దళిత దృక్పథం, ధిక్కార స్వరం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

దళిత దృక్పథం, ధిక్కార స్వరం

- డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 06.12.2018 12:09:20am

మానవ సమాజ పరిణామ వికాసంలో గత దశాబ్దం చాలా సంక్షోభాలకు, కుదుపులకు గురైన కాలం. కుల వివక్ష, పరువు హత్యలు, ఆకలి హత్యలు, హిందుత్వ హత్యలు, పెద్దకూర హత్యలు, పసిమొగ్గలపై అత్యాచారాలు, చుండూరు దళిత హత్యలపై కోర్టు తీర్పు, మైనార్టీలపై దాడులు, స్త్రీలపై పెరుగుతున్న హింస, హక్కుల కార్యకర్తలను వ్యూహాత్మకంగా చంపేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం, సెజ్‌ల పేరుతో ఆదివాసీలను, దళితులను నిర్వాసితులను చేయడం, స్వలింగ సంపర్కంపై వెలువడిన తీర్పు, ఇష్టంతో అక్రమ సంబంధాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛ, నిర్భయ ఉదంతం, ఆసిఫా సంఘటన.. ఇత్యాది అనేక సంఘటనలు దేశ మానవాళిని తీవ్రమైన షాక్‌కు గురిచేశాయి. ఈ దశలో ప్రశ్నించే మనిషిని ఎట్లా అదృశ్యం చేయాలో రాజ్యం కూడా చాలా తెలివిగా పావులు కదుపుతూ ఒక్కొక్కరిని ఏరి పారేయడం మొదలు పెట్టింది. పౌరహక్కుల నేతలు, ప్రజాస్వామ్య వాదులు, వెన్నుపూస వున్న రచయితలు, కవులు నిత్యం ఏమరుపాటుతో ఉండి అసలు మనిషి చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడానికి చాలా ప్రయత్నించారు. తద్వారా అనేక ప్రజా సమూహాలు చైతన్యం పొంది ప్రశ్నించడం నేర్చుకున్నాయి. ఉద్యమించడం మొదలుపెట్టాయి. ఎన్ని రచనలు వెలువడ్డా రాజ్యం చేసిన అన్యాయాలను ఆసాంతం అక్షరాల్లో వివరించలేకపోయాం. కానీ తెర వెనక చలన సూత్రాలను అర్థం చేసుకున్న రచయితలు ఎప్పటికప్పుడు చాలా బలంగా ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలను, రాజ్యాన్ని, వ్యవస్థను, లౌకికత్వాన్ని బోనులో నిలబెట్టి కడిగిపారేశారు. అలాంటి ధిక్కారపు ఆకాశం నుండి ఎగిరి వచ్చిన ఒక ఒంటి రెక్క పక్షి చల్లపల్లి స్వరూపరాణి ʹవేకువ పిట్టʹ కవితా సంపుటి.

ఈ వ్యవస్థను ఒక అస్తిత్వ స్పృహ కల్గిన పీడిత దళిత స్త్రీ కోణం నుండి చూపిస్తుందీ కవితా సంపుటి. అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరిస్తూ, అన్ని రంగాల్లో ప్రజాస్వామ్య బద్ధమైన సమానత్వం వెల్లివిరియాలనే అంబేద్కర్‌ తాత్వికత నుంచి మాట్లాడుతుంది ఈ కవితా సంపుటిలో కవయిత్రి. ఇందులోని ప్రతి అక్షరం ప్రతిఘటనా శక్తిని, సంఘర్ణణను, అణచివేతను ఎదిరించేదే. సమస్యలను, సంవేదనలను ఏకరువు పెడుతూ యుద్ధం చేసేదే. ముఖ్యంగా దళిత స్త్రీ మీద పనిచేసే అనేక అదృశ్య శక్తులను ప్రశ్నిస్తుందీ పుస్తకం. సమస్యను సహానుభూతితో వర్ణించడం కాదు. నేరుగా గాయమే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మార్జినలైజ్డ్‌ పీపుల్‌ గురించి గొంతు చించుకొని మరీ నినదిస్తుందీ కవిత్వం. కవిత్వపు పాలు, మర్యాదల్ని కాసేపు పక్కకు పెట్టి నిరాడంబరమైన సంభాషణ శైలిలో దళిత జీవితం చుట్టూ పర్చుకున్న చీకట్లను, లోతులను హృదయంలోకి చేరవేస్తుంది కవయిత్రి. వస్తువు ఎన్నికతో పాటు దాన్ని అంతే గాఢంగా పాఠకుడు కదిలిపోయేలా, కలవర పడేలా ఒక కొత్త డిక్షన్‌తో చెప్పడంలో కవయిత్రి విజయం సాధించింది. ఎక్కడి నుండో ఒన ʹవేకువపిట్టʹను తీసుకొచ్చి ఎన్నో అగ్నిపర్వతాల మీదుగా దాన్ని ప్రయాణింపజేసి చివరికి ఒక బాధాతప్తమైన ʹనా ఆకాశంʹలో వదిలేస్తుంది.

ʹʹముసురు పట్టిందంటే
పొయ్యి మీద పిల్లిని లేపటమెట్లా అని
అమ్మ వో దిగులు మేఘమైపోయేది
పనుల్లేని వానా కాలంలో
అమ్మ పుట్టింటోళ్లు ఇచ్చిన
యిత్తడి బిందెలు మాయమై/చల్లటి వాన రాత్రి
వేడి వేడి అన్నంలో ఎండు చేపల పులుసుగానో
వేరుశనగ పచ్చడిగానో మారేవిʹʹ

వానను సినిమా కవులు ఒకలా చూస్తే, సవర్ణ కవులు మరోలా చూస్తారు. అధికార పక్షపు కవులు ఇంకోలా చూస్తారు. ఈ కవయిత్రి దళిత కోణంలో చూస్తుంది. వానంటే కాగితపు పడవలు, పిల్ల కాలువలే కాదు. చెమ్మగిల్లే పూరి గుడిసె కూడా అంటుంది. వాన నీటితో పాటు అమ్మ మా అవస్థలను కూడా ఎత్తిపోస్తుంది అంటుంది. నాన్న ఏమీ పాలుపోక పిల్లలకు పైదుప్పటి సరిచేస్తూ బీడి ముట్టిస్తాడని దిగులుగా చెబుతుంది. నిజంగా వాన అందమైందే కాదు, కొన్నిసార్లు బాధల చినుకులను గుండె గుడిసెలో రాల్చిపోయేది కూడా.

ʹʹనీటికి సమస్తమూ తెలుసు
...............................
నూలుకీ తోలుకీ మధ్య
ఉపజాతి భేదమూ తెలుసు
కడివెడు నీరు తోడుకునే హక్కు లేక
సూద్రులొచ్చేదాకా
ఖాళీ బిందెలతో/బావి గట్టు వద్ద
పడిగాపులు పడ్డ ఆవేదన తెలుసు
.....................................
ఈ నీరు యుగయుగాల
సామాజిక దుర్నీతికి
సజీవ సాక్షిగా నిలిచింది
............................
మాకు నీరంటే H2O మాత్రమే కాదు
మాకు నీరంటే మహొద్యమం
మహద్‌ చెరువు పోరాటంʹʹ

ఈ భూమ్మీద నీటి కోసం పోరాటాలు బహుశా దళితులతోనే మొదలై ఉంటాయి. అందుకే అంబేద్కర్‌ లాంటి వాళ్లు మహద్‌ చెరువు పోరాటాలు చేసింది. దేన్ని తాకినా శుద్ధి చేసేది నీటితోనే అలాంటిది నీటినే ముట్టుకుంటే సవర్ణ సమాజం ఊరుకుంటుందా? నిప్పుతో కడుగుతుంది. కాదంటే నిప్పుల్లో కాల్చేస్తుంది. కడివెడు నీటి కోసం యుగాల పోరాటం. పొరపాటున చెరువునో, బావినో సాహసించి ముట్టుకుంటే అందులో విషాన్ని కలపడమో, లేదంటే శవాన్ని విసిరేయడమో చేసి నీరు ఎవరికీ చెందకుండా చేసిన సంఘటలను కోకొల్లలు. అందుకే ʹనీటి బొట్టంటే జన్మ జన్మల కన్నీటి వూటʹ అంటుంది కవయిత్రి. పైపై సమానత్వమేదో వచ్చి నీరు ఇప్పటికైనా అందరికీ సమానంగా దొరుకుతుందనుకుంటే ఇప్పుడు నీరు పెప్సీ, కోకో కోలాలు, మినరల్‌ వాటర్‌గా రంగు, రూపు మార్చుకొని మళ్లీ అందకుండానే పోతుందని, ఇప్పుడు నీరంటే మామూలు నీరు కాదు. అది మల్టీనేషనల్‌ సరుకై పోయిందని వాపోతుంది కవయిత్రి.
ʹʹనెయ్యీ బువ్వ తిన్న మారాజులు
కూటికి కులముంటాదని
గంజికి మతముంటాదని
పుట్టి బుద్ధెరిగినాక
మా కెవరూ చెప్పలేదు బాబయ్యా!
......................................
ఆకలి పేగుకి/యింత గొడ్డ కూర తింటే
నిలువునా ప్రాణం తీస్తారా?ʹʹ

ఈ దేశంలో ప్రజలంతా ఏ దేవుడ్ని పూజించాలో, ఏ బట్టలు కట్టుకోవాలో, ఏ తిండి తినాలో అన్నీ ఏవో అదృశ్య శక్తులు నిర్ణయిస్తుంటాయి. వాటిని అమలు పర్చడానికి కూడా ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. లౌకిక రాజ్యంలో ప్రజలకు ఉండే స్వాతంత్య్రాలన్నీ ఒక్కసారే గద్ద ఎత్తుకుపోతుంది. గీత దాటిన వాడెవడూ ప్రాణాలతో బతకలేడు. ఈ విషయంగా దేశవ్యాప్తంగా ఎన్నో హత్యలు, దాడులు జరిగినా ఎవరిపైనా కేసులుండవు. పైగా హిందుత్వను కాపాడినందుకు సోషల్‌ మీడియాలో విపరీతమై ప్రచారం లభించి ఒక్కరోజులోనే ఆ వర్గాలు వీరులైపోతారు. దేశాన్ని రక్షించే దేశభక్తులైపోతారు. ఇదే మనం నిర్మించుకున్న లౌకికరాజ్యం.

ʹʹచదువంటే ప్రశ్నకదా/మనుషులని వస్తువులుగా
డబ్బులుగా వోట్లుగా/కాదంటే బంగారంగా చూసే కళ్లకి
మనిషంటే మెదడని/మనిషంటే చలనమని
మనిషంటే ప్రేమని చెప్పడానికే
నువ్వొచ్చి వెళ్లావా రోహిత్‌ʹʹ

నిజానికి రోహిత్‌ది ఆత్మహత్యనా? ఆత్మహత్యలా కనిపించే హత్యనా? అనేది కోటి రూకల ప్రశ్న. ముమ్మాటికీ రోహిత్‌ని హత్య చేసింది ఈ కుళ్లిపోయిన వ్యవస్థనే అని హక్కుల సంఘాలన్నీ గొంతు చించుకొని చెప్పాయి. రోహిత్‌ సంఘటన ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఎంత కుల వివక్ష అమలవుతున్నదో బహిర్గతమైంది. ఇంత జరిగినా రాజ్యం తన హిడెన్‌ అజెండాను చాప కింది నీటిలా అమలు పరుస్తూనే ఉంది.

ఈ సంపుటి అనేక ప్రశ్నలు కొడవళ్లై కనిపిస్తాయి. ʹరాజ్యాంగానికి ఆ కన్నాలేంటి?ʹ, ʹఇంత మంది పరువు ఆమె అవయవంలో దాగుందా?ʹ లాంటి ప్రశ్నలకు ఈ సమాజం ఎప్పటికీ బహుశా సమాధానం చెప్పలేదు. ఇందులో వాడిన టోన్‌ చాలా ప్రత్యేకమైనది. చాలా వస్తువులు ఈ టోన్‌ వల్లనే కవిత్వమయ్యాయి. వీటితో పాటు దీనిలో ప్రయోగించిన అనేక పారడాక్స్‌లు, మెటఫర్లు, ఇమేజరీలు, అలిగరీ, ఐరనీ ఆశ్చర్యపరుస్తాయి.

ఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి పోయే కవిత్వం చల్లపల్లి స్వరూపరాణిది.

No. of visitors : 505
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియాʹ

వెల్దండి శ్రీధర్‌ | 16.07.2017 08:31:51am

ఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........
...ఇంకా చదవండి

దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన

డా. వెల్దండి శ్రీధర్‌ | 01.10.2018 05:23:40pm

రోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు......
...ఇంకా చదవండి

వేయి అంచుల ʹజీవితంʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 21.12.2018 01:31:51am

ప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు......
...ఇంకా చదవండి

ముస్లిం జీవితాల వాస్తవిక కథలు

డా. వెల్దండి శ్రీధర్‌ | 20.01.2019 11:40:09am

ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజుల....
...ఇంకా చదవండి

సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 04.01.2019 10:50:11pm

ఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •