ʹʹకవిత రాయడమంటే.. తెల్లని ఆకాశం మీద
నాలుగు సిరా చుక్కలు కక్కటం కాదు
ఒక్క వాక్యం కోసం నిదులేని రాత్రుల్నీ
మెతుకు ముట్టని పూటల్నీ మోసుకు తిరగాల
ఏ అట్టడుగు పొరల్లోనో దాగున్న పదం కోసం
గుండెను తవ్వుకు పోవాల
నిన్ను నువ్వు నిట్ట నిలువునా దహనం చేసుకోవాల
కన్నీళ్లలో మొలకెత్తి కవితగా రూపుకట్టాల ʹʹ
వర్తమాన తెలుగు కవితా వినీలాకాశంలో సిరికి స్వామినాయుడు ఓ వేకువపిట్ట. 2011లోనే ʹమంటిదివ్వʹను వెలిగించి ఇప్పుడు మరింత కొత్త వెలుతురులో ʹమట్టిరంగుల బొమ్మలుʹ చూపిస్తున్నాడు. ఒకింత ఆగ్రహం, కొంత సున్నితత్వం, మరికొంత దుఃఖం, ఇంకొంత రగులుతున్న అగ్నిపర్వతాన్ని కలంలో నింపుకొని మండించిన పాశుపతాస్త్రాలే ఈ సంపుటి నిండా. నిజమైన కవి కాలాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తూ కన్నీటిలో కాళ్లు తడుపుకుంటూ ఒక బాధా తీరాన్ని చేరి నొప్పిని మనకు బదిలీ చేసి తాను అక్షరాల్లో మాయమైపోతాడు.
గత ఏడెనిమిదేళ్లుగా ఈ నేల ఎన్నో సంక్షోభాల్ని చవి చూసింది. ఎంతో సంక్లిష్టతను భుజానికెత్తుకుంది. మరో కొత్త వసంతంలోకి అడుగుపెడుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పగిలిన అద్దంలాంటి, బీటలు వారిన చెరువులాంటి మనిషి వికృత రూపం కళ్ల ముందు కదలాడి మన పాద ముద్రల్ని చూసి మనమే జుగుప్సకు లోనవుతాం. ఉద్దానం కిడ్ని మరణాలు, మరింత విధ్వంసమైపోతున్న ప్రకృతి, జాలరి జీవితాల్లో పర్చుకున్న సముద్రమంతటి విషాదం, ఉరికొయ్యలకు వేలాడుతున్న నేతన్నలు, రైతన్నలు, వాకపల్లి, లక్ష్మీపేట, నిర్భయ, ఆసిఫా సంఘటనలు, బాల్యాన్ని మరింత బిగుతైన జైళ్లలో బంధించడం, మరబొమ్మలుగా మారిపోయిన విద్యార్థులు, స్త్రీలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, మనిషికీ మనిషికీ మధ్య విస్తరించుకుంటూ పోతున్న ఖాళీ, పెరుగుతూ పోతున్న వృద్ధాశ్రమాల సంఖ్య, తగ్గని వలసలు, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి, ప్రశ్నల కొడవళ్లకు ఇనుప సంకెళ్లను వేయడం, పంటపొలాల్ని గుంజుకొని రాజధానుల్ని నిర్మించడం, మనిషి చుట్టూ అల్లుకుపోతున్న సాలెగూడులాంటి దళారీ వ్యవస్థ, వెల్లువెత్తిపోతున్న మత ప్రచారాలు, తరిగిపోతున్న పంట భూముల శాతం, పెరిగిపోతున్న రియలెస్టేట్ రంగం, స్వచ్ఛ భారత్ పేరు మీద కోట్లు ఖర్చుపెట్టడం, బహుళ జాతి సంతలుగా మారిన పల్లెలు, మారకపు సరుకులుగా మారిపోతున్న మనుషులు, గెరిల్లా యుద్ధం చేస్తోన్న ప్రపంచీకరణ, పరువు హత్యలు, వ్యవసాయానికి సాయం చేయమని రోడ్డెక్కిన రైతు పాదాలు... ఇలా ఎన్నో మరపురాని భూకంపాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేశాయి. వీటి ప్రకంపనల తీవ్రతే సిరికి స్వామినాయుడి కవిత్వ ప్రతిధ్వని.
ఇవాళ పల్లెలు రోజుకింత రంగెల్సి పోతున్న ʹమట్టిబొమ్మలుʹ. మరేదో వింత రంగును దేహానికి పులుముకుంటున్న వికృత జీవులు. మనిషి ఎన్ని వంకరలు పోతున్నాడో, నాగరికత మాటున ఎంతగా దిగజారిపోతున్నాడో సిరికి స్వామినాయుడి ప్రతి వాక్యం గొంతు చించుకొని చెబుతుంది. మురికిపట్టి పోయిన మనిషిని మనమివాళ పోల్చుకోలేం. ఆఖరికి ఆనవాలు దొరకని మనిషి జాడను కనుక్కుందామన్నా అతడు ఏ సొరికెలోకో పోయి తలుపులు మూసుకుంటున్నాడు.
ʹʹకానీ, మనుషులే లేరిక్కడ!
ఉన్నా.. కనిపించని కత్తుల కోత పడ్డ
వాళ్ల మొహాల్లో నెత్తురు చుక్క లేదివాళ
పైన గంభీరంగానే ఉన్నా
లోన ఎడతెగని దుఃఖంతో గాయపడ్డ మనసులు
చితికి చితికి చితులై రగులుతూనే ఉన్నాయి
వచ్చి పడింది ప్రపంచీకరణ వరద
ఇప్పుడు ఊళ్లు
వరద నీటికి కరిగిపోయిన మట్టిరంగు బొమ్మలు!!ʹʹ
అభివృద్ధి ముసుగులో కనిపించని శత్రువు వేయిపడగల విధ్వంసాన్ని సృష్టిస్తూ మనిషిని రోజుకు కొంత ఛిద్రం చేస్తూ పోతున్నాడు. తారు రోడ్లు, ఫ్లైవోవర్లు, నిటారుగా నిలబడ్డ సెల్ టవర్లు, ఆధునిక వాహన సౌకర్యాలు, డిజిటల్ వస్తువులు అన్నీ కలిసి సగటు మనిషిని హైటెక్ సాలెగూడులో బంధించేస్తున్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ సాంకేతికతను మన జీవితాల్లోకి ఆహ్వానించాల్సిందే. కానీ అది పక్కనున్న మనిషిని కూడా చూడలేనంత చీకటిని మన జీవితాల్లోకి తీసుకురాకూడదనే సామాజిక శాస్త్రవేత్తల వాదన.
ʹʹపంట పోయినప్పుడల్లా
ఒక మరణానికి తగ్గ శోకాన్ని మోసీ మోసీ
చేసిన అప్పులు తీర్చలేక
నేల చూపులు చూస్తూ నడి వీధిలో
అతడు తల దించుకుంటే
ఒక దేశం తల దించుకున్నట్టుందిʹʹ
రైతుగా పుట్టినందుకు కొన్ని ఆకుపచ్చని గీతాలిక్కడ మధ్యలోనే తెగిపోతున్నాయి. దేశానికిన్ని మెతుకులు ధారపోద్దామని అతుకుల బతుకుకు తల ఒగ్గి నిలబడినందుకు అతని ముఖం మీదంతా చీకటే పర్చుకుంటోంది. ఈ దేశానికి వెన్నెముకలా నిలబడిన రైతుకు వెన్నుపూసలా అండగా నిలబడాల్సిన రాజ్యం, పాలకులు ఎప్పుడూ అతని నోట్లో మట్టే కొడుతున్నారు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో కొన్ని తాయిలాలు ప్రకటించి పబ్బం గడుపుకొని తెప్ప తగిలేస్తున్నారు. వ్యవసాయం పుట్టినప్పటి నుండి ఇదే పద్ధతి. అన్నం పెట్టే రైతుది పరాధీన బతుకు. కడుపుకింత అన్నం తిని కూర్చున్న చోటు నుంచే రాజ్యాల్ని మలిపే కుర్చీలది మాత్రం బంగారు బతుకు. దళారీ పాలకులు పోయి రైతులే నేరుగా పార్లమెంటుకు పోతేనే దేశ వ్యవసాయం రంగంలో సమూల మార్పులు వస్తాయేమో! ఆ రోజు ఇంకెంత దూరమో!
ʹʹపసితనం విరిసిందో లేదో పెళ్లినీ
ఆపై నేరేడు గుత్తుల్లాంటి సంతానాన్నీ
ఒంటెద్దులా బండెడు సంసారాన్ని లాగీ లాగీ.. ఆమె
బతుకు ముప్పొద్దులా
మొత్తానికి ఓ మగాడి చాటునే మగ్గిపోతోందిʹʹ
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయింది. అయినా ఆకాశంలో ఇంకో సగం ఇంకా కుంటుతూనే నడుస్తోంది. నగరాలతో పాటు గ్రామీణ స్త్రీలు కూడా ఎక్కవ శాతం గానుగెద్దులా కుటుంబ సేవలో పునీతమవుతూనే ఉన్నారు. అక్షర జ్ఞానం అంటక, చైతన్యపు కాగడాల్ని అందుకోలేక ఏ మూలకో పొగచూరి పోతున్నారు. అనాదిగా మానవజాతి ఆడదాని సేవను ఎంతగా దోపిడీ చేస్తుందో ఊహిస్తేనే లోలోపల కొన్ని అపరాధపు కెరటాలు భళ్లున పగులుతాయి.
ʹʹనాలుగు మొక్కలిచ్చి నందన వనం చేయమన్నాడు
రెండు రెక్కలు తగిలించి రివ్వున ఎగిరిపొమ్మన్నాడు
ఎవడైనా కష్టాల కాష్టంలో తగలబడిపోతుంటే
ఓ కన్నీటి మబ్బై కురిసిపొమ్మన్నాడు
మట్టిమీద నా చూపుడు వేలితో
ʹమనిషిʹ అన్న పదాన్ని దిద్దించి పోయాడుʹʹ
మట్టి ముద్ద అందమైన బొమ్మ కావడానికి, మొరటు రాయి చూడ చక్కని శిల్పం కావడానికి, ఇనుప ముక్క ఆయుధం కావడానికి ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. మనిషీ అంతే. లోకం మీద గెలుపు జెండా ఎగరేయాలంటే, ప్రపంచాన్ని తన వెంట తీసుకుపోవాలంటే ఎన్నింటినో వదులుకొని రాటుదేలాల్సిందే. బంగారానికి పుటం పెట్టినట్టు ఎవడి బతుకును వాడు తీర్చిదిద్దుకోవాల్సిందే. నాన్నో, అమ్మో, గురువో, స్నేహితుడో బతుకు పయనంలో కొంత దూరమే తోడు వస్తారు మిగిలిన ప్రయాణం మనమొక్కరమే ఒంటరిగా చేయాల్సిందే. భయం రెక్కలు విరిచి నింగి దాకా ఎగరాల్సిందే. ʹబతుకు రణరంగమైన చోట పోరాటమే ఊపిరి కావాలిʹ అంటాడు కవి.
స్వామినాయుడు శ్రమజీవుల పక్షపాతి, వ్యవసాయ ప్రేమికుడు, బలహీనుల జీరగొంతు, బాల్యం సీతాకోకచిలుకల్లా స్వేచ్ఛా మైదానంలో ఎగరాలనుకునేవాడు, మనిషిని మనిషిలా చూడాలనుకునే అత్యాశపరుడు. అందుకే ఆయన కవిత్వం నిండా వీళ్లే పరుచుకొని ఉంటారు. వీళ్ల బాధలే అక్షరాలై పుటల నిండా సాగిపోతాయి. ఈ క్రమంలో ఎంత దూరమైనా వెళ్తాడు. మనిషి పొడుగ్గానే ఉంటాడు. ఆయన కవిత్వమూ పొడుగ్గానే ఉంటుంది. అలాగని అది నిస్సారమైన కవిత్వం కాదు. నిప్పుపూల పరిమళం. చెమట పిట్టల గోస. ఒక కిన్నెరపాట, ఒక తుడుందెబ్బ.
ఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి పొదʹ, ʹఎండకాకిʹ, ʹగాయాల గంపʹ, ʹమంత్రించిన చెమటʹ, ʹనరతోటʹ, ʹదళిత పక్షిʹ, ʹకులం ముళ్లుʹ, ʹనెత్తుటిమొగ్గʹ, ʹకాంతి వనాలుʹ, ʹఅప్పుల శిలువʹ, ʹఅనల సర్పంʹ, ʹనేల కొమ్మʹ, కన్నీళ్ల కళ్లాపిʹ, ʹచిగురు దీపాలుʹ, ʹకునుకు కుటీరంʹ, ʹనిదుర కోనేరుʹ, ʹనిదుర నేలʹ, ʹఅలలపూలుʹ, ʹజలవృక్షంʹ, ʹచీకటి నదిʹ, ʹకన్నీటి పల్లకిʹ, ʹకలల పొదరిల్లుʹ, ʹవెన్నెల పరుపులుʹ, ʹఊపిరి ముడిʹ, ʹసంసారపు దివ్వెʹ, ʹకంటి బిగువునʹ, ʹపూలకన్నీరుʹ, ʹవణుకుపాముʹ, ʹకన్నీటి దీవిʹ, ʹవెలుగు మేకʹ, ʹనెలవంక పడవʹ.. ఎన్నో అద్భుత, ఊహాతీత భావచిత్రాలు కవిత్వానికి మరింత గాఢతను చేకూరుస్తాయి. అంతేగాక మన మనసు వాకిట్లో ఎన్నో రకాల రంగురంగుల పిట్టల్ని ఎగరేస్తాడు. ʹభయం పిట్టʹ, ʹఒంటరి పిట్టʹ, ʹపిల్లపిట్టʹ, ʹచెమట పిట్టʹ ʹనెత్తుటి పిట్టʹ, ʹఅడవి పిట్టʹ, ʹతేనెపిట్టʹ, ʹకూలి పిట్టʹలాంటివి చదువుతున్నప్పుడు కవి ఊహా బలం, కల్పనాశక్తి ఆసక్తి కల్గిస్తుంది.
మన్నికైన వస్తు ఎన్నికతో పాటు ప్రతి కవిత యొక్క ఎత్తుగడ, కవిత్వ నిర్మాణంలోని ఆంతరంగిక మార్మికత సరికొత్త ప్రయోగాలుగా మిగిలిపోతాయి. ప్రతి వాక్యంలో దారుశిల్పుల నగిషీతనం తొంగి చూసి అబ్బురపరుస్తుంది. తెలుగు కవిత్వ ప్రయాణంలో కచ్చితంగా ఇది ఒక జీవిత కాలం మనిషిలాగా నిలబడే కవిత్వం. కళింగాంధ్ర నేల మీది నుంచి ప్రపంచాన్ని వీక్షిస్తున్న ఈ కవి తన ప్రాంతపు విధ్వంసాన్నే చూపించినా ఇప్పుడు ఏ మానవ సమూహమూ దీనికి అతీతం కాదని, ఇది వర్తమాన జీవితాల మౌలిక రంగుల్ని అద్ది ఎగరేసిన నిప్పుల జెండా అని అవగతమవుతుంది.
Type in English and Press Space to Convert in Telugu |
ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్ కవరేజ్ ఏరియాʹఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........ |
దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలనరోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు...... |
దళిత దృక్పథం, ధిక్కార స్వరంఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి...... |
వేయి అంచుల ʹజీవితంʹప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు...... |
ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజుల.... |
పాతబడిన దేహపు రొద ʹవృద్ధోపనిషత్ʹప్రేయసి పాతబడుతుందేమో కాని ప్రేమ పాతబడదు. యవ్వనపు తొలివాకిట్లో నిలబడి నచ్చిన సుందరిని ఎదనిండా నింపుకున్నప్పుడు ఏదో కొత్త ...... |
సాహితీ కృషీవలుడు టి. జి. ఆర్. ప్రసాద్బాలల కథకుడిగా సాహితీరంగంలో అడుగుపెట్టిన ప్రసాద్‌గారు 1980 - 1990 మధ్య సుమారు 510 బాలల కథలను రాసి ఒకనాటి పసి హృదయాలపైన తనదైన ముద్రవేశారు. ఈ కథలన్నీ చదివితే ఇ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |