పాలమూరి దుఃఖం

| సాహిత్యం | క‌థ‌లు

పాలమూరి దుఃఖం

- రమాసుందరి | 04.01.2019 11:07:42pm

ఒక పుస్తకం చదివాక అందులో రచయిత లోకానికి చెప్పదల్చిన విషయం స్పష్టంగా తేటతెల్లం అయితే అది మంచి పుస్తకం కింద లెక్క. ఆ పుస్తకంలోని విషయాలు పాఠకుల జ్ఞానేంద్రియాలకు అనుభూతమైతే అది గొప్ప సాహిత్యం అని అంటారు. టాల్ స్టాయ్ రాసిన ʹఇవాన్ ఇల్యీచ్ మరణంʹ కధ చదివాక మరణం దాదాపు మన దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మరణ వేదన ఛాయలు మనల్ని వెన్నాడతాయి. మరణాన్ని దాదాపుగా అనుభూతి చెందుతాము. గీతాంజలి రాసిన ʹపాలమూరు వలస బ్రతుకు చిత్రాలుʹ పుస్తకం చదివిన తరువాత కూడా ఆకలిని, కరువును అనుభూతిస్తాము. అంతటి ప్రభావం కలిగించగలిగిన పుస్తకాలు అరుదుగా ఉంటాయి. రచయిత్రి ఈ పుస్తకం రాస్తూ ఎంత వేదనను అనుభవించిందో ఆ వేదనకు సహానుభూతి కంటే ఎక్కువ లెవెల్ లో అనుభూతి పాఠకులకు కలిగి తీరుతుంది. ʹపధేర్ పాంచాలిʹ నవలలో రచయిత బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ బీద బ్రాహ్మణ కుటుంబంలో చిత్రీకరించిన ముసలమ్మ ఆకలి చావూ, పేదరికం కాటేసిన దుర్గ చావూ భారత సమాజాన్ని కదిలించివేశాయి. కరువు, ఆకలి కధా వస్తువులుగా ʹమాలపల్లిʹ, ʹఅంటరాని వసంతంʹ కలిగించిన ప్రకోపనాలు తక్కువవి కావు. వాస్తవాలు తెలుసుకోదలిచిన పాఠకులను ఆనాటి పరిస్థితులకు దగ్గరగా వేలుపట్టి తీసుకొని వెళ్ళి ఈ రచనలు దుఃఖింపచేస్తాయి. ʹపాలమూరు వలస బ్రతుకు చిత్రాలుʹ అలాంటి పాఠకులకు అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని మిగిలిస్తుంది. గొరుసు జగదీశ్వరరెడ్డి ʹవలస పక్షులుʹ పాలమూరు వలస బ్రతుకుల గురించి నేను చదివిన మొదటి కధ. వలస బతుకుల అభద్రతను, దుఃఖాన్ని ఆ కధ శ్వాసలో నింపుతుంది. ఇక గీతాంజలి రాసిన ఈ పుస్తకం చదివాక ఆ దుఃఖం వెయ్యింతలై చుట్టుముడుతుంది.

ʹపాలమూరు లాబరోళ్ళుʹ అనే పదాన్ని చెవులకు యాంత్రికంగా, మనసుకు పరాకుగా మార్చగలిగిన తరతరాల రాజకీయ కుట్రను బట్టబయలు చేస్తుంది ఈ పుస్తకం. గీతాంజలి రాసిన ఈ చరిత్ర ఎప్పడో మధ్య యుగాల నాటిది కాదు. కనీసం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పబడుతున్న కాలానికి ముందు కాలానికి సంబంధించినది కూడా కాదు. ఎక్కడో సోమాలియాలో జరుగుతున్నది కూడా కాదు. ఇది వర్తమాన చరిత్ర. మనం బతుకుతున్న కాలంలో జరుగుతున్నదే. మనం ఊపిరి తీసుకొంటున్న గాలికి ఆవల - చాలా దగ్గరగా, నాలుగైదు గంటల ప్రయాణంలో- ఇంకో నేల మీద ఊపిరి తీసుకొంటున్న ప్రజల వ్యధ ఇది. కరువు ఆకలిగా మారి, వలస వెళ్ళి, చావుగా తిరిగి వచ్చిన లక్షలాది ప్రజల కధ ఇది.

ఈ పుస్తకంలో కధలుగా ఏడు, కవితలుగా రెండు, పెద్దకధలుగా రెండు, నవలగా ఒకటి, నాటకంగా ఇంకొకటి ఉన్నప్పటికీ ఇవన్నీ పరిమాణంలో వేరువేరుగా ఉన్న జీవన చిత్రాలు. ఈ రచనల్లో పాత్రలు ఏవి కల్పితాలు కావు. అవన్నీ నిజ వ్యక్తులు. వాళ్ళ పేర్లు, ఊళ్ళు కూడా చెబుతూ ఉంటాయి. నిజానికి గీతాంజలి పెద్దగా కాల్పనికత వీటిల్లో జొప్పించటానికి ప్రయత్నం చేయలేదు. ఆ అవసరం కూడా నిజానికి లేదు. ఆ బతుకులు వాటికి అవే గొప్ప వైవిధ్యంతో, నావెల్టీతో ఉంటాయి. మనకు తెలియని ప్రపంచాల్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో నిజాయితీగా తెలియచెప్పటమే ఈ విభిన్నతకు కారణం. గీతాంజలి ఆ ప్రజల బాధను త్రికరణశుద్ధిగా అనుభవించింది. కాబట్టే అందులో పట్టుకోదగ్గ విషయాలను పట్టుకొని వాటిపై వెలుగును ప్రసరించగలిగింది. ఈ రచనల్లో సంభాషణలను మాత్రమే కాక రచయిత్రి పరిభాషను కూడా పాలమూరు మాండలికంలో చేయటం ఒక ప్రత్యేకత. ఈ ప్రక్రియ వలన అంతులేని సహజత్వం ఈ కథలకు వచ్చిచేరింది. ఈ సహజత్వం కోసం ఆమె చాలా శ్రమించి ఉండాలి. మాండలికాలను యధాతథంగా పట్టుకోవటం ఎంత తెలంగాణావాసులకు అయినా చాలా కష్టం. ముఖ్యంగా మహబూబ్ నగర్ మాండలికం వేరుగా ఉంటుంది. ఆ జనాల్లో మమేకం అయితేనే అది సాధ్యం అవుతుంది కాని పుస్తకాల నుండి నేర్చుకోగలిగింది కాదు. ఆమె వాడిన ప్రజల భాష ప్రజలు చెబుతున్న విషయాలకు అత్యంత ప్రామాణికతను చేకూర్చింది.

మొక్క నేల నుండి పీకితే వేర్లతో బాటు వచ్చే మట్టిలాగా వలసల చుట్టూ అల్లుకొని ఉన్న అనేక సామాజిక, రాజకీయ అంశాలను ప్రస్తావించారు ఈ పుస్తకంలో. ఈ కధల్లో వలస జీవితాల్లో ఆకలితో బాటు స్త్రీల మీద జరుగుతున్న లైంగిక హింస, దాడులు ఉంటాయి. కుటుంబాలకు దూరంగా ఉంటూ బయట సెక్స్ కు పాల్పడి ఎయిడ్స్ రోగులుగా మారిన విషాదం ఉంటుంది. దేశంకాని దేశంలో చనిపోయి చావు మూటలుగా రైళ్లలో, బస్సుల్లో దొంగచాటుగా రవాణా అవుతూ వచ్చిన పీనుగల చరిత్ర ఉంటుంది. పనిచేసే కాడ అనారోగ్యమైన నీళ్ళు తాగి పసికర్లు అయ్యి యింటికి చేరకుండానే దారిలో శవాలై అదృశ్యమైన జాడలేని అనేక మనుషుల గురించి ఉంటుంది. వ్యవసాయం భారమై అప్పుల బాధ భరించలేక గుండె పగిలి, మందు తాగిన మరణాల గురించి ఉంటుంది. ఆకలి తట్టుకోలేక బిడ్డని అమ్ముకోబూనిన నిర్దయ ఉంటుంది. భూములు సెజ్ ల పరమైపోతే అక్కడే కూలీలుగా పనిచేయాల్సిన అగత్యాల గురించి ఉంటుంది. అప్పుల వడిలో చిక్కుకొని ఆడపిల్లలను జోగినిలుగా, మగపిల్లలను గొర్ల కాపరులుగా తరిమి వారికి తల్లిదండ్రులే బతుకు లేకుండా చేసిన దుర్మార్గం ఉంటుంది. గుండె దిటవు చేసుకొని చదవవలసిన కధలు (జీవితాలు) ఇవి. కధలు చదువుతున్నంత సేపు, తరువాత కూడా మనసు చెర పడినట్లుగా, బహుళ విషాద గీతాలు ఒక్కసారిగా మిన్నంటి మోగుతున్నట్లుగా అనిపిస్తుంది.

కొద్ది సంవత్సరాల క్రితం మరాఠా నుండి కరీంనగర్ పనులకు వచ్చి కాంట్రాక్టర్ చేతిలో రోజుల తరబడి అత్యాచారాలకు గురైన బాలికల సంగతి పేపర్లో వచ్చింది. తల్లిదండ్రులు కాళ్ళవేళ్ళ పడినా వినకుండా ఆ పిల్లల్ని లాక్కొని పోయి గదిలో బంధించి హింసించిన విషయం అది. ఆ బాలికలు తరువాత అక్కడనుండి బయటపడి కేసు పెట్టి, అనేక వత్తిడులకు తట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న సాహస వృత్తాంతం అది. పొద్దున్నే కాఫీ తాగుతూ పేపర్ చదివే వాళ్ళకు ఈ వార్తలలో అనేక సందేహాలు వస్తుంటాయి. ఇదంతా నిజమేనా? సినిమాల్లో చూపించినట్లు యింత క్రూరత్వం ఒక చోట కుప్ప పోసినట్లు ఉంటుందా? ఉంటుంది అని ససాక్ష్యంగా ముందుకు వస్తారు మంగ, పుష్ప ʹఎండి గజ్జెలుʹ ʹచావుʹ కధల్లో. వాళ్ళ పేర్లు, ఊర్లతో సహా చెబుతూ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని సవాల్ చేస్తారు. వలస జీవితం ప్రసాదించే అభద్రత ఒక్కొక్కప్పుడు మనిషిని ఆటవిక ప్రపంచంలో జీవిస్తున్నట్లు తోయిస్తుంది. కాళ్ళ కింద భూమి ఉంటేనే సాంఘిక నియమాలు కొన్నైనా వర్తిస్తాయి అనే చేదు వాస్తవం అర్ధం అవుతుంది.

వలస మానవ హక్కుల్ని మింగేస్తుంది. బిడ్డకు పాలు ఇవ్వాల్సిన హక్కును కూడా. మహిళా ఉద్యోగస్తులు బిడ్డలకు పాలు ఇచ్చే వయసు దాటిన తరువాత కూడా వారి సంరక్షణ కోసం ప్రసూతి సెలవు కాలం పెంచాలని ఉద్యమాలు చేస్తుంటే ఇంకో పక్క పాలు ఇచ్చే వ్యవధిలేని 14 గంటల భవన నిర్మాణ కూలీపనిలో వలస తల్లులు బిడ్డలకు అందని అంతస్తుల ఎత్తున ఉంటున్నారు. ʹఅమ్మ రాయే చెల్లి యాడ్స్తాంది. పాలిద్దు రాʹ అంటూ చెల్లెలి కోసం మూడంతరాల బిల్డింగ్ ఎక్కి కాలు జారి పడిపోయిన పదేళ్ళ కృష్ణమ్మ చావుకు కారణం ఎవరు? పాలివ్వటానికి చెల్లి దగ్గరకు రాలేని తల్లి చంద్రమ్మా? పని వదలటానికి అనుమతి ఇవ్వని మేస్త్రీనా? ఆ దుర్భర పరిస్తితులకు వాళ్ళను నెట్టిన కరువా? కరువుకు దారులు వేసిన రాజకీయాలా? ఇన్ని లోతుల్లోకి పోయి రాసిన కధ ʹకృష్ణమ్మʹ. ʹబిరబిరా కృష్ణమ్మ పరుగులుʹ పెడుతూ ఆంధ్రా కెళ్ళిపోతుంటే పాలమూరు కృష్ణమ్మలు దేశాంతరాన చావులై పోతున్నారు.

కరువుతో, వలసతో ముడిపడిన పితృస్వామ్యం మరింత భీకరమైనది. ʹఊయలʹ కధలో జోగినిగా మారిన అనసూయ ఆ క్రూరత్వాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తుంది. పదకొండేళ్ల పసి గుడ్డును మగాళ్ల దాహానికి అప్పగించిన తల్లిదండ్రుల నిస్సహాయ స్థితి, ʹబిడ్డ ఒక్కటైనా కడుపు నిండా తింటుందేమోʹ అనే ఆశతో ముడిపడి ఉంటుంది. బడికి వెళ్ళి అందరి పిల్లలతో చదువుకోవాల్సిన పిల్లకు ఊళ్ళో కరువు పరిస్తితులు జోగిని పేరుతో వ్యభిచారంలోకి నెట్టి చివరకు ఆమె మరణానికి కారణం అవుతాయి. ʹలక్ష్మిʹ నవలలో తల్లి దండ్రులు వలసకు వెళ్ళగా వికలాంగురాలైన లక్ష్మికి లేటు వయసులో జరిగిన పెళ్లి గొప్ప హింసానుభవాన్ని మిగులుస్తుంది. ఆకలి కోసం వలస వెళ్ళిన బతుకుల్లో ఆ ఆకలి తీరే మార్గాలు కూడా సరిగ్గా ఉండవు. వలసలు నివసించే ప్రదేశాలు, తినే తిండి అదే చెబుతాయి. తైలపు పిండితో ముద్దలు, చింతపండు పులుసు ... మూడు పూటలే అవే ఆహారం. కాశ్మీర్ లాంటి గడ్డకట్టే చలి ప్రాంతాల్లో కూడా కప్పుకోను చలి దుస్తులు ఇవ్వరు.

వలసల వెనకాల కుటిల రాజకీయాలు ఉన్నాయి. 45 లక్షల పాలమూరు జనాభాలో 15 లక్షల మంది వలసలు పోతే ఇళ్ళకి బీగాలు, ఊళ్ళకి బీగాలు. పాలమూరు నేల గుండెల్లో ఉన్న వేలాది చెరువులు తడి అవ్వటానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. కానీ పాలమూరును ప్రపంచానికి చూపించి అడక్క తినటానికి అలవాటుపడ్డ కాంగ్రెస్, తెలుగుదేశం, ఇప్పటి తెరాసా పార్టీలు ఆ పని ఎప్పటికీ చెయ్యవు. చెయ్యనివ్వవు. కరువు, ఆకలి, వలస, చావులతో అస్తిపంజరంగా మారిన పాలమూరుకు ఇప్పటి నాయకులు చెబుతున్న పరిష్కారం సెజ్ లు. ఉద్యోగాలు ఇస్తామని మభ్య పెట్టి, ఉన్నగుక్కెడు భూమిని బలవంతంగా లాక్కొని, కుటుంబంలో ఒక్కరికీ మాత్రమే ఉద్యోగం ఇచ్చిన కుట్రలో అధికార పార్టీల వంతు ఎంతో?! బతినన్నాళ్లు వ్యవసాయం చేయగలిగిన స్త్రీలు, పురుషులు యాభై దాటగానే సెజ్ లలో పనికి పనికి రాకుండా పోయిన వైనం ʹనేను పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్న!ʹ కథ చెబుతుంది. పంట భూములతో బాటు శ్మశానాలకు కూడా కంచెలు కట్టి చేసిన ఆక్రమణలు చివరకు పీనుగలను చెట్టుకు కట్టి వదిలేసే దుస్థితికి నెడతాయి. సెజ్ లలో పని చేసేవారికి ప్రకృతి ధర్మాలు తీర్చుకోవటానికి కూడా రుజువులు చూపించాల్సిన గతి పడుతుంది. పాస్ కని అడిగి వెళ్ళిన లక్ష్మిని పాస్ పోసిన తావు చూపించమని అడుగుతాడు సూపర్ వైజర్.

గీతాంజలి కధల్లోని పాత్రలన్నీ(అందరూ నిజ వ్యక్తులే) మా గురించి మంచిగా రాయమని అడుగుతుంటాయి. మా బతుకులు ఇలా అయ్యాయని రాయద్దు అని మొత్తుకొంటుంటాయి. నిబద్ధత కలిగిన రచయిత్రిగా ఈ స్థితి గీతాంజలికి కష్టమే. వాస్తవాలు మరుగు పర్చి రాయటం అంటే ఆత్మను వంచించుకోవటమే. అయితే ఆమె ఆశావహ దృక్పధం ʹఆఖరు వడ్ల గింజలుʹ పెద్దకధలో బయట పడుతుంది. సెజ్ లకు భూములను వదులుకొన్న తరువాత, భూమంతా కంకరతో సాఫు చేసి గుర్తుపట్టకుండా అయిన తర్వాత కూడా మొగులమ్మ ఇంట్లో నుండి బయటకు పోతున్న ఆఖరు వడ్ల గింజల నుండి కొన్నింటిని దాచుకొంటుంది. భూమి మళ్ళీ తిరిగి వస్తుందనీ, ఆ యిత్తనాలు మళ్ళీ మొలకలు ఎత్తుతాయనే మొగులమ్మ ఆశలో రచయిత్రి గీతాంజలి కనిపిస్తుంది. అలాంటి ఆశే ఇంకో పెద్దకధ ʹగొర్లుʹలో కూడా వినిపిస్తుంది. గర్భిణీ అయిన గొర్రె, గొర్రెల కాపరి రామును ఎదురు తిరగమని ఉద్బోధిస్తుంది. పది గొర్రెలు ప్రత్యేక తెలంగాణా ఉద్యమ మీటింగ్ లో కూర్చొని వింటున్నట్లు రాస్తారు రచయిత్రి. రచయిత్రికి ప్రత్యేక తెలంగాణ పట్ల భ్రమలు ఉన్నాయేమో అనే పాఠకుల అనుమానం ʹలక్ష్మిʹʹనవలలో తీరిపోతుంది. ముప్ఫై ఏళ్ల లక్ష్మి వలస కూలీగా తిరగని రాష్ట్రం లేదు. ప్రత్యేక తెలంగాణా వచ్చిన తరువాత మా భూముల్లో నీళ్ళు వస్తాయని చెప్పి హైదరాబాద్ యింటి పనిమనిషితనం నుండి పాలమూరు గ్రామానికి వ్యవసాయానికి వెళ్ళిన లక్ష్మి మరో ఆరు నెలల్లో మళ్ళీ వలసకు వెళ్లిపోవాల్సి వస్తుంది.

మధ్య తరగతి సౌకర్యాల మధ్య బ్రతుకుతున్న బుద్ధి జీవులకు జీవితాల్లో ఇన్ని కష్టాలు ఉంటాయా అనే ప్రశ్న రావటం సహజం. ఈ పుస్తకం అలాంటి వాళ్ళే చదవాలి. ʹభారతదేశం వెలిగి పోతుందిʹ ʹమేక్ ఇన్ ఇండియాʹ లాంటి నిష్క్రియాపూరితమైన, నకిలీ నినాదాలు ఈ కధా పరిసరాలకు దరిదాపులకు కూడా రాలేవు. ఈ కధల్లో ఆకలే వస్తువు. ఆకలిని అనేక విధాలుగా – వలసతో, కరువుతో, చావుతో – వ్యక్తీకరించటమే ఈ రచనల శైలి. కడుపును అచ్చంగా చేతపట్టుకొని బొంబాయ్, భోపాల్, కాష్మీర్ లాంటి పట్టణాలకు పనులకు పోతున్న వలస జీవిత చిత్రాలను అన్ని రంగులతో చిత్రించటమే కాదు, ఆ విషాద బతుకులకు కారణాలు చెప్పటం కూడా రచనల్లో భాగం చేసి ఆ వృత్తాంతాలకు పరిపూర్ణత యిచ్చారు రచయిత్రి. ఈ స్థాయిలో సామాజిక స్పృహ ఉన్న రచయిత్రుల మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది. సమాజం డిమాండ్ చేస్తున్న అనేక అంశాలలోకి మైక్రో లెవెల్ లో వెళ్ళి వాటిని సాహిత్యపరం చేయాల్సిన బాధ్యత గీతాంజలి లాంటి రచయిత్రుల మీద ఉంది.

చివరిగా ఈ పుస్తకంలో ఉన్న గీతాంజలి కవిత ʹదుఃఖం ఒక విప్లవంʹ గురించి చెప్పాలి. ఈ కవితలో రచయిత్రి ఆత్మ, దృక్పధం రెండూ ఉన్నాయి. దుఃఖానికి వున్న వైయక్తిక లక్షణాన్ని రచయితలు అందరూ వదిలి పెట్టాల్సిన అవసరాన్ని ఈ కవిత చెబుతుంది. ప్రజల కోసం ʹప్రభంజనం లాగా దుఃఖిద్దాంʹ అంటూనే ʹదుఃఖాన్ని ఆయుధంగా చేద్దాం!ʹ ʹదుఃఖాన్ని విప్లవంగా మారుద్దాం!ʹ అని పిలుపునిస్తుంది. ఈ పుస్తకం చదివిన దుఃఖం నుండి బయటపడాలంటే ఆమె పిలుపును అనుసరించటం తప్ప వేరే మార్గం కనబడదు.

No. of visitors : 562
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •