తాయమ్మ కరుణగా ప్రసిద్ధిపొందిన పద్మ తాజా కథా సంపుటి ʹజీవితంʹ. ఇందులోని ముప్పయి కథల్లో పదహారు కథలు ʹతాయమ్మʹ కథా సంపుటిలోనివే. మిగిలిన పద్నాలుగు కథలు కొత్తవి. ఈ కథల్ని అల్లం రాజయ్య చెప్పినట్లు మైదాన కథలు, ఆదివాసీ కథలు, విప్లవోద్యమ మహిళల కథలు అని మూడు విభాగాలుగా పేర్కొంటే అవగాహన చేసుకోవడం సులభమవుతుంది.
నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక వైరుధ్యాలతో పాటు పితృస్వామిక ఆధిపత్య నేపథ్యంగా ఇందులో పన్నెండు కథలున్నాయి. ఆడపిల్ల నవ్వును నిషేధించిన ʹక్రూరత్వంʹ నుండి ʹతాయమ్మʹ కథ దాకా ఈ పన్నెండు కథలు మైదాన జీవితంలోని ఎన్నో కోణాలను ఎత్తి చూపుతాయి. కథ పేరును ఇంటి పేరుగా మలుచుకున్న రచయిత్రులు చాలా తక్కువ. ʹతాయమ్మʹ కరుణకు ఇంటి పేరుగా మారిపోవడానికి కారణం ఆ కథ తెలుగు కథా సాహిత్యంలో ఒక క్లాసిక్ స్టోరిగానే కాక జీవిత వాస్తవికత మీద నిలబడ్డ కథ కావడమే. ఒకనాటి మాతృస్వామ్య వ్యవస్థను కాదని క్రమంగా పురుషుడు పితృస్వామ్య వ్యవస్థను ఏర్పర్చుకున్నాడు. ఆనాటి నుండి ఆకాశంలో సగమైన మహిళను అన్ని రకాలుగా దోపిడీ చేయడం హక్కుగా భావించి ఆమెను లైంగికంగా, ఆర్థికంగా దోచుకుంటూ ఆమెనొక కుటుంబపు పనిముట్టుగా తీర్చిదిద్దాడు. ఆమె బానిసలకు బానిసగా మారిపోయి తాను మనిషిననే విషయమే మర్చిపోయేలా చేసి సర్వ సుఖాలు తాను పొంది ఆమెకు ఆజన్మాంతపు జైలును బహుమతిగా ఇచ్చాడు. మహిళను దోచుకోవడానికి పురుషుడైతే చాలు అతడు తండ్రి అయినా, కొడుకైనా, భర్తయినా, బంధువులైనా ఎవరైనా అంతిమంగా స్త్రీని పీడనకు గురిచేసి, కుటుంబం పేరుతో, పరువు పేరుతో, మర్యాద పేరుతో ఆమెను సాంతం దోచుకోవడమే వీళ్ల పని. భౌతిక దాడులు, ఎడతెగని హింస, తీరని దు:ఖం తాయమ్మ, కవులమ్మలనే కాదు మనల్ని కూడా మెలి పెడుతాయి. అయితే చివరికి ఈ ఇద్దరూ తిరుగుబాటు చేసి ఎదురు తిరగడం స్త్రీ తల్చుకుంటే ఏం జరుగుతుందో తెలుపుతాయి. ఈ చైతన్యం లేకపోతే ఈ కథలు ఒట్టి రిపోర్టులను తలపించేవి. రచయిత్రి చాలా మెలకువతో తన పాఠకులెవరో గుర్తించి వారికి కావాల్సిన ఒక చైతన్యపు కాగడాను అందిస్తుంది ఈ కథల ద్వారా.
రాను రాను మనుషుల మధ్య ప్రేమానురాగాల కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువవడంతో ప్రతి దాన్ని లాభ నష్టాల కింద బేరీజు వేసుకోవడం అలవాటయి పోయింది. (లాభం - నష్టం = మానవ సంబంధాల బలి), జీవితం రోజుకింత సంక్లిష్టం అయిపోతున్న దశలో అత్తెసరు సంపాదనతో పెరుగుతున్న కర్చులను ఎలా తట్టుకోవాలి? ఈ పరిస్థితుల్లో వయసుడిగిన తల్లిదండ్రులను ఎలా సాదాలి? (బాధ్యత), ఈ సమాజంలో ఒంటరి మహిళను మనిషిగా పరిగణించడం చాలా తక్కువ. అలాంటిది ఆమెకు ఇల్లు కిరాయి ఇవ్వడమనేది పెద్ద ప్రహసనం. ఇంత గూడు కోసం లోకాన్నంతా గాలించడం ఎంతో వేదన కలిగిస్తుంది. (వేట), మనిషిలాగే పిచ్చుకలు కూడా ఒంటరితనంతో వేదనపడుతున్నాయా? (పిచ్చుకల పిచ్చి), నిజానికి రాయాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి. (కథ రాయాలి), ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక దశలో సరైన నాయకుడే కరువయ్యాడు. అలాంటి దశలో విద్యార్థులే నాయకత్వం వహిస్తే సాధించలేనిది ఏముంది? (చుక్కాని), భర్త ద్వారా భార్యకు ఎయిడ్స్ వ్యాధి సోకినా కుటుంబంలోని పెద్దలు స్త్రీనే నిందించడం ఘోరమైన, హేయమైన విషయం. (భయం పెద్ద జబ్బు), దోచుకునే నేర్పరితనం ఉన్నవాళ్లు దేశాన్ని నిలువునా దోచుకుని విదేశాలకు విహార యాత్రలకో, శాశ్వంతగానో పారిపోతున్నారు. కాని పండుటాకులకు ఇంత పెన్షన్ రావాలంటే మాత్రం మరో ప్రాణం గాలిలో కల్సిపోతేనే కాని వీలుకాని ʹముదనష్టపు రోజులుʹ వచ్చాయి. ఇవన్నీ మధ్య తరగతి జీవితాల డొల్లతనాన్ని పట్టి చూపేవే.
నక్సలైట్ ఉద్యమాన్ని స్త్రీల కోణంలో రికార్డు చేయడం చాలా తక్కువగానే జరిగింది. ఎంత రాసినా ఇంకా రాయాల్సిన కోణాలెన్నో మిగిలే ఉంటాయి. అలాంటి లోటును భర్తీ చేయడానికి కరుణ పదిహేడు కథలు రాసింది. ఈ కథలన్నీ మహిళా దృష్టితో విప్లవోద్యమాన్ని వ్యాఖ్యానించినవే. ʹʹమనుషులందరూ మంచిగా బతకాలనుకునే వారు నేరస్థులెలా అవుతారు? నిజంగా వాళ్లు ఏమీ సాధించలేదా? సాధించనే లేదా? వాళ్ల నెత్తురుతో పల్లెలు, అడవులు తడిసిపోతే ఏం జరగలేదు అంటారేమిటి? నీ కోసమైనా నువ్వు మారకూడదా? నా బతుకు నేను బతుకుతుంటే రోడ్డుకెందుకు ఈడ్చావని నిలదీయ కూడదా? నీ కోసమే. ఇంకెవరి కోసమో వద్దు. కేవలం నీ కోసమే. ఇలాంటి ఇంకెన్ని ప్రశ్నించాలి? వాళ్లు.. వాళ్ల కోసం బతకడం లేదు. జనం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం బతుకుతున్నారు కదా. ప్రాణాలిస్తున్నారు కదా. కనీసం నువ్వు నీ కోసమైనా బతక కూడదా?ʹʹ అని ఎన్నో ప్రశ్నల్ని సగటు మనిషిపై సంధించే కథ ʹవాళ్లుʹ.
విప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంటుంది లచ్చుమమ్మ. చివరికి చచ్చిపోయిన కొడుకు ఏక్కడ్నుంచి వస్తడని మల్లయ్య అసలు సంగతి చెప్తే ఆ తల్లి మల్లయ్యను కట్టలు తెంచుకున్న దు:ఖంతోని, ఆవేశంతోని పిచ్చిపట్టిన దానిలా కొడుతూనే ఉంటుంది. ʹʹనా కొడుకు చీమ కన్నా హాని జేసేటోడు కాదు. నా కొడుకు దయగల్లోడు. నా కొడుకు నల్గురి బాగును కోరుకునేటోడు. ఎవరిక్కష్టమొచ్చినా తనకొచ్చిందనుకుంటడు. నా కొడుకును ఎందుకు సంపుతురు? నా కొడుకు ఎవలకేం పాపం జేసిండని? ఇలా ఆ తల్లి ప్రశ్నిస్తూ దు:ఖిస్తూ సాపెన పెడుతూంటే ఎవరు సమాధానం చెప్పాలి? (అమ్మ).
ప్రజలకు ప్రాణాలివ్వడానికి ఉద్యమకారులెప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వారిని ఆపదల నుంచి కాపాడడానికి ప్రజలు కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఈ కోణంలో పి. వి. నరసింహారావు రాసిన ʹగొల్ల రామవ్వʹ కథను తలపించే కథ ʹనీళ్లూ - చేపలుʹ. ʹʹఅన్నా! మీ ప్రాణాలొకటి, మా వొకటా? మా కొరకేగదన్నా అందరినీ వదిలొచ్చి ఈ గుట్టలెమ్మట, పుట్టలెమ్మట కష్టాలు పడుతున్నరుʹʹ అని భావించిన పల్లె ప్రజలు విప్లవకారుల్ని కాపాడడానికి తమ మాన, ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు. ఈ రెండు కథలేగాక ʹరేపటి గెరిల్లాలుʹ, ʹపోరాడ్డంలో తేడాʹ, ʹచీమల పచ్చడిʹ, ʹకొత్త చిగుళ్లుʹ, ʹతగిన శాస్తిʹ, ʹసుడ్ల తుపాకీʹ, ʹమహిళలు ధైర్యంగా నిలబడగలరాʹ, ʹసందెʹ ʹనీళ్లెంత రుచిʹ, ʹమీ చరిత్రను మేం చెబుతాంʹ లాంటి కథలు విప్లవోద్యమంలోని అనేక కోణాల్ని చూపెడుతాయి. ఉద్యమ నిబద్దత, పోరాట స్ఫూర్తి, సాహసంగా అడుగులు వేయడం, నేర్పరితనం, త్యాగం, ఉద్యమానికి అంకితమవడం చూస్తే మన రక్తంలోకి కూడా మెల్లమెల్లగా విప్లవం సెలైన్లాగా ఎక్కుతుంది.
ఇందులోని ఆదివాసీ కథల్లో గొప్ప కథ ʹగొడ్డునుకానుʹ. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేస్తుంటే తిరగబడి తాను ఇష్టపడ్డ జీవితాన్ని ఎంచుకున్న ఆదివాసీ మహిళ మైదాన స్త్రీలకు కూడా ఆదర్శవంతమై నిలుస్తుంది.
ఇందులోని ప్రతి కథ ఏవో కొత్త దారుల్లోకి తీసుకెళ్లడమేగాక మన దేహాన్ని నిప్పుల వాగులో ముంచుతుంది. అందుకే చాలా కథలు జీవితాంతం మనల్ని వెంటాడుతాయి. తాయమ్మ, కవులమ్మ, లచ్చుమమ్మ, అమ్మలాంటి పాత్రలనయితే మనం ఎప్పటికీ మర్చిపోలేం. పైపెచ్చు శైలీ, శిల్పాలెలా ఉన్నా ఇవన్నీ చదివించే కథలు, కదిలించే కథలు. రచయిత్రి ప్రతి కథను చాలా బాధ్యతగా, బరువుగా, నిరాడంబర శైలిలో రాయడం గమనిస్తాం. కొన్ని సున్నితపు వాక్యాలయితే మెదడును దాటుకొని గుండెలోకి చేరిపోతాయి. ప్రతి కథ ఏదో భావోద్వేగాన్ని, సంఘర్షణను, చైతన్యాన్ని, విప్లవ దృక్పథాన్ని, ఆచరణత్వాన్ని కల్గించేదే.
ఈ కథలు చదవడమంటే విప్లవ జీవితాల అంతస్సంఘర్షణను మన మనసులోకి ఇంకించుకోవడం. సామాన్య జీవితాల ఎగుడు దిగుళ్లను కొంత కొంత అనుభవిస్తూ పోవడం. ఏదో ఎరుకను పొందడం. ఇంచుమించు అన్ని కథల్లో తాను అనుభవించిన లేదా చాలా దగ్గర నుంచి చూసిన జీవితాలనే కరుణ కథల్లోకి తీసుకుంది. అట్లా చేయడం వలన వీటికి విశ్వసనీయతే కాదు జీవితమంత వాస్తవికతా కూడా తోడై నాలుగు కాలాల పాటు నిలిచిపోయే కథలుగా మిగిలిపోయాయి. ఆధునిక కథలు మనిషి మార్పును కోరుకునే మాట నిజమే అయితే ఈ కథలు దానికి ఉదాహరణగా ఉంటాయి. ఇన్నేళ్ల జీవితం పొడుగునా కరుణ పడిన నొప్పిని, బాధను, పెనుగులాటను, దు:ఖాన్ని పాఠకుడిలో కూడా కల్గించడంలో ఈ కథలు ముమ్మాటికి విజయం సాధించాయని చెప్పాలి. కచ్చితంగా ఈ కథలు తెలుగు కథా సాహిత్యానికి ఒక గొప్ప చేర్పు.
Type in English and Press Space to Convert in Telugu |
ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్ కవరేజ్ ఏరియాʹఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........ |
దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలనరోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు...... |
దళిత దృక్పథం, ధిక్కార స్వరంఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి...... |
ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజుల.... |
సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి... ... |
పాతబడిన దేహపు రొద ʹవృద్ధోపనిషత్ʹప్రేయసి పాతబడుతుందేమో కాని ప్రేమ పాతబడదు. యవ్వనపు తొలివాకిట్లో నిలబడి నచ్చిన సుందరిని ఎదనిండా నింపుకున్నప్పుడు ఏదో కొత్త ...... |
సాహితీ కృషీవలుడు టి. జి. ఆర్. ప్రసాద్బాలల కథకుడిగా సాహితీరంగంలో అడుగుపెట్టిన ప్రసాద్‌గారు 1980 - 1990 మధ్య సుమారు 510 బాలల కథలను రాసి ఒకనాటి పసి హృదయాలపైన తనదైన ముద్రవేశారు. ఈ కథలన్నీ చదివితే ఇ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |