బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు

- జి. వెంకటకృ‌‌ష్ణ | 04.01.2019 11:03:25pm

బతుకు వెతుకులాట, సడ్లపల్లె చిదంబరరెడ్డి ఆత్మకథ. తనను తాను తన బతుకులోనంచీ బయటికి గుంజుకోవడమే యీ ఆత్మకథ. 1959 లో మొదలై 2016లో సాంకేతికంగా ముగుస్తుంది కానీ, అంతకుముందు నూటయాభై సంవత్సరాల క్రితం సంఘటనలు కూడా యీ కథనం లోకి వచ్చాయి. ఇది కేవలం అతని వ్యక్తిగత జీవితానికే పరిమితమై పోకుండా తన వెనకాముందు కాలం నాటి మానవ సంబంధాలు రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సంబంధాలనూ వాటి పరిణామాలనూ, యెన్నో సంఘటనల నేపథ్యంలో అబ్బురపరచే మనుషులనూ పరిచయం చేస్తుంది. ఈ కథ చెప్పే మనిషి పిల్లవాడిగా బడిలో చేరడంతో మొదలై కొడుక్కు పెళ్లి చేయడంతో ముగుస్తుంది. మధ్యలో అరవైయేళ్లు అతను పడ్డ వేదనలూ, చేసిన శ్రమలూ తిరిగిన ప్రదేశాలూ, నేర్చుకున్న విషయాలూ, లోనైన భావనలూ, వీటన్నింటి తర్వాత పాఠకుడికి దర్శనమిచ్చే ఆధునిక మానవుడు ఆశ్చర్యం గొలుపుతాడు. ఇదంతా ఒక ప్రాంతీయ చరిత్ర. కాలం కంటే స్థలానికీ, స్థలం కంటే సంఘటనకీ, సంఘటన కంటే భావజాలానికీ యీ రచయిత ప్రాధాన్యతనిచ్చాడు. వ్యక్తిని నడిపించే శక్తులు యేవై వుంటాయి, ఒక కథనం నడిచే క్రమంలో సమాజగతి యెలా దొరకబుచ్చుకోవాలీ అనే అధ్యయనానికి యీ కథనం మంచి వనరు.

ఇసక, కొల్లబోయిన పల్లె లాంటి కథాసంపుటులు ద్వారా తెలుగు పాఠకులకు పరిచయమైన చిదంబరరెడ్డి యిటీవలి రచన యీ ఆత్మకథ. ఫేస్ బుక్ మాధ్యమంగానూ అంతర్జాల పత్రికలలోనూ యిందులోని చాలా భాగాలు ప్రచురితమై ఆకట్టుకున్నాయి. రచయిత కు మంచి స్పందనను గడించిపెట్టాయి. తక్షణమే స్పందననందించే అంతర్జాల అవాస్తవిక మాధ్యమంలో నిష్ఠురవాస్తవికతను ప్రకటించిన యిలాంటి రచన అందులోనూ( ఆద్యంతమూ రచయిత తను మాట్లాడే) రాయలసీమ యాసలో రాసినదానికి గుర్తింపు లభించడం గమనించదగ్గ విషయం.

చిదంబరరెడ్డిది పేదరైతు కుటుంబం. పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ల తండ్రి వూళ్లు తిరిగి విరాట పర్వం(కరువు కాలంలో వానలు పడాలని గ్రామాల్లో విరాట పర్వం చదివిస్తారు) చదివి వ్యవసాయానికి తోడుగా అదనపు ఆదాయం సంపాదించేవాడు. చిదంబరరెడ్డి బాల్యం నుండే ఆస్తమా రుగ్మత కు గురయ్యాడు. బతుకంతా అది అతన్ని వెంటాడింది. చిదంబరరెడ్డి వ్యక్తిత్వ నిర్మాణంలో యీ రుగ్మత ప్రభావం కనబడుతుంది. తనను నరకయాతన పెడుతున్న రుగ్మత నుండి వుపశమనానికై ʹదేవుడ్ని ప్రార్థించుకో ʹ అని పెద్దలు చెప్పినప్పుడు రోగమిచ్చిన వుక్రోషంతో పిల్ల చిదంబరరెడ్డి దేవుడ్ని తిడతాడు. దేవుడే నిజంగా వుంటే నాలాంటి యేమీ తెలియని పసివాడికి యిలాంటి కష్టాలు యిస్తాడా అనే వాదనవైపు పసిప్రాయాన్నే చిదంబరరెడ్డి ప్రయాణించాడు. కాలంతో పాటు యీ స్వభావమే పెరిగి యవ్వన రోజులకే మూఢ సనాతన ఆచారాలనూ మతభావనలనూ వ్యతిరేకించే వాడిగా యెదిగాడు. బ్రాహ్మణ్యం పట్ల వ్యతిరేకతకు కరణాలు చేస్తుండిన దుర్మార్గాలు చూసిన అనుభవం కూడా తోడయ్యింది.ఇదే జనవిజ్ఞాన వేదిక బ్రహ్మారెడ్డి గారితో పనిచేయడానికి దోహదం చేసింది. మూఢాచారాలకు వ్యతిరేకంగా వాస్తు లాంటి అజ్ఞానాలకు వ్యతిరేకంగా చిదంబరరెడ్డి చివరిదాకా నిలబడ్డానికి బాల్యం లోనే బీజాలు పడ్డాయి. ఇదే విచికిత్స చిదంబరరెడ్డిని పద్యాల పట్ల తనకు గల ఆసక్తికి అడ్డకట్టు వేసి ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత్వం కథల వైపు నడిపించింది. బాల్యంలో ఆవహించిన అల్లర్జీ జీవితంలో ప్రతి దశలోనూ యెంత హింస పెట్టినా నిలదొక్కుకుంటూ కన్పించిన వాడు చెప్పిన మందులు మింగుతూ, ప్రతివాడూ చెప్పిన చిట్కాలు పాటిస్తూ మొండిగా పట్టుదలగా హేతువువైపూ, కార్య కారణ సంబంధివైపూ సమాజ ఆధునిక పురోభివృద్ధి వైపూ చిదంబరరెడ్డి నిలబడడమే యీ బతుకు వెతుకులాట.

ఈ పుస్తకం 80 భాగాలూ యేదో ఒక పార్శ్వం లో రాయలసీమ ప్రాంతీయతను సంతరించుకొని వున్నాయి. అది స్థలాల వివరణవల్లా, వెనుకబాటు జీవితాల చిత్రణ వల్లా, వర్షలేమి పరిస్థితులు కన్పించడం వల్ల మాత్రమే కాకుండా రాయలసీమ యాసలో మొత్తం కథనం రాయడం వల్ల రాయలసీమ తనం యీ రచనలో తొణికిసలాడుతుంది. చిదంబరరెడ్డి రచనా స్థలం తెలుగు - కన్నడ సంగమప్రాంతం కావడంతో నిఖార్సైన అచ్చతెనుగు నుడికారపు పరిమళం యీ పుస్తకానికి అంటింది. తెలుగు భాష కు అంటిపెట్టుకొని తెలుగు భాషా భుజంపై శవంలా వేలాడుతున్న సంస్కృత భాషా ఆధిపత్యాన్ని చిదంబరరెడ్డి లోని ద్రావిడభాషా మానవుడు సహించలేక పోతున్నాడని యీ పుస్తకం చదివితే అర్థమవుతుంది. అచ్చతెనుగు పలుకుబడిలో సంక్లిష్టాక్షరాలు రావనీ అవన్నీ సంస్కృతం వల్లే దాపురించాయనే (స. వెం. రమేష్ లాంటి వాళ్ల) వాదనకు చిదంబరరెడ్డి వత్తాసు పలుకుతూన్నాడనీ అర్థమవుతుంది. అందుకే సంస్క్రతం అనే పదం రాయాల్సివచ్చినప్పుడంతా చిదంబరరెడ్డి ʹసంస్కురుతంʹ అనే అంటాడు. భక్తి అని రాయాల్సివచ్చినప్పుడంతా ʹబకితిʹ అంటాడు.

ఈ పుస్తకం నిండా రాయలసీమ తెలుగు వాళ్లే మరచిపోతున్న యెన్నో పదాలూ నుడికారాలూ వున్నాయి. రప్ప(గొర్రెల కొట్టం), దాసవాళం (మందారం), అటుకుడు నీళ్లు (ముంతడు నీళ్లు), కూరేగంట్లు(చీర పేన్లు), పచ్చడం(దుప్పటి), సరద్రాలు(సరిహద్దు), యాగటి మనిషి (గర్భిణి), ఎప్పు వేయడం(తోడు వేయడం), కన్నెతోట (మొదటి పంట), కవకట్టి (పంగలకర్ర), కాడించు(సతాయించు), నెట్టుగా (నేరుగా), మెట్టుకొను (తగిలించుకొను), కిబ్బిబ్బీ (సుతరామా) లాంటి వందలాది పలుకుబడులు యీ పుస్తకం నిండా కనబడతాయ్.

చిదంబరరెడ్డి తన రచనా నిర్మాణంలో తనకు యెదురయిన యెన్నో అనుభవాలను వివరిస్తూ వాటి చుట్టూ తనదైన సూత్రీకరణ చేస్తూ వెళ్లాడు. ఆయన చేసే అన్ని సూత్రీకరణల్నీ మనం అంగీకరించలేం గానీ ఆయన తన వాదనకు తోడుచేసుకొనే అంశాలు మాత్రం చాలా ఆసక్తికరంగా వుంటాయి. ఉదాహరణకు రెడ్డి అనే పదం ʹవిరాటʹ నుండి వచ్చిందని చిదంబరరెడ్డి పేర్కొన్నారు అయితే, రెడ్డి - రెట్టకుడు - రాష్ట్రకుడు-రాష్ట్రకూటులు నుంచి పరిణామం చెందిందని చరిత్ర చెబుతోంది. అలాగే కదిరి అనే వూరి పేరు.

చిదంబరరెడ్డి రాసిన పద నిర్మాణం పట్ల కూడా యితర ప్రాంతాల వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం వుంది గానీ చిదంబరరెడ్డి పొందుపరిచిన ప్రాంతీయ సంస్కృతిని మాత్రం గ్రహించితీరుతారు. ఇందువల్లనే చిదంబరరెడ్డి సాహితీవేత్తగా "ఆధునికత" వైపు వున్నా భాషాసాంస్క్రతిక కోణంలో మాత్రం అస్తత్వవుద్యమాల మద్దతుదారుగా కన్పిస్తాడు.

చిదంబరరెడ్డి తన బతుకు వెతుకులాట లో నిఖార్సైన రాయలసీమ రైతుబిడ్డగా పుట్టి పరిణామం చెందే ప్రతి దశలోనూ రైతు తనాన్నీ రైతుతత్వాన్నీ జీర్ణించుకొని కష్టాలను యెదుర్కోవడం కనిపిస్తుంది. కన్నకొడుకు ఆక్సిడెంటై మృత్యుశయ్యపై నిస్సహాయంగా పడున్నప్పుడు చిదంబరరెడ్డి కొడుకును చూడలేక లోనికీపోలేక రాతిమనసు చేసుకొని ఆసుపత్రి బయట రోజుల తరబడి వేచిచూస్తూ లోలోపల ద్రవించిపోవడం రైతుతనం కాక మరొకటి కాదు. కౌలు కు కష్టించి పండించిన పంటను సహభాగస్తుడు స్థానబలిమితో తీసుకుపోకుండా చేసినప్పుడు చిదంబరరెడ్డి తండ్రి ప్రవర్తన కూడా యిలాగే వుంటుంది. ఎంత కొట్లాడినా లాభం లేదనుకున్నప్పుడు గుండెలు జరగనీయకుండా నిర్లిప్తంగా నిలబడే రైతు తత్వమే యీ తండ్రీకొడుకులది.

ఈ పుస్తకం ద్వారా చిదంబరరెడ్డి వ్యక్తిత్వంలో కనిపించే అపురూపమైన కోణం యేమంటే-యీ దేశ జీవనాడిలో ఎలాంటి సెక్యులర్ బహుజన జీవనమైతే వాంఛనీయమై వుందో అదే తరహా జీవిత విలువల్నీ విశ్వాసాలనూ యిముడ్చుకొని వుండడం. పుట్టుక వల్ల కాపు కులంలో పుట్టినా చాలా స్పష్టంగా పదే పదే చిదంబరరెడ్డి లోని రెడ్డి అనే తోకను విమర్శనాత్మకంగా తెగ్గోసుకుంటూనే వుంటాడు. అసలు తన తండ్రుల కాలంలో ఆ తోక లేనేలేదనీ రాజకీయులు తమ అవసరాల కోసం తోకను తగిలించారనీ చెబుతాడు. తనకు బాల్యం నుంచే వూర్లో వున్న చిన్నాబన్నాకులాల మిత్రుల సాంగత్యాన్ని నెమురువేసుకుంటూ వుంటాడు. మానవ సంబంధాలను కులంతో కాకుండా మానవత్వస్పర్శతో నిలుపుకునే ప్రయత్నాన్ని యీ పుస్తకం లోని చాలా సంఘటనల్లో చూడొచ్చు. సైన్స్ అనేది జనజీవనంలో సౌకర్యాల రూపంలో మాత్రమే వుండి దృక్పథంలో లేకపోవడాన్ని గుర్తించి సైన్స్ జీవిత ఆచరణగా చేసుకుంటాడు. దయ్యాలూ భూతాలూ లేవని తను చదువు చెప్పే పిల్లలకు నిరూపించి చూపిస్తాడు. అనాథ శవాల పట్ల మతవిస్వాసాలతో కాకుండా మానవవిస్వాసాలతో మెలగాలని పిల్లలను కలుపుకొని అంత్యక్రియలు జరిపిస్తాడు.

ఈ పుస్తకంలో దళితుల పట్ల సహానుభూతి అడుగడుగునా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో, అగ్రకులంలో పుట్టినా పేదరికం తననే యింత బాధ పెడుతుంటే కింద కులాలు యింకెంత నలిగిపోతారో కదా అనుకుంటాడు. అతిస్పష్టంగా బ్రాహ్మణ భావజాలపు ఆధిపత్యం వల్లే సమాజంలో యెన్నో చెడుగులు జరుగుతున్నాయనే పురోభివృద్ధి వాదాన్ని చిదంబరరెడ్డి సమర్థిస్తాడు. తను డిగ్రీ చదివే రోజుల్లో సంఘపరివార్ శక్తులు తమలో భాగస్వామ్యం చేసుకోవడానికి చిదంబరరెడ్డిని ఒక సమావేశానికి పిలిచినప్పుడు యీ స్పష్టమైన అవగాహన తోనే ఆ సమావేశం నుంచి బయటకు వచ్చేస్తాడు.

జీవితమనే కొలిమిలో వేదనలనే అగ్ని లో కాలీకరిగే ఒక రైతు బిడ్డ, అందులోనూ రాయలసీమ ప్రాంతపు రైతు బిడ్డ సరైన దృక్పథంతో ఎలా మలచబడతాడో చూపిస్తుంది బతుకు వెతుకులాట. ఘర్షణ సాహిత్యాన్ని నడిపించే అంతస్సూత్రమని భౌతికవాద దృక్పథం వెళ్లడిస్తూ వుంటుంది. చిదంబరరెడ్డి విషయంలో అది నూటికి నూరుపాల్లూ నిజం. చిదంబరరెడ్డి తననుతాను వేదనలనే సుత్తి తో బాదుకొని బాదుకొని తన వ్యక్తత్వాన్ని తానే నిర్మాణం చేసుకున్న శ్రామికుడు.

No. of visitors : 372
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •