"ఆ రోజులూ వస్తాయి
కన్నీళ్లు ఇంద్ర ధనస్సులవుతాయి
జ్ఞాపకం చరిత అవుతుంది
బాధ పజ్రల గాథ అవుతుంది.."
మానవులు సమున్నత స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించే రోజు ఒకటి వస్తుందని రచయితలు, బుద్ధిజీవులు కలగంటారు. ఆ కల నిజం చేయడానికి పెనుగులాడుతున్న ప్రజల కంఠస్వరంగా ప్రతిధ్వనిస్తారు. వేల ఏళ్ల పీడన, అసమానత, అణచివేత, దోపిడీ రద్దయ్యే రోజు కోసం నిరంతరం తమ జీవితాన్నే ఒక ప్రయోగంగా తీర్చిదిద్దుకుంటారు. రాజ్యానికి ఇది గిట్టదు. ఆగ్రహిస్తుంది. కళను, జ్ఞానాన్ని చిదిమివేయడానికి కుట్రపన్నుతుంది. హృదయంతో స్పందించి, మేధస్సుతో ఆలోచించి, సృజనాత్మకతతో రచించే వాళ్లందరినీ చీకటి కొట్లోకి నెట్టేస్తుంది.
అలా విరసం వ్యవస్థాపక సభ్యుడు కా. వరవరరావుపై రాజ్యం మరో కుట్ర కేసు మోసింది. ఈసారి ఏకంగా ఈ దేశ ప్రధానిని హత్య చేయడానికి కుట్రపన్నాడని ఆరోపించింది. కవిగా, అధ్యాపకుడిగా జన జీవితాన్ని ప్రారంభించిన వివి తిరగబడు కవిగా గొంతు సవరించుకున్నారు. ఆధునిక సాహిత్య వేదిక ʹసృజనʹను సృజనాత్మకత, ప్రయోగం అనే దృష్టితో ఆరంభించారు. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల పిలుపు అందుకొని విప్లవ రచయితల సంఘం ఏర్పాటులో కీలకంగా పని చేశారు. సాహిత్యానికి సాయుధ ఎజెండాను కళాత్మకంగా తీర్చిదిద్దారు. కవిగా, కార్యకర్తగా, సాహిత్య విమర్శకుడిగా, సామాజిక రాజకీయ సాంస్కృతిక విశ్లేషకుడిగా, విప్లవోద్యమ వ్యాఖ్యాతగా వివి నిర్బంధాల మధ్య రాటుదేలారు. వేలాది ప్రసంగాలతో మూడు తరాల శ్రోతలకు విప్లవోత్తేజం అందిస్తున్నారు. విరసం, అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిషేధానికి గురైన రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో సుమారు పాతిక కేసులు ఎదుర్కొన్నారు. అందులోనూ సికింద్రాబాద్, రాంనగర్ కుట్ర కేసులు ప్రముఖమైనవి. ఎమర్జెన్సీ సహా పదేళ్లకు పైగా వివిధ సందర్భాల్లో జైలు జీవితం గడిపారు. తెలుగు సమాజాల్లో అర్ధవంతమైన శాంతి స్థాపన కోసం రెండు సందర్భాల్లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో విప్లవోద్యమ ప్రతినిధిగా పాల్గొన్నారు. చర్చల ప్రక్రియ విఫలమయ్యాక మరోసారి జైలుకు వెళ్లి వచ్చారు. ʹజీవించి, రచించే స్వేచ్ఛ కోసంʹ కవిగా రాజ్యహింస వ్యతిరేక పోరాటంలో తొలి వరుసలో నిలబడ్డారు.
ఈ పనులన్నీ ఆయన కవి కాబట్టే చేయగలుగుతున్నారు. కార్యకర్త కాబట్టే నిత్యం రాయగలుగుతున్నారు. నిరంతర సమకాలీన సమాజ, ప్రజా పోరాట వ్యాఖ్యానం చేస్తున్న అరుదైన బుద్ధిజీవి ఆయన. ʹకవిత్వం దాచనక్కర్లేని నిజం, కవిత్వం రాజ్యాన్ని రద్దు చేసే బహిరంగ రహస్యం..ʹ అంటున్నందుకే పాలకులు వివి మీద కక్ష కట్టారు. విప్లవోద్యమమే ఈ వ్యవస్థలోని మౌలిక వైరుధ్యాలకు ఏకైక పరిష్కారమనే విశ్వాసం ప్రకటిస్తున్నందుకే ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే తప్పుడు కేసు మోపారు. విప్లవోద్యమం మీద, ప్రజా పోరాటాల మీద, ప్రజలందరి మీద జరుగుతున్న యుద్ధాన్ని, హిందుత్వ బ్రాహ్మణీయ యుద్ధ బీభత్సాన్ని ఖండిస్తున్నందుకే ఈ కుట్ర కేసు రచించారు. నియంతృత్వంగా మారిపోయిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకుల విధ్వంసకర అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయంగా దండకారణ్యంలో అంకురించిన విప్లవ ప్రజాస్వామ్యాన్ని రచిస్తున్నందుకు, ప్రచారం చేస్తున్నందుకే వివిపై ఈ ఆరోపణ చేశారు.
వివి మాత్రమేకాక దేశ వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు, ఇప్పుడైతే ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే రాజ్యం మొదట భీమాకొరేగావ్ ఊరేగింపుపై హింసకు పాల్పడ్డారనే కేసు పెట్టింది. రెండు వందల ఏళ్ల కిందటి బ్రాహ్మణ పీష్వా రాజ్యానికి వ్యతిరేకంగా దళితులు చేసిన భీమా కొరేగావ్ యుద్ధం దేశవ్యాప్తంగా దళిత, విప్లవ శక్తుల ఐక్యతను ప్రేరేపిస్తోంది. ఈ ఐక్యతలోని ప్రచండశక్తి ఎలా ఉంటుందో సంఘ్ రాజ్యానికి తెలుసు. అందుకే ఈ అక్రమ కేసు కింద ఈ ఏడాది జూన్ నెలలో రోనా విల్సన్, ప్రొ. షోమాసేన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, సుధీర్ ధావ్లేలను అరెస్టు చేసింది. వీరంతా దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో తమకిష్టమైన రంగాన్ని ఎంచుకొని నిబద్ధ విలువలతో పని చేస్తున్నారు. ప్రజా జీవితాన్ని ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ విధానాలను, సామాజిక పీడనను వ్యతిరేకిస్తున్నారు. బూర్జువా ప్రజాస్వామ్యం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా మారిన వేళ ప్రజల తరపున మాట్లాడుతున్న వేర్వేరు ప్రజాస్వామిక భావజాలాలకు చెందిన ఈ మేధావులను భీమా కొరేగావ్ కేసులో పోలీసులు ఇరికించారు.
ఈ కేసు విచారణలో దొరికాయని కొన్ని నకిలీ లేఖలు తీసుకొచ్చి ప్రధాని మోదీ హత్యకు మేధావులు, రచయితలు కుట్రపన్నారని ఇంకో కేసును ఆర్ఎస్ఎస్ పోలీసులు బైటికి తీశారు. దీని కింద ఇప్పటికే రెండు నెలలకుపైగా గృహ నిర్బంధం తర్వాత అక్టోబర్ 27న ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌ను, 26వ తేదీన మరో న్యాయవాది, రచయిత అరుణ్ ఫెరారాను, విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం పని చేసి జైలు జీవితం గడిపి విడుదలైన మేధావి, రచయిత వెర్నన్ గొంజాల్వజ్ను అరెస్టు చేశారు. ఈ నెల 17న వరవరరావును ఇదే కేసులో అరెస్టు చేశారు. వీళ్లందరికంటే ముందు నుంచే ఒక తప్పుడు కేసులో ప్రొ. సాయిబాబా నాగపూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
నిజానికి ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రొ. సాయిబాబ దేశవ్యాప్త ప్రచారం చేస్తున్నందుకే ఆయన మీద మొదట అక్రమ కేసు పెట్టారు. న్యాయ ప్రక్రియలో నిలబడగల కనీస ఆధారాలు లేకపోయినప్పటికీ పోలీసులు ఆయనకు యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. ఆయన నిర్బంధాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లలో ఒక్కొక్కరినే ఇప్పుడు జైలుపాలు చేస్తున్నారు. దీని కోసం అర్బన్ నక్సల్స్ అనే కొత్త ప్రచారం ప్రారంభించారు. నగరాల్లో ఉండే రచయితలు, కళాకారులు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఆచార్యులు, విద్యార్థులు మావోయిస్టు ఉద్యమంలోకి కేడర్‌ను రిక్రూట్ చేస్తున్నారనే దుష్ప్రచారం చేపట్టారు.
ఈ పేరుతో ప్రజల వైపు నిలబడి హిందుత్వ ఫాసిజాన్ని ప్రశ్నిస్తున్నవాళ్లంతా అర్బన్ నక్సల్స్ అని సంఘ్ రాజ్యం అంటోంది. భిన్న స్వరాలు వినిపిస్తున్న వాళ్లను, రాజ్యహింసను నిలదీస్తున్నవాళ్లను, విప్లవ రాజకీయ ప్రచారకులను అణచివేయడానికి కుట్ర కేసులు తీసుకొచ్చింది. ఆ నేరారోపణ దగ్గరి నుంచి అరెస్టుల దాకా పోలీసులు వందల అబద్ధాలకు పాల్పడ్డారు. ఏ మాత్రం పొసగని గాలి వాదనలను, ఒక్క అక్షరమైనా నిజంకాని కల్పిత ఆధారాలను తీసుకొచ్చారు. న్యాయ వ్యవస్థను సంఘ్ పోలీసులు తమ కనుసన్నల్లో నడుపుతూ అన్యాయమైన పద్ధతుల్లో ఈ మేధావులందరినీ నిందితులుగా నిర్బంధంలోకి తీసుకున్నారు. వలస వ్యతిరేక పోరాట కాలం నుంచి ఉద్యమకారుల మీద కొన్ని డజన్ల కుట్ర కేసులను పాలకులు మోపుతూ వచ్చారు. అన్నీ తప్పుడు కేసులే. మార్క్సిస్టు లెనినిస్టు ఉద్యమం ఆరంభమైనప్పటి నుంచి కూడా అనేక కుట్ర కేసులను చూశాం. వీటన్నిటికి పరాకాష్ట ఈ భీమా కొరేగావ్, ప్రధాన మంత్రి హత్యకు కుట్రపన్నారనే కేసులు. ఒక రకంగా ఇది ప్రొ. సాయిబాబ, భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ రావణ్ దగ్గరే మొదలైంది. ప్రత్యామ్నాయ ఆలోచనలంటేనే రాజ్యం భయపడుతోంది. దాంతో దారుణమైన హింసకు పాల్పడుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తన అసలు స్వభావాన్ని నిస్సిగ్గుగా బైటపెట్టుకుంటోంది. ఫాసిజమంటే ఇదే.
ఒక వైపు ప్రగతి కోసం, విముక్తి కోసం పోరాడుతున్న ప్రజలపై దండయాత్రకు ʹచట్టʹబద్ధంగానే రాజ్యం తన సైన్యాన్ని ఉసిగొల్పింది. దండకారణ్యంలో పదిహేనేళ్లుగా, కశ్మీర్లో దశాబ్దాలుగా ఈ మారణహోమం నడుస్తోంది. మరో వైపు సంఘ్ సైన్యం నిత్యం దళితులను, ముస్లింలను హత్య చేస్తోంది. మహిళలపై ఘోరమైన దాడులు చేస్తోంది. ఈ రెండు సైన్యాలను నడిపిస్తున్న రాజ్యం మేధావులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ దేశం గర్వించే బుద్ధిజీవులందరూ ఒక్కొక్కరే జెయిలుపాలవుతున్నారు. కొందరు హత్యలకు గురయ్యారు.
ఇదంతా ఆందోళన కలిగించే విషయమే. ఫాసిజంపై చేయిని సూచించేదే. కానీ సాహసోపేతంగా పోరాడవలసిన కాలం కూడా ఇదే. హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజం వ్యక్తీకరణలన్నిటినీ గుర్తించి విశాల ప్రజాస్వామిక పోరాటం నిర్మించవలసిన తరుణం ఇది. ఈ దేశంలో తరతరాలుగా అట్టడుగు కులాల ప్రజలు, ఆదివాసులు చేస్తున్న పోరాటాల్లోని ప్రగతిశీల విలువన్నిటినీ సంఘటితం చేయవలసిన అవసరాన్ని ఈ చీకటి నిర్బంధం నొక్కి చెబుతోంది. వర్గ పోరాటమే అన్నిరకాల ప్రజా పోరాటాలకు ధిక్కారతత్వాన్ని, రాడికల్ స్వభావాన్ని అందిస్తుంది. రాజకీయార్థిక సాంస్కృతిక రంగాల్లోని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తిని, దృష్టిని అందిస్తుంది. సంఘ్ ఫాసిజం బలపడుతున్నట్లే.. దాన్ని వ్యతిరేకించే ప్రజా ప్రతిఘటన కూడా పదునెక్కుతున్న కాలం ఇది. చాలా ఏళ్ల కింద వివి రాశారు..ʹవసంతం ఎప్పుడూ విడిగా రాదు, ఎండాకాలంతో కలిసి వస్తుంది, రాలిపోయిన పూల జ్ఞాపకాలు మిగిల్చిన తొడిమల దగ్గర కొత్త చిగుళ్లు పూస్తాయి..ʹ అని. ప్రజా చైతన్యం, ఆచరణే ఫాసిజానికి సమాధానం. అందాక పోరాటమే. జైల్లో ఉన్న వరవరరావుతోపాటు మన ప్రియమైన మేధావులను, ఆదివాసీ రాజకీయ ఖైదీలను విడిపించుకొనే ప్రజాస్వామిక పోరాటాన్ని నిర్మించాల్సిందే. దాని కోసం రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు తమ ధిక్కార స్వరాన్ని మరింత పెంచాల్సిందే. వివి రాసినట్లు మౌనం యుద్ధ నేరమనే భావనను దృఢంగా సొంతం చేసుకుందాం. ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి రాజ్యాన్ని, పెట్టుబడిని, బ్రాహ్మణీయ భావజాలాన్ని, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించడమే నేరమవుతుంది. ఇప్పుడు ఆ నేరం చేయడంలో భాగమే ఈ సభ. తప్పనిసరిగా రండి. విజయవంతం చేయండి.
28.11.2018, బుధవారం సాయంత్రం 5.30 నుండి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్
అధ్యక్షత: సి.కాశిం
వక్తలు: యాకూబ్, హరగోపాల్, కె.శివారెడ్డి, పాణి
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
యాభై వసంతాల అజేయశక్తి నక్సల్బరీఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో విరసం బహిరంగసభ. కామ్రేడ్స్ వరవరరావు, పాణి, కాశీం వక్తలు. ... |
International Seminar on Nationality QuestionAIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry..... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |