పొద్దుతిరుగుడు పువ్వు...

| సంభాషణ

పొద్దుతిరుగుడు పువ్వు...

- అల్లె రమేశ్‌ | 21.12.2018 01:34:45am

మంచు తెరలు కరిగిపోతూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. బద్దకంగా సూరీడు తన డ్యూటీలోకి మెల్లమెల్లగా వస్తున్నాడు. గాంధీ చౌరస్తాలోని రాఘవేంద్ర హోటల్‌లో దోస్తుతో కలిసి చాయి తాగిన. ఉదయం ఏడు దాటింది. బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌ సెంటర్‌కు పోవాలె. ఎన్నికల సందడి ముగిసిపోయి అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఎవల పనిలో ఆళ్లు ఉన్నా నాయకులు మాత్రం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్లెక్కుతున్న దృశ్యాలకు ఏ పత్రికల్లో చోటు లేకుండా పోతుంది. మహారాష్ట్రలో కనీసం ఉల్లి ధర కిలోకు 50 పైసలు కూడా రాకుండా పోవడంతో సాగుకంటే చావే నయమనుకున్న అనేక మంది రైతులు స్వర్గానికి పోయిన పరిస్థితి. దేశంలో, రాష్ట్రంలో అన్నదాతల చుట్టూ అల్లుకున్న సమస్యలు నా ఆలోచనల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. ఇపుడు రైతుల గురించి ఎవడికి పట్టింది. ఎవడు గెలుస్తడు అన్నదే పెద్ద సమస్యగా చూడాల్సిన పరిస్థితి దాపురించింది. మెల్లగా బైక్‌ స్టాట్‌ చేశానో లేదో ఓ గులాబీ నాయకుడు ఫోన్‌ మోగింది. అన్న... చాలైందానే నేనింకా పోలే అని చెప్పిన కలెక్టరేట్‌ విద్యానగర్‌ దాటుకుని మానేరు వంతెన దాటుకుంటూ వెలుతున్న. దశాబ్ధ కాలంగా ఈ ప్రాంతంలో జరిగిన అనేకానేక సంఘటనలు నా వెనకే వస్తున్నట్టు అన్పించింది.

ఇసుక తిన్నెలు పరుచుకుని వన్నెలు పోయిన మానేరు వాగు అడుగులు తేలి హృదయవిదారకంగా రోదిస్తున్నట్లే అనిపించింది. ఇసుక తరలిపోగా బ్రిడ్జి నుండి మద్యమానేరు కరకట్ట నిర్మాణం పనులు జరుగుతున్నయి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి ప్రణాళికలు నడుస్తున్నయి. ముందుకు వెళుతున్న ఆలోచనలు మాత్రం వెనక్కే వెలుతున్నాయి. నాలుగేండ్లుగా సిరిసిల్లలో అభివృద్ధి జోరుగానే జరుగుతుంది. వేసిన సిసి రోడ్లు వేయడం, తవ్వడం, వేయ్యడం. పట్టణంలో ఎక్కడ చూసినా నాలుగు రోజులు అందంగా కనిపించినా సిసి రోడ్డు 5వ రోజు మిషన్‌ భగీరథ పేరుతో తవ్వేసి పోతుండటంతో పనులు నిరంతరం జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఇటీవల యువతకు ఉపాధి సంగతి అలా ఉంచితే నూతనంగా ఏర్పాటైన పార్కులు ముస్తాబై అభివృద్ధి అగ్రభాగాన నిలిచాయని అంటున్నరు. కొత్త చెరువు మినీ ట్యాంకు బండుగా సిద్దిపేట కోమటిచెరువును తలదన్నేలా తయారు చేసేందుకు ఎప్పటికప్పుడు బడ్జెట్‌ను పెంచేస్తూ పనులు నిరంతరంగా జరుపుతున్నారు. 5.50 కోట్ల బడ్జెట్‌తో ప్రారరంభమైన అభివృద్ధి పనులు అంచనాలకు మించి మరింత బడ్జెట్‌ పెంచుకున్నది. పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అటు కార్గిల్‌ లేక్‌ నుంచి ఇటు చంద్రంపేట ఫోర్‌లైన్‌ పనులు మధ్యలో డివైడర్లు మధ్య చెట్లతో ఇటు విద్యానగర్‌ బైపాస్‌ దాకా విశాలమైన రోడ్లు సిరిసిల్లకు స్వాగతం పలుకుతూ అభివృద్ధి నమూనాగా నాయకులు చెప్పుకొస్తున్నా విషయాలు గింగిర్లు కొడుతున్నాయి. దేశంలో నేత రంగానికి ప్రాధాన్యత తామే ఇచ్చామని చెప్పుకొస్తున్న అంశాలు యాదికివస్తున్నయి.

బతుకమ్మ చీరల ఆర్డరుతోపాటు ఆర్‌విఎం ఇతర ఉత్పత్తుల ఆర్డరుతో పరిశ్రమను అభివృద్ధి చేశామని చెప్పుకువస్తున్నారు. నేత కార్మికులు నెలకు 20 వేల దాకా పగారా వస్తుందని అంటున్నరు. మూడు నెలల పని కాలంలో కార్మికులలో కొంత ఆర్థికంగా వెసులుబాటు అయితే కలిగింది. నూలు సబ్సిడీ, సొసైటీల పేరుతో కొంత మంది సేట్లు మాత్రం భారీగానే జేబులో వేసుకున్నట్లు వృత్తి రీత్యా నేను చేసిన పరిశీలనలో తేలిన పత్రికల ముఖచిత్రంపై కథనాలుగా చూపించలేని పరిస్థితులు అనివార్యమని చెప్పొచ్చు. అభివృద్ధి నమూనాలను మాత్రమే చూపించడానికి అలవాటు పడిపోయి బాకాలు ఊదడమే పనిగా పెట్టుకున్న క్రమంలో ఇలాంటి అంశాలు వెలుగులోకి తేవడం పెద్దగా వాటికి కలిసొచ్చే అంశం కాకపోవచ్చు. ప్రణాళికల్లో అన్ని చేస్తామని చెప్పేసి తీరా ఇపుడు ఇప్పటిదాకా ఎవడూ చేయలేదు మేమే చేశామంటూ బడ్జెట్‌ లెక్కల్లో బిచ్చంగా వేస్తున్న పాలకులు దర్జాగా ఎన్నికల ప్రచార సభల్లో దంచేస్తున్న ఉపన్యాసాలు కొనసాగుతున్న క్రమంలోనే నెల రోజుల్లో నలుగురు నేతన్నలు ఉరితాళ్ళకు వేళ్ళాడిన ఎక్కడా ఈ లెక్కలు చర్చల్లోకి రాలేదు. ఇసుక లారీలు తొక్కేసిన ప్రాణాల నుంచి నేరెళ్ళ ఘటన దాకా అనేక సంఘటనలు వెనకే వస్తున్నట్లు అనిపించింది. ముందస్తు ఎన్నికల హడావుడిలో భారీ సభలు జనసమీకరణలు, వాగ్ధానాలు, తిట్ల పురాణాలు అన్ని యధావిధిగా క్రమం తప్పకుండా జరిగిపోయాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటూ గొంతెత్తి బిగ్గరగా అరుస్తున్నాయి. లగడపాటి సర్వేలు, జాతీయ మీడియాలు చేసిన సర్వేలపై పుంఖానుపుంఖాలుగా టీవీల్లో బల్లలు విరిగేలా చర్చలు జరిగిపోతున్నాయి. అసలే సిరిసిల్ల నుండి కేటీఆర్‌ బరిలో ఉండే. ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి అంతటోడు. పక్కా గెలుసుడే అని సర్వేలల్ల చెప్పనే చెప్పిరి. పత్రికలన్నీ ముందస్తుగానే విజయాన్ని ప్రకటించకనే ప్రకటించేశాయి. టిఆర్‌ఎస్‌ వస్తదా కూటమి వస్తదా అధికారం ఎవరి పరం అయితదనే చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. అసలు సమస్యలను తొక్కేసి అన్ని మెదళ్ళలో ఇపుడు ఇవే చర్చలు. గిట్టుబాటు ధర లేక కూలిపోతున్న రైతులో నిస్సహాయ స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నా... నేతన్నలో వనరుల దాటవేతతో విధ్వంసమవుతున్న ప్రకృతి పగపట్టి మన భవిష్యత్తరాల జీవనంపై చూపుతున్న ప్రభావాలు... ఈ అంశాలు ఎవరికీ అంటరానివి అయిపోయాయి. ఇపుడు ఎవరు సీటెక్కుతారన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ఎవడో ఒకడు బాజాప్త అధికారంలోకి వస్తున్నాడు. ఎంగిలి మెతుకులు విసిరినట్లు సంక్షేమం పేరుతో విసిరేసి పోతున్నాడు. ఈ ఆలోచనలతో మెల్లగా బద్దెనపల్లి కౌంటర్‌కు చేరిన అంతా హడావుడిగా ఉన్నది. ఇంతకీ ఎవడు అధికారంలోకి వస్తడో ఏందో అని నేను కూడా ఆలోచనలో పడిపోయిన. పొద్దుతిరుగుడు పువ్వులా చుట్టూ తిరిగి ఏడ మొదలయినమో ఆడకేపోతున్న.

No. of visitors : 335
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •