ఎవరి గురించి మాట్లాడుకుందాం?

| సాహిత్యం | వ్యాసాలు

ఎవరి గురించి మాట్లాడుకుందాం?

- పాణి | 21.12.2018 08:02:08pm

కాలక్షేపానికైతే ఏదైనా మాట్లాడుకోవచ్చు. అప్పుడు కూడా కాస్త అర్థవంతంగా మాట్లాడుకుందామనే వాళ్లుంటారు. మాటలకేగాక, సందర్భాలకు కూడా అర్థాలు ఉంటాయనే ఎరుక ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఏ అర్థాలను ఎంచుకుంటామనేదే అసలు ప్రశ్న. గద్దర్‌ కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ ఎన్నికల వేళ రాహుల్‌ గాంధీని, చంద్రబాబునాయుడ్ని ఉద్వేగంగా కావలించుకోవడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా స్పందించారు.

ఇదేమిటి? అనే దిగ్భ్రాంతి నుంచి తేరుకోడానికి కొందరికి టైం పట్టవచ్చు. అందాకా ఇది ఉండేదే.

కానీ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఏ కచ్చిత వైఖరి తీసుకొని మాట్లాడుకోవాలి? అనే ప్రశ్నలు మన ముందున్నాయి. సమయ సందర్భాలకు ఉండే అర్థాలను ఎంచుకోవడం అంటే ఇదే. గద్దర్‌ తన ప్రయోజనం కోసమే కాంగ్రెస్‌లో చేరాడు. అంటే ఏదో ఒకటి పొందడం కోసం, లేదా తీసుకోవడం కోసం. కాంగ్రెస్‌లో చేరాక రాహుల్‌నో, చంద్రబాబునో కావలించుకోవాల్సిందే. లేకుంటే ఎట్లవుతుంది?

ఇది చూసి దిగ్భ్రాంతి చెందని వాళ్లకే పైన చెప్పిన అర్థాల ఎంపికలో స్పష్టత ఉంటుంది.

ఏది తీసుకుంటాం? ఏది వదులుకుంటాం? అనేది జీవితంపట్ల మన వైఖరిని తెలియజేసే అతి ముఖ్యమైన ప్రాతిపదిక. మనుషులకు పుట్టకతోసహా అనేక కారణాల వల్ల వాటికవే సంక్రమించేవి ఎన్నో ఉంటాయి. ఎందుకలా సంక్రమిస్తాయో బోలెడు సామాజిక విశ్లేషణ ఇవ్వవచ్చు. అదంతా వాస్తవికతను అర్థం చేసుకోడానికి పనికొస్తుంది. అలా సంక్రమించడంలోని అసమానతలను, దుర్మార్గాలను ఎలా తుడిచేయాలి? అనేది కూడా అదే తలంలో తేల్చుకోవాల్సిన విషయం.

అంతకంటే ముందు వ్యక్తిగత స్థాయిలో మనుషులు దేన్ని తీసేసుకుంటారు? దేన్ని వదిలేసుకుంటారు? అనే గీటురాయి చైతన్యం-ఆచరణకు సంబంధించిన విషయమని గ్రహించాలి. ఇది మానవ అస్తిత్వాన్ని అంచనా వేయడానికి మనం చేరుకోవాల్సిన మౌలిక తలం. ఒకరు ఒకటి తీసుకోవడం ఆ వ్యక్తికి సంబంధించిన విషయమని పైకి అనిపిస్తుంది. అది అనుచితమైనది అయితే సమాజం చాలా కోల్పోతుంది. దీనికి భిన్నంగా సామాజిక అస్తిత్వం నుంచి సంక్రమించిన వాటిని ఇంకొకరు వదిలేసుకోడానికి సిద్ధపడవచ్చు. పైకి ఆ వ్యక్తి వదులుకున్నట్లు కనిపిస్తుంది కాని ఇది విమర్శనాత్మక ఆచరణ రూపం. సమాజ ప్రగతిదాయక పరివర్తనకిది దోహదపడుతుంది. అంటే సమాజానికి మేలు చేస్తుంది.

దీన్ని రాజకీయ తలంలో కూడా చర్చించవచ్చు. రాజ్యం తనపట్ల విమర్శనాత్మకంగా ఉండే వ్యక్తులను తన పక్షంలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దానికి అంగీకరించని వాళ్లను హత్య చేస్తుంది. ఈ రెండు పద్ధతులను రాజ్యం అనుసరించి తనకు ప్రత్యర్థులు లేకుండా చూసుకుంటుంది. అంటే విమర్శనాత్మక ఆచరణ లేకుండా చేస్తుంది. మనిషి అస్తిత్వమే లేకుండా చేయడమన్నమాట. ఈ రెండు రకాలుగా వ్యక్తులను లేకుండా చేయడమంటే అది ఆ వ్యక్తులకు జరిగే నష్టమని పైకి కనిపిస్తుంది. వాస్తవానికి ఆ సమాజంలో జరిగే మార్పు క్రమం చాలా నష్టపోతుంది.

ఆ రకంగా ఇది చాలా సంక్లిష్టమైన మానవ అస్తిత్వానికి సంబంధించింది. దీన్ని సామాజిక అస్తిత్వ వాదాలు (అస్తిత్వాల ప్రాధాన్యతను మర్చిపోడానికి లేదు) వివరించలేవు. అలాగే తాత్విక అస్తిత్వవాదులు కూడా దీన్ని వివరించలేరు. చైతన్యయుతంగా మనుషులు ఎంచుకునే భౌతిక ఆచరణే మానవ అస్తిత్వానికి ప్రాతిపదిక. ఇక్కడి నుంచే వివరించగలం. మనుషులు దేన్ని తీసుకోవాలి? దేన్ని వదులుకోవాలి? అనేది తేలేది ఇక్కడే.

కొన్ని సామాజిక నేపథ్యాలు ఉన్న వాళ్లకు ఇలా తేల్చుకునే వెసులుబాటు ఉండొచ్చు. అసలు తరతరాలుగా ఎప్పుడూ ఏదీ పొందని వాళ్లు, సమాజం నుంచి తీసుకోని వాళ్లకు ఈ ప్రశ్నే ఉండదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు కోటానుకోట్ల మంది ఉన్నారు. అంత మాత్రాన ఏ అస్తిత్వవాదీ గద్దర్‌ పరిణామాన్ని విశ్లేషించలేరు.

విశ్వాసాల కోసం దేశవ్యాప్తంగా మేధావులు జెయిళ్లనైనాసరే ఎంచుకోడాన్ని, గద్దర్‌ కాంగ్రెస్‌ను ఎంచుకోడాన్ని వాళ్ల ఆచరణ పునాది నుంచే విశ్లేషించగలం. చైతన్యవంతమైన మానవ ఆచరణ నుంచే దేన్ని వదులుకోవాలో, దేన్ని తీసుకోవాలో నిర్ణయమైపోతుంది. ప్రొ. సాయిబాబ సహా జైయిళ్లలో ఉన్న రాజకీయ ఖైదీల్లో కొందరికైనా ఈ వ్యవస్థ వల్ల, అస్తిత్వాల్లోని వెసులుబాటు వల్ల, వ్యక్తిగత ప్రతిభ వల్ల కూడా ఎన్నో పొందడానికి అవకాశం ఉంది. లేదా ఇప్పుడు వాళ్లు పొందిన వాటి కంటే ఇంకా అపారంగా తీసేసుకునే అవకాశం కూడా ఉంది.

ఉదాహరణకు ఇప్పుడు అరెస్టయి జెయిల్లో ఉన్న వాళ్లలోంచే రెండు భిన్నమైన సామాజిక అస్తిత్వాల వైపు నుంచి ఈ విషయం చూడవచ్చు. వ్యక్తిగత, ప్రతిభా సామర్థ్యాల వైపు నుంచి చూస్తే.. సుధా భరద్వాజ్‌, సురేంద్ర గాడ్లింగ్‌ ఎంతో పొందగల అవకాశం ఉంది. సునాయాసంగా ఎన్నో తీసేసుకోవచ్చు. అసలు తీసుకున్నట్లనిపించకుండానే ఎన్నో వాటంతటవే వాళ్ల సొంతమైపోయే అవకాశం ఉంది. అలాంటివెన్నో తమ చైతన్యవంతమైన ఆచరణలో భాగంగా వదిలేసుకున్నారు. వీళ్ల వరకైతే వదిలేసుకోవడం అంత గొప్ప విషయం కాదనుకున్నా.. వేరే వాటిని ఎంచుకోవడం వల్ల సమాజ మార్పుకు దోహదపడే స్థానంలో నిలబడ్డారు.

విమర్శనాత్మక ఆచరణ అంటే ఇదే. వ్యవస్థ నుంచి, సామాజిక అస్తిత్వాల నుంచి, వ్యక్తిగత ప్రతిభ (దీనికి కూడా మొదటి రెండింటి ప్రభావం ఉంటుంది) నుంచి సంక్రమించే వాటిపట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించడమే క్రిటికల్‌ ప్రాక్టీస్‌. మనిషి మానవ సంబంధాల్లో భాగంగా నిర్వహించే క్రిటికల్‌ ప్రాక్టీస్‌ వల్లనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుంది. వ్యక్తులు ఎంచుకున్న ఇలాంటి ఆచరణను తుడిచేయడం, దాచేయడం ఎవ్వరి వల్లా కాదు. ఒక వేళ అనేక కారణాల వల్ల చరిత్రలో అది మరుగునపడినా తిరిగి మరో సందర్భంలో అది మరింత శక్తివంతంగా ముందుకు వస్తుంది. చరిత్రలో ఆ కాలంలో గుర్తింపుకు నోచుకొని ఎందరో వ్యక్తుల విమర్శనాత్మక ఆచరణను ఆ తర్వాత గుర్తిస్తూ ఉంటాం. దాని వల్ల ఆ వ్యక్తుల ఆచరణ అనేక రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది.

ఆ వ్యక్తులు తమ జీవిత కాలంలో దేన్ని వదులుకున్నారు? దేన్ని ఎంచుకున్నారు? అనేదానితో సంబంధం లేకుండా ఎవ్వరూ వాళ్ల గురించి అంచనాలు ఇవ్వలేరు. ఆ మనుషులపట్ల ద్వేషంతో, వాళ్ల రాజకీయాలపట్ల వ్యతిరేకతతో దాచేయాలని ప్రయత్నించినా, ఎగదోయాలని చూసినా అయ్యే పని కాదు. ఒక మనిషి తన జీవితం పట్ల, సామాజిక అస్తిత్వాల పట్ల క్రిటికల్‌గా ఉన్నారా లేదా అనేది తేలేది ఇక్కడే. జీవితాన్ని భౌతికవాద దృష్టితో చూస్తామనే వాళ్లకు ఇదే గీటురాయి కావాలి. దీన్ని మర్చిపోయి మిగతా ఉబుసుపోని కబుర్లు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అర్థం లేని పోలికలు ఎన్నయినా తేవచ్చు. అవి ఆచరణతో సంబంధం లేని పిల్ల చేస్టలవుతాయి.

కాబట్టి ప్రతి సందర్భంలో దేన్నయినా సరే.. అది ఎంత పెద్దదయినా కావచ్చు, చిన్నదైనా కావచ్చు.. వదులుకున్న వాళ్లెవరు? తీసుకుంటున్న వాళ్లెవరు? అనే గీటురాయి మీద ఆధారపడి ఎవరి గురించి మాట్లాడాలి? అనేది తేల్చుకోవడం సులభమవుతుంది.

చాలా నిర్దిష్టంగా తేల్చుకోవాల్సిన సందర్భాలు మన ముందుకు వస్తాయి. అలాంటప్పుడు పాండిత్య ప్రదర్శనతో అసలు విషయం వదిలేసి ఆ చివరి నుంచో, ఈ చివరి నుంచో మాట్లాడేవాళ్లను చూస్తున్నాం. ఒకవేళ ఇవీ మాట్లాడాల్సినవే కావచ్చు. అయితే ఏది మాట్లాడుతున్నామో, దేని కోసం మాట్లాడుతున్నామో మన కంఠ స్వరం పట్టిస్తుంది.

ఇప్పుడు తమ చైతన్యవంతమైన విమర్శనాత్మక ఆచరణలో భాగంగా వదులుకోగలిగినన్ని వదులుకొని జెయిలు గోడల వెనుక ఉన్న ప్రజా మేధావుల గురించి మాట్లాడుకుందామా? లేక బూర్జువా రాజకీయాలు ఎంచుకున్న గద్దర్‌ పిల్లి మొగ్గల దృశ్యాలపై వ్యాఖ్యానం, వ్యాకులత ప్రకటిద్దామా?

పనిలో పనిగా ఇంకో ముచ్చట చెప్పుకోవాలి.

అందుబాటులోకి వచ్చినవి ఏవీ వదులుకోకుండానే బింకాలు పోయే ధోరణి కూడా ఉంది. ఏది ఎప్పుడు చేజారిపోతుందో అనే నిత్య భయంతో అతి జాగ్రత్తగా, నాజూకుగా వ్యవహరించేవాళ్లు మన చుట్టూనే ఉంటారు. దీని కోసం వాదాలు, వివాదాలు లేవదీసేవాళ్లనూ చూస్తుంటాం. వీళ్లు పులి స్వారీ చేస్తున్నట్లు లెక్క. ఎంత కాలం చేయగలరో చెప్పలేం. బహుశా విమర్శనాత్మక ఆచరణకు సిద్ధమయ్యే సాహసాన్ని సొంతం చేసుకుంటే పులిని లొంగదీసుకోగరు. ఏది తీసుకోవాలి? ఏది వదులుకోవాలి? అనే స్పష్టత వచ్చే వరకు ఈ స్వారీ చేయగలరా? ఏమో.. లేకుంటే ఏమవుతారు..?!. చెప్పలేం.

No. of visitors : 227
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •