పౌర ప్రజాస్వామిక హక్కుల అమలుకై రాజకీయనాయకులను నిలదీయండి

| సాహిత్యం | వ్యాసాలు

పౌర ప్రజాస్వామిక హక్కుల అమలుకై రాజకీయనాయకులను నిలదీయండి

- పౌరహక్కుల సంఘం | 06.12.2018 12:20:39am

తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎన్నికల సమయం. నాలుగేళ్ళకే ఎన్నికలేంటి అని ప్రజలు బిత్తరపోయి చూస్తున్నారు. చూస్తుండగానే హోరు మారుమ్రోగుతుంది. ఇప్పుడు తెలంగాణ గాలి వాగ్దానాలతో నిండి ఉంది. ఈ ఎన్నికల హడావుడి ఎవరు బాగుపడడానికి, ఎవరిని మోసం చేయడానికి! ప్రజలు ఆలోచనకు పదును పెట్టారు. తీరని అధికార దాహంతో, స్వప్రయోజనాలను ఆశించి పాలకులకు కలసివచ్చే అనుకూల కాలంగా భావించినప్పుడు అర్ధాంతర ఎన్నికలు ప్రజలను చుట్టుముడుతున్నాయి. అంతేకాని రాజ్యాంగ నిర్దేశన ప్రకారంగా గాని, ప్రజల అవసరాల ప్రాతిపదికన గాని, జరుగుతున్నట్లుగా ఎక్కడా కనబడదు. ఈ అర్ధాంతర చర్యల వలన కోట్లాది రూపాయల ఎన్నికల వ్యయం ప్రజలపై బలవంతంగా రుద్దబడుతుంది. రాజకీయ నాయకులు మాత్రమే అందలాలకెక్కే ఈ తంతులో ప్రజాప్రయోజనాలు శూన్యమైన ప్రక్రియ ద్వారా మీదపడే అనంతమైన ఎన్నికల భారాన్ని అనవసరంగా ప్రజలెందుకు భరించాలని రంగురంగుల జెండాల రాజకీయ నాయకులను ప్రశ్నించండి. ఎన్నికల భారం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కోలుకోకుండా చిన్నాభిన్నం చేస్తుంది. ప్రజల తలలను తాకట్టు పెడుతుంది. ఇప్పటికే పాలకుల ఆర్థిక విధానాల వలన ఇంటాబయట అప్పులు తడిసి మోపిడైనాయి. ప్రచారం జరుగుతున్నట్లుగా ధనిక రాష్ట్రం ఏమీ కాదు మనది. దరిద్ర రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 76 వేల కోట్ల మిగులు బడ్జెట్లు ఉండగా తెలంగాణ రాష్ట్ర శాసన సభ రద్దు చేసిననాటికి 1,25,000 కోట్ల అప్పుగా పోగుపడివుంది.

తొమ్మిది నెలల ముందుగానే ఎందుకు కూయాల్సివచ్చిందో పీఠం ఎక్కిన వారిని గట్టిగానే నిలదీయండి. మళ్ళీ మీకే పగ్గాలిస్తే మళ్ళీ నట్టేట ముంచరని గ్యారంటీ ఏమిటని మొండిచేయి చూపించండి. ఎన్నికల తతంగంతో గత 70 సం||లుగా ప్రజలు విసిగెత్తి ఉన్నారు. రాజకీయపార్టీల నాయకులు దాగుడుమూతలు ఆడుతున్నారు. ఒక పార్టీ నుండి మరియొక పార్టీలోకి దానినుండి యింకొక పార్టీలోకి గంతులేస్తున్నారు. అధికారమే పరమావధిగా అమ్ముడుపోతున్నారు. ప్రజలు విస్తుపోయి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనకు తగిన బుద్దిచెప్పడానికి మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలి కదా! ప్రజాభిప్రాయం మేరకు మారాల్సివచ్చిందని మళ్ళీ ప్రజలనే బలిపెడుతూ బుకాయిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు తమ నియోజకవర్గంలో నిలబడే ఏ పార్టీ నాయకులకు ఓటు వేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. గెలిచాక ఎవరెక్కడ మునిగి ఎక్కడ తేలుతారో తెలియని గందరగోళ పరిస్థితిలో అలాంటి వారిని ఎందుకు ఎన్నుకోవాలి?

ప్రతి ఎన్నికల సందర్భములో రాజకీయ నాయకులు ప్రజలకు నిజమైన ప్రజాసేవ అందిస్తామని హామీలిస్తారు. కాని అధికార పీఠమెక్కగానే ప్రజలను మరచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఒక అభ్యర్థి ఎమ్.ఎల్.ఏ. కాకముందు ఆస్తులకు తరువాత అతని సమపార్జనకు గణనీయమైన తేడా ఉంటుంది. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను నమ్మి తమ జీవితాలలో నిజంగా మార్పులు వస్తాయనే ఆశతో గంటల తరబడి నిలబడి ఓట్లు వేస్తారు. పాలక పార్టీలు, రాజ్యవ్యవస్థ ఓటు వేయకపోతే చచ్చినవాళ్ళతో సమానమనే భావజాలాన్ని మెదళ్ళలో నింపండం వలన ఎంతటి ప్రయాసకైనా సిద్ధపడి ఓట్లు వేస్తున్నారు. సాధారణంగా మధ్యతరగతి వాళ్ళ, పేద వర్గాల ప్రజలు అధికంగా ఓటింగ్లో పాల్గొంటారు. మేము మాత్రమే ఎందుకు పాల్గొనాలి? మీటనొక్కడం ఒక్కటి మాత్రమే మా చావుబతుకులను నిర్ణయిస్తుందా అని ఆలోచించండి. అన్ని రకాల పార్టీలు అధికారాన్ని ఏవిధంగా దక్కించుకోవాలన్న తాపత్రయంతోనే అలవి కాని వాగ్దానాలు గుప్పించి మబ్యపెడుతూ ఎన్నికలలో పాల్గొంటున్నారు. ఇంచుమించు అన్ని మ్యానిఫెస్టోలు ఒకేమాదిరిగా ఉంటున్నాయి. అన్ని పార్టీలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఉన్నటువంటి పార్టీలలోనే ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రజలకు ఇంతకుమించిన ప్రత్యామ్నాయం ఇంకొకటి లేనపుడు అన్నింటిని గుత్తగా తిరస్కరించే హక్కు ప్రజలకు ఉంది. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు తమ సమస్యలను ఏ రాజకీయ పార్టీ పరిష్కరించలేదు గనుక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇలాంటి అభిప్రాయాలను గౌరవిస్తూ భారతీయ ఎన్నికల సంఘం 2014 నుండి ʹనోటాʹ ను ప్రవేశపెట్టింది. అంటే ఎన్నికలను తిరస్కరించేవాళ్ళు నేను ఎవరికి ఓటు వేయడం లేదనిʹ ఆ నోటా బటన్ నొక్కవలసి ఉంటుంది. అయితే కష్టపడి పోలింగ్ బూత్ వరకు వచ్చి క్యూలో నిలబడి ప్రయాసపడి ʹనాకు ఇష్టంలేదనేʹ బటన్ ఎందుకునొక్కాలి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు చివరి ఎన్నికలలో 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.) 250 పైగా హామీలు ఇచ్చింది. నెరవేర్చినవాటిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. దాదాపుగా అవే వాగ్దానాలను తారుమారు చేసి ఇప్పుడు మళ్ళీ ప్రకటించింది. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే వాగ్దానాలతో అధికారం చేపట్టి అవి నెరవేర్చకుండానే తిరిగి ఓట్లు అడుగుతుంది. మాట నిలబెట్టుకోని వాళ్ళను ఎందుకు బలపర్చాలని అడగండి? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతానన్న ముఖ్యమంత్రిని ఇప్పుడు ఇవ్వలేదు గనుక వేస్తలేమని చెప్పండి. మొఖం మీదనే చెప్పండి. ʹతెరాస ఓడిపోయిందనుకో... నాకొచ్చే నష్టం పెద్దగా లేదు... ఏముంటది... గెలిస్తే గట్టిగా పనిచేస్తాం... లేకుంటే ఇంటి దగ్గరుండి రెస్ట్ తీసుకుంటాం... వ్యవసాయం చేసుకుంటాం...ʹ అనే చంద్రశేఖర్ రావు ప్రజాసేవ పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో బయట పెట్టుకున్నారు. ప్రజాసేవకు అధికార పీఠానికి ముడిపెట్టే ముఖ్యమంత్రిని ఇకనుండి ఫాంహౌస్లోనే హాయిగా రెస్ట్ తీసుకోమని సలహా ఇవ్వండి. మీకు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడేమో!

ఎన్నికల ప్రహసనం ఎడల అసహనంగా ఉన్న ప్రజలను ప్రసన్నులను చేసుకోవడానికి రాజకీయ పార్టీలు అన్ని మార్గాలను అవలంబిస్తున్నారు. విచ్చలవిడిగా పంపిణీ కాబడుతున్న డబ్బు, నురుగులు కక్కుతూ సుడులు తిరుగుతున్న మద్యం ప్రజాస్వామ్యవాదులకు విస్మయం కలిగిస్తున్నది. ఎన్నికల సంఘం డొల్లతనాన్ని ఎత్తిచూపుతుంది. నిత్యం ఏదో ఒకచోట డబ్బు బట్వాడా పట్టుపడుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 80 కోట్ల రూపాయల డబ్బులు పట్టుపడగా, వేలాది బాటిల్ల మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దాదాపుగా 3.47 లక్షల లీటర్లు, రూపాయలు 6.76 కోట్ల విలువైన లిక్కరును సీజ్ చేసుకున్నారు. పట్టుబడిన వారికి శిక్షలు పడటం లేదు. ఎందుకు? 2014 ఎన్నికల్లో ఇలాంటివి 1650 కేసులు నమోదు కాగ, శిక్షలు ఎవరికి పడలేదు. ఎందుకు? చట్టాలు సంపన్నుల చుట్టాలనా?

ఓటర్లకు డబ్బులివ్వడం, ఐపిసి సెక్షన్ 171/బి, 171/ఇ ప్రకారం ఒక సంవత్సరం జైలుశిక్ష, కులమతాలను రెచ్చగొట్టే ప్రచారం చేసినవారికి సెక్షన్ 505 ప్రకారం 5 సంవత్సరాల జైలుశిక్ష ఎన్నికల విధులలో ఉన్న అధికారులపై దాడికి పాల్పడితే సెక్షన్ 332,333,353 ప్రకారం 10 సంవత్సరాల జైలుశిక్ష; ఓటర్ల తరలింపుకు వాహనాలు సమకూరిస్తే సెక్షన్ 127 ప్రకారం 6 నెలల జైలుశిక్షలు పడాలి. కానీ 1952 నుండి ఎన్నికలు దేశంలో జరుగుతున్నప్పటికీ ఎవరికీ ఇంతవరకు శిక్షలు పడలేదంటే ఎవరూ ఆ నేరాలకు పాల్పడలేదని, అసలలాంటి నేరాలు అబ్బే భారతదేశంలో జరగనే లేదని అనుకోవాలా?

ఎలక్షన్ ప్రచార సభల విజయాన్ని ప్రజల హాజరుతో కొలుస్తున్నారు. ప్రచార సభలు విజయవంతం కావడానికి లక్షలాది జనాలను తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు, నిరుద్యోగంతో అలమటిస్తున్న యువతకు రోజువారి కూలీ, అన్నం పెడితే తప్ప కదలిరాని స్థితి బహిరంగ రహస్యమే. అయినా అది నిబంధనలకు వ్యతిరేకం. ఈ దుస్థితికి ఎవరిని నిందించాలి? ఇలా ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో వారే అధికార పీఠాన్ని అధిరోహిస్తారనేది కూడా నగ్నసత్యమే. కోట్లు వెచ్చించి అధికారాన్ని అందుకున్న వారు తిరిగి సంపాదించడంలో నిమగ్నమై ప్రజలను, వారికిచ్చిన హామీలను మర్చిపోయేలోగా తిరిగి ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. అందుకే వారి ఊహలకే అందనంత రెట్టింపుగా ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం ఖూనీ కాబడుతుంది. ఎన్నికల ప్రక్రియ ఖరీదైన వ్యాపార రంగమయింది. సంపన్నుల మొనోపలీగా రూపాంతరం చెందింది. సామాన్యులకు బూటకపు ప్రజాస్వామ్యంగా కనపడుతుంది. ఓట్లకు వెలకట్టి మభ్యపెట్టే దుస్థితి దాపురించింది. వెలకట్టి కొనేవారు కోటీశ్వరులు, అమ్ముడు కాబడుతున్నవారు బికారులు. ఇలాంటి వారితో రాజ్యాలు నడిస్తే భీభత్సంగా ఉండకుండా వుంటుందని చెప్పలేం. వ్యవస్థను హింసాత్మకంగా నడిపించేది యిలా గద్దెనెక్కేవారే.

అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ మరియు తెలంగాణ ఎలక్షన్ వాచ్, 2014లో సమర్పించిన వివరాల అధ్యయనంలో చాలా నిజాలు వెలుగుచూసాయి. ఇందులో 63మంది టి.ఆర్.ఎస్. ఎమ్.ఎల్.ఏ లలో 40మంది పైన క్రిమినల్ కేసులుండగా, 26 మంది పైన తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. నకిరేకల్ నుండి ఎన్నికైన ఎమ్.ఎల్.ఏ. పైన ఏకంగా 302 క్రింద కేసు ఉన్నట్లు ఆయనే అఫిడవిట్లో అంగీకరించారు. ఈయనపై మొత్తం 7 కేసులుండగా, అందులో 2 హత్యా ప్రయత్నానికి సంబంధించినవి. ఇక కాంగ్రెస్లోని 17 మంది ఎమ్.ఎల్.ఏ.లలో 5 గురుపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులున్నాయి. టి.డి.పి. కి చెందిన 13 మంది ఎమ్.ఎల్.ఏ.లలో 15 గురుపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులున్నాయి. మజ్లిస్ కు చెందిన 6 గురి ఎమ్.ఎల్.ఏ.లలో 4 గురిపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులున్నాయి. ఇక బి.జె.పి.లోని 5 గురి ఎమ్.ఎల్.ఏ.లలో ఇద్దరిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఇక హత్యా ప్రయత్నం చేసి కేసులున్న ఎమ్.ఎల్.ఏ.లు టి.ఆర్.ఎస్.నుండి 6 గురు, బి.జె.పి. నుండి ఒకరు, టి.డి.పి. నుండి ఒకరు ఉన్నారు. వీరందరి పైన సెక్షన్ 307 క్రింద కేసులు నమోదై ఉన్నాయి. వీరందరూ మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలలో ప్రజలముందుకు వస్తున్నారు. సాంప్రదాయ కోర్టులు కాకపోయినా, ఈ ప్రజా కోర్టులోనైనా వీరిని ఎందుకు శిక్షించకూడదు?

పాలకులు సంక్షేమ పాలన అనే భావన నుండి క్రమంగా వైదొలుగుతున్నారు. పేదలకు భూములు పంచుతామన్నారు. కానీ నేటికి భూములు పంచలేదు. భూసంస్కరణల ఊసే ఎత్తడంలేదు. గృహవసతి కల్పన ఓటు బ్యాంకు నినాదమయింది. రెండుగదుల ఇండ్లు గాలిమాటలై గిరిజనులు వేసుకున్న గుడిసెలు నేలమట్టం చేసి, జలగలంచ మహిళలను చెట్లకు కట్టేసి కొట్టిన వ్యవస్థపై యింకానమ్మకం పెరుగుతుందా? వేరే ప్రత్యామ్నాయం కనబడుతుందా? దళితులపైన జరుగుచున్న అగ్రకులాల దాడులను, స్త్రీలపై జరుగుచున్న అత్యాచారాలను, వరకట్నపు హత్యలను అరికట్టలేకపోతున్నారు. రాజ్యాంగం ప్రకారం కులాంతర వివాహాలను ప్రోత్సహించి ఆర్ధికంగా సమాజంలో ధైర్యంగా నిలబడి బ్రతికే రక్షణ కల్పించాలి. కాని పెత్తందారి అగ్ర కులాలవారే పాలకులైనందున మిర్యాలగూడలో, మంథని లో కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను హత్యచేసారు. ఇవి రాజ్యం అండదండలతోనే జరిగినవి. హిందూ మతోన్మాదులు మైనార్టీలపై జరిపే దాడులను పాలకులు ఆపడం లేదు. తెలంగాణలో ఈ ప్రభుత్వంలో అగ్రకుల దురహంకార దాడుల వలన 21మంది చనిపోయారు. సాంఘిక, ఆర్థిక అసమానతల వలన అనేక బాధలకు గురైన ప్రజలు సమస్యల సాధనకోసం ఉద్యమాలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాలలో పేదప్రజలు, కూడు, గూడు, గుడ్డ కోసం, భూమి కోసం ఉద్యమిస్తున్నారు. నిరుద్యోగం, రైతాంగ మహిళల, గిరిజన దళిత మహిళల సమస్యలు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇప్పటికి అనేక ప్రాంతాలలో సాగునీరు లేదు, మంచినీటి సౌకర్యం లేదు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. కనీస వైద్య సదుపాయాలు, రహదారులు లేని గ్రామాలు ఇప్పటికి అనేకం ఉన్నాయి. పీడిత ప్రజలు 40%మంది దారిద్ర్యరేఖకు దిగువననే నలిగిపోతున్నారు. ప్రజలు పోరాడుతున్న న్యాయమైన డిమాండ్లపై పాలకులు సమస్యలను పరిష్కరించడం ప్రక్కకు పెట్టి ప్రజా ఉద్యమాలను అణచివేయడమే ప్రభుత్వాల ద్యేయమైంది. ఉద్యమకారులను కాల్చిచంపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా హింసా అణచివేత విధానంలో మార్పులేదు. తెలంగాణలో ఇప్పటివరకు 21మంది ఉద్యమకారులను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్యచేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటూనే స్నేహపూర్వకంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి కొట్టి చంపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7 గురు లాకప్ మరణాల పాలయ్యారు. అనేకమంది పోలీసుల హింస రుచిచూసారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఎదురు తిరిగితే టైర్ల కింద నలిపేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దిక్కు ముక్కు లేని ప్రజలకు అండగా, శ్వాసగా, రక్షణగా నిలిచిన వరవరరావు లాంటి ప్రజామేథావులను, ప్రజాసంఘాల నాయకులను, విద్యార్థి సంఘాల నాయకులను, దళిత సంఘాల నాయకులను, మహిళా సంఘాల నాయకులను, గిరిజన సంఘాల నాయకులను, లాయర్లును, జర్నలిస్టులను జైళ్ళలో పెట్టి మమ్ములను అనాధలుగా మార్చిన మిమ్మల్ని అందలమెక్కిస్తే మావారిని బేషరతుగా విడుదల చేయగలరా? మాటివ్వమని అడగండి. అన్నం పెట్టిన చేతులకు బేడీలు, గొంతులకు ఉరితాళ్ళు వేయని పార్టీలు మీలో ఎవరైనా ఉన్నారా? అడగండి. పొరుగు రాష్ట్రాలలో జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లలో తెలంగాణ గ్రేహాండ్స్ పోలీసులు పాల్గొంటున్నారు. అందుకే ప్రజలు చట్ట వ్యతిరేకమైన గ్రేహాండ్స్ పోలీసు బలగాలను రద్దుచేసాకనే గ్రామాలలోకి రండి అని రాజీకీయపార్టీ నాయకులను చూపుడు వేలుతో హెచ్చరించండి. లాకప్ మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలకు పాల్పడని రాజకీయ పార్టీలు ఎవరున్నారని నిగ్గుతేల్చండి. పాలకవర్గ పార్టీలన్నీ ఒకే నిర్బంధ పాలసీని అనుసరిస్తే అన్ని పార్టీలను తిరస్కరించే హక్కు ప్రజలకు ఉందని తేల్చి చెప్పండి. నిన్నటిదాకా దుమ్మెత్తి పోసుకున్న పార్టీల మధ్య పొత్తులు - కలవకూడని పార్టీల మధ్య కలయికలు, తెలంగాణ వాదులు, ద్రోహులు, సిద్ధాంతాలు మరచి ఏదోఒక విధంగా అధికారంలోకి రావాలనే ఆకాంక్ష కలిగిన వాళ్ళను నమ్మడం ఎట్లా? కోటి ఉద్యోగాలు, లక్ష ఇండ్లు, కల్లబొల్లి కబుర్లని తేలిపోయాక ఏపార్టీని, ఏ కూటమిని విశ్వసించేదెట్లా?

కనుక చాలా ప్రాంతాలలో అనేక గ్రామాలలో తమ స్థానిక సమస్యలను పరిష్కరించలేని ఎన్నికలను బహిష్కరించడానికి ప్రజలు నిశ్చయించుకున్నారు. అనేక ప్రాంతాలలో పోటీచేస్తున్న అభ్యర్థులను, ఆపద్ధర్మ మంత్రులను తమ సమస్యలను ఏమి పరిష్కరించారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఇన్నాళ్ళు ఎక్కడ మాయమయ్యావని నిలదీస్తున్నారు. అయితే పాలకులు, పారామిలటరీ బలగాలను పెద్దఎత్తున మోహరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్నారు. పోలీసులు, ప్రజలను బలవంతంగా చితకబాది ఓట్లు వేయిస్తారేమో ! ఇప్పటికే 7 నియోజకవర్గాలలో గ్రేహాండ్స్ బలగాలను మోహరించారు. కేంద్రం నుంచి రావలసిన 275 కంపెనీ బలగాలకు గాను ఇప్పటికే 40 కంపెనీలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎన్నికల బందోబస్తు పేరుమీద 40వేల మంది పోలీసులను దించుతున్నారు. ఇది చాలదన్నట్లు 18 వేల మంది పోలీసులను ఇతర రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు పోలీసుల దిగ్భంధంలో బిక్కుబిక్కుమంటున్నారు. మహిళలు భయంభయంగా కదలాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈవిధమైన భయానక వాతావరణంలో, పోలీసుల డేగకన్నుల పహారాలో మహిళలు పోలింగు బూతులవరకు నడవడం ఎట్లా? క్యూలో గంటల తరబడి ఎందుకు నిలబడాలి? ఈ యుద్ద వాతావరణాన్ని తలపించే ఎన్నికలు మాకు అవసరమా? అని రాజకీయ నాయకులను నిలదీయండి.

ఎన్నికలలో పాల్గొనడమైనా, నిరాకరించడమైనా, ప్రజలకున్న ప్రజాస్వామిక హక్కు ఎన్నికలను నిరాకరించడం కూడా, నోటాను ఉపయోగించడం కూడా మన రాజకీయ వ్యవస్థలో పాల్గొనడమే అవుతుంది. మనకున్న రాజకీయ వ్యవస్థను మరింత మెరుగైన వ్యవస్థగా మార్చుకోవాలనుకోవడం ప్రజలకున్న ప్రాథమిక ప్రజాస్వామిక హక్కు విభిన్న దృక్పదాలు, పద్ధతులు సంఘర్షించడానికి అవకాశం ఉండే నేపథ్యమే ప్రజాస్వామిక వాతావరణం. ఈ ఎన్నికలలో పాలకుల అన్యాయాలను, స్వార్ధాన్ని ప్రశ్నించాలని పౌర ప్రజాస్వామిక హక్కుల సాధనకు ఉద్యమించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది.

పౌరహక్కుల సంఘం - తెలంగాణ

No. of visitors : 457
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కూలీల‌ను కాల్చిచంపి.. మావోయిస్టుల ముద్ర‌వేశారు

గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై clc నిజ నిర్దారణ | 20.07.2016 06:43:38pm

కూలీలు ఆటోను ఎక్కబోతుండగా రోడ్డుకు ఎడమ ప్రక్క చెట్ల పొదల్లో మాటు వేసి కూర్చున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా వారి మీదకు కాల్పులు జరిపారు. 5 మంది కూలీలు.......
...ఇంకా చదవండి

పొలం ప‌ని చేసుకుంటున్నోళ్ల‌ను కాల్చిచంపారు

పావురిగూడెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ నివేదిక | 15.08.2016 10:53:46pm

పొలం పనులు ముగించుకుని పక్కనే పారుతున్న వాగులోకి స్నానానికి బయలుదేరి పోతున్న న‌లుగురు యువ‌కులను ఉన్న‌ప‌ళంగా చుట్టుముట్టిన పోలీసులు వారిని నిర్థాక్షిణ్యంగా.....
...ఇంకా చదవండి

నిషేదాలు, నిర్భందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో స‌ద‌స్సు

| 09.09.2016 09:38:48am

రాజ‌కీయ, సామాజిక‌, సాంస్కృతిక నిషేదాల‌కు వ్య‌తిరేకంగా; హ‌క్కులు, స్వేచ్ఛా న్యాయాలు క‌లిగిన ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ‌కై ఢిల్లీలో ధ‌ర్నా, స‌ద‌స్సు.........
...ఇంకా చదవండి

చంద్ర‌బాబుకు బహిరంగ‌లేఖ‌

పౌర హ‌క్కుల సంఘం | 02.11.2016 09:45:50am

అసలు ప్రభుత్వం టార్గెట్ ఎంత? ఇందులో మావోయిస్టులతో పాటు ఎంతమంది సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు. న‌క్స‌లైట్ ఉద్య‌మం కారణంగా మన రాష్ట్రంలోకి .......
...ఇంకా చదవండి

రివార్డుల కోసం బ‌స్త‌ర్‌లో నెత్తురు పారిస్తున్న పోలీసులు

పౌరహక్కుల సంఘం | 01.04.2019 01:26:06pm

70 ఏండ్ల స్వాతంత్య్రంలో కూడు, గుడ్డ, నీరు, వైద్యం, చదువు లాంటి మౌళిక సదుపాయాలను వీరికి అందించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు అదునాతన ఆయుధాలతో వారి......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •