక్క వాసన వేస్తుంది.. స్విచ్చాఫ్‌ స్విచ్చాఫ్‌ ఒక విధమైన దవాఖానా వాసన మనిషినీ సమాజాన్ని కలిపే కిటికీ అయినా తెరవాలి లేకుంటే జీవితం మార్చురీ గది అవుతుందిʹ అంటాడు.

ʹʹగొర్రెతోక బెత్తెడు/గొర్రెదాటు ప్రజలకు
అర్ణంగా గొర్రెలు../ముందే గొర్రెలు
ఇప్పుడు పూర్తిగా బక్రాలను చేసిండ్రుʹʹ

రాజ్యాధికారం ఎప్పుడూ ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉండేలా చూసుకుంటారు. మొదటి తరం కుర్చీలపైనా, మలితరం ఉన్నత ఉద్యోగాల్లో ఇమిడిపోయి బహుజనులను ఆ వైపు ఆలోచించకుండా వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు, ఇతర పనిముట్లు ఉచితంగా ఇచ్చేసి అందులోనే మగ్గిపోయేలా చేస్తారు. ఇదో అందమైన కుట్ర, మీదికి సంక్షేమ కార్యక్రమంగా కనిపించి అంతిమంగా రాజ్యాధికారాన్ని, ఉన్నత చదువులను దూరం చేసే ఒక వైట్‌ కాలర్‌ దెబ్బ. అమాయకులు ముందే గొర్రెలు, గొర్రెల్ని పంచిపెట్టే సరికి నిజంగానే గొర్రెలయిపోయారు.

ʹʹఊరు ఒక నారుమడి
తను బలహీన పడ్డా
వేరే చోట మొక్క బలంగా ఉండాలనే
కన్నతల్లి ప్రేమ దానిది
గ్రామం నా నామం!
ఊరు నా చిరునామా!!
కన్నీరే నా వీలునామా!!!ʹʹ

రోజు రోజుకు చెదలు పట్టి పోతున్న ఊరును చూసి కవి తల్లడమల్లడమవుతాడు. తల్లివేరులాంటి ఊరు నామ రూపాలు లేకుండా శిథిలం కావడం, ʹబుల్లితెర, సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ ఫేస్‌బుక్‌ ఏదో ఒక వ్యసనంకు బానిసను చేసి రాజ్యం గమ్మత్తును చూస్తుంది... పటం మారింది కాని పాలకుల మటం అంతా ఒకటే. నిజమే చట్టానికి కులం వుండదు. ఆచరణ చుట్టానికి మాత్రం ఎల్లప్పుడూ బలహీనుడే బలిచక్రవర్తి అవుతాడు... నీ లోలోన ఎల్లెడలా ఒక థర్డ్‌ డిగ్రీ అమలు అవుతుంది. దెబ్బలు కనిపించవు. పెడబొబ్బలు వినిపించవు. మండని కట్టెలా పొగచూరి పోతుంటావుʹ అంటాడు. అంతేకాదు విరిగిన నాగలి, ఎండిన పొలం, దొంగ దెబ్బ తీస్తోన్న కరువును ఇప్పుడు ఊరు బరువుగా మోస్తున్నాయంటాడు. ఇక మిగిలింది అయితే చావు. లేదంటే వలసల రేవు చేరడమే.

అనేక చోట్ల అనేక అసందర్భ దృశ్యాల్ని, ఎన్నో కటువైన విషయాల్ని కాసింత తెగువతోనే కవిత్వీకరిస్తాడు జూకంటి. సాలెగూడు వ్యవస్థ మెల్లమెల్లగా మనిషి చుట్టూ ఏదో పంజరాన్ని అల్లుకుంటూ వస్తోంది. దాన్ని దీటుగా ఛేదించాలని ముందే గుర్తించి సామాన్యుడిని హెచ్చరిస్తాడు. అతడికి ʹరాయడమంటే మోయడం కానేకాదు. నువ్వు నిరంతరం లోపలా బయటా దారి చూపే దీపం కావాలి.. ముడికట్టుకుపోయిన మనిషిని మొలకెత్తించాలి. రాయడం అంటే ఏదోటి చేయడం కాదు. నేయడం కాదు. నునుపెక్కిన సూర్యునికి లోలోనికి దారి ఇవ్వడం. కవిత్వం రాయడమంటే నిత్యమూ గాయపడడం. ఖేదపడడం. క్రోధపడడంʹ. కొర్రాయిలాంటి వాక్యాలే కాదు. ʹవానను చూసొద్దాంʹ, ʹచెక్కరి చిలుకలుʹలాంటి వెన్నలాంటి భావుకతా కొన్ని కవితల్లో తొంగి చూస్తుంది జూకంటి కవిత్వంలో. ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస, మనుషుల మధ్య పెరుగుతున్న ఎడం, విజృంభిస్తున్న వస్తు సంస్క ృతి, మనిషి మీద ఆకాశమంతటి బాధ్యత ఈ కవితా సంపుటి నిండా పరుచుకొని ఉన్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ మనం ఏం కోల్పోతున్నామో, మనకు తెలియకుండానే ఎందులో కూరుకుపోతున్నామో ప్రతి వాక్యం విడమర్చి చెప్తుంది. జూకంటి కవిత్వం చదవడమంటే ఆధునిక మానవుడు తనను తాను పగిలిపోయిన అద్దంలో చూసుకోవడమే. ఒక వికృతత్వాన్ని, కనిపించని సంకెళ్ల చప్పుడును మన దేహంలో కనుక్కొని జీవితం ఎంత నికృష్టంగా దిగజారిపోతోందో తెలుసుకొని ధిక్కారాన్ని నేర్చుకోవడం.


No. of visitors : 464
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •