మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.

- శ్రీరాం పుప్పల | 04.01.2019 11:10:25pm

సిరికి స్వామినాయుడు కవిత్వ ప్రపంచానికి కొత్తవాడేమీ కాదు. 2011 లో మంటి దివ్వ అన్న కవితా సంకలనం వేసి ఐదారు సాహితీ పురస్కారాలు అందుకున్న గిరిజన ప్రాంత ఉపాధ్యాయుడు. మళ్ళీ ఏడేళ్ల వ్యవధి తర్వాత ఈ మట్టి రంగు బొమ్మలు తీసుకొచ్చాడు. ఇన్నిరోజులూ రాసిన కవిత్వమంతా కుప్పవోసాడా ? మొత్తం 70 కవితలున్న పుస్తకం. చదువుతున్న కవిత్వానికెప్పుడూ ఒక కాలిక స్పృహ ఉంటుంది. అది కవి జీవించిన స్థల కాలాల ప్రభావం వలన తన రచనలోంచి మనలోకి ఒక ఉద్వేగంగా తర్జుమా అవుతుంది. అది ఎలాగైనా సరే. కవి చూపించిన ఆవేశం గానో, ఆవేదన గానో, ఆలోచనగానో, ఏ రకంగానైనా ప్రదర్శించిన ఆయా కాల విన్యాసం అతని కవితా వాక్యాల్లోకి వచ్చి చేరుతుంది. అలాంటి చాలా సందర్భాలు కవితలుగా ఉన్నాయి పుస్తకం నిండా. కవి సమాజంలో జరుగుతున్నఅనేకానేక సంఘటనలకి తీవ్రంగా చెలించిపోతాడు. ఇబ్బంది పడతాడు. ఆ కష్టం అతని కవితల్లో కనిపిస్తుంది. స్థూలంగా చాలా చోట్ల రైతు ప్రస్తావనే కనిపిస్తుంది, లేదా గిరిజన సాంస్కృతిక జీవిత విశేషమూ, లేదా ఆ రెండూ కలగలసిపోయినట్టు మరి కొన్ని కవితలుంటాయి. "కట్టుబడిపోయాడతడు అప్పుల శిలువ మీద క్రీస్తులా" (బంది)అంటాడు రైతును చూసి. పంటని పండించాక దాన్ని ఇంటిదాకా తెచ్చుకునే అవకాశం లేని ఆర్ధిక పరిస్థితిలో ఉన్న రైతు బతుకుని గురించి చెప్తూ "గద్దల గుంపొకటి కళ్ళం మీద రెక్కలు విప్పారుతుంది, కుందిళ్లు కూలిపోతాయి, గాదెలు కుమిలిపోతాయి. అయినా ఒక నిరంతర పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ దుమ్ము పట్టిన ఆకాశంలో చుక్కల్ని నాటుతారు" (ఆశతో) అని వివరిస్తాడు. చాలా కవితల్లో రైతు ప్రస్తావన తెచ్చినప్పుడు అతనెంచుకున్న వస్తువు ఒకదాంతో మరొకటి కలగలసిపోతుంది. నిర్దుష్ట తలమ్మీద నిలుచుని మాట్లాడిన స్పృహ ఆన్ని కవితల్లో స్పష్టంగా లేదు. సుమారు 15-20 కవితలు రైతుగురించే ఉంటాయి. కాదనలేము. రైతు కష్టం గురించి ఎంత రాసినా, మరెంత దుక్ఖించినా అది అంతులేని వ్యధ. దేశం లో వ్యవసాయ విధానం అంత లోప భూయిష్టంగా, నిర్హేతుకంగా తయారైంది. రైతుని ఆదుకోవడమంటే, రుణ మాఫీ ప్రకటించడమే అన్న ఒక దుర్మార్గ ఎత్తుగడ నడుస్తున్న కాలం. అతని ఉత్పత్తికి కనీస మద్దతు ధర, విత్తనాల లభ్యత, సస్య రక్షణ, విపత్తు నిర్వహణలో నిజాయితీ తో కూడిన సహాయం లాంటివి కలలుగానే మిగిలిపోయాయి. స్వామినాయుడి రైతు మీద ఉన్న చాలా కవితలు రైతుగురించి బాధపడతాయి. రైతుని ఆశావహంగా ఉండమనే చెప్తాయి. ఒకే అంశంమీద చాలా కవితలు ఒకచోట చేరుస్తున్నపుడు, వాటిల్లో వైవిధ్యం లేకపోతే చదువర్లకి ఏ రస స్పర్శ కలుగుతుందో ఊహించడం అసాధ్యం కాదు కదా ? ఆ జాగ్రత్త పాటించలేదు కవి. కానీ దేనికది మాత్రమే చదివినపుడు ఊరటగా ఉంటుంది. అపారమైన అనుభవమున్న కవి సిరికి.

అలాగే గిరిజన నేపధ్యంలోంచి వచ్చిన కవితలూ చాలా కనిపిస్తాయి. "లారీలనిండా ఆలమందల్ని కుక్కి కబేళాకు తరలించుకుపోయినట్టు, పొగబండి నిండా కొండమేకల్ని కుక్కి కాంక్రీట్ అరణ్యాలకు తోలుకుపోతుంది. భవన నిర్మాణ కూలీలుగానో కొలిమి కుంపట్ల కార్మికులగానో నా అడవిబిడ్డలక్కడ చెమటపూల వనాలై చెల్లిపోతారు" (మోదుగుపూలు) అంటాడు. చెమటపూల వనాలన్న అన్వయాన్ని చెల్లిపోవడానికి వాడటం పక్కనపెడితే, దోపిడీకి గురవుతున్న గిరిజన జీవితాల్ని ఆవిష్కరించే ప్రయత్నంలో కవి విజయవంతమవుతాడు. "ఇప్పుడా పండుగల్లేవ్, పున్నాల్లేవ్, తుడుంనాదాల్లేవ్, ధింసా నాట్యాల్లేవ్, లేవు పిల్లంగ్రోవి పాటలు, ఎక్కుపెట్టిన విల్లంబులుʹ (దుర్ల) అంటాడు. అడవి ఎలా వాణిజ్యకేంద్రమైపోతోందో చెప్తాడు. ఆసక్తిగా ఉంటుంది. నిత్యగాయాల నెలవంక, వెదురుపొదల యుద్ధ రహస్యం, కొండమల్లె లాంటి చాలా కవితల్లో ప్రాకృతిక సౌందర్యంతో ఉండే అడవిబిడ్డల జీవితాన్ని కవిత్వీకరిస్తాడు. అసలు అడవీ, సముద్రము లేని కవిత్వం లేదా అన్నంతగా అవి మనల్ని మళ్ళీ మళ్ళీ వచ్చి పలకరించి వెళ్తుంటాయి. సరే కాదనలేము, పచ్చదనమూ, నీలిరంగు లేని కవిత్వ చిత్రపటాన్ని ఊహించలేము కానీ, పదే పదే వాటి చుట్టూనే కవితావాక్యాలని నిర్మిస్తున్నపుడు, వాటినెంత జాగ్రత్తగా వాడాలో తర్కించాలి కదా? ఆ గమనింపు చేయడు కవి. అలాగే పిట్ట అనే పదాన్ని ఎన్ని రూపాలకి అన్వయిస్తాడో లెక్కవేయలేము. ఒప్పుకోకుండా ఉండలేము. అన్నీ నిజమే, అతను ఏజన్సీ ప్రజలమీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉంటాడు. సంతల్లో వాళ్ళని మోసం చేస్తున్న షావుకార్లింకా కనిపించినప్పుడు, బాధపడతాడు. కోపగిస్తాడు. బెదిరిస్తాడు కూడా. అడవి ఇది చేస్తుంది, అది చేస్తుంది అని అంటాడు కూడా. అయితే ఒకే సమస్యమీద చాలా కవితలు రాయడం చాలా కష్టతరమైన పని కదూ ? ఎందుకంటే ఆ వస్తువు మనల్ని పీడించి పీడించి, లోపల లుంగలు చుట్టుకునిపోయి, మనల్ని ఆవిరి చేసి వదిలితే గానీ ఆ నాలుగు ముక్కలూ బైటకి రావు. వచ్చాక ఇంకేమీ లేదన్నంత ఖాళీ ఏర్పడుతుంది. కానీ కవి ఈపుస్తకంలో అడవి మీదనే చాలా కవితలల్లుతాడు. అసలు అడవే చాలా ముఖ్య భూమిక వహిస్తున్నట్టుగా చాలా కవితాలుంటాయి.

అతను చెప్పిన సారాంశాన్ని బట్టి కొన్నింటిని శ్రద్దగా ఎంపిక చేసుకునుంటే బాగుండేదనిపిస్తుంది. చదువర్ని ఒక్కో కవితా ఒక్కో ఆలోచనాత్మక పీఠంపై కూర్చుండబెట్టడం బాగుంటుంది కానీ చదివిన భావ రూపమే మళ్ళీ చదవాల్సిరావడం కాస్త ఇబ్బందికర విషయం. పాఠకుడు కవి భావ విహంగరెక్కలపై ఎగరడంకన్నా వేరు ఆనందాన్ని కోరుకోడు. ఆ ఆనందం విలక్షణ ఆకాశమైతేనే వైశాల్యం అనుభవంలోకొస్తుంది. అలానే ఈ పుస్తకములో కుల నిర్మూలన మీద చాలా కవితలున్నాయి. "కులం లేని స్మశానాల్ని కావాలని హెచ్చరిస్తున్నాం" (ఒక స్మశానం కోసమే), "గదిలో పెట్టి కొడితే పిల్లి తిరగబడ్డట్టు తలెత్తి తిరగబడితే ఎదురొడ్డి కలబడితే, చుండూరులుంటాయి, కారంచేడులుంటాయి, నీరుకొండలుంటాయి, లక్షింపేటలుంటాయి"(కాంక్ష); "ఇపుడు వాళ్ళు చేయని తప్పుకు అగ్గిలో దూకే సీతమ్మలు, బతుకంతా గాయాల్ని మోస్తూ గడప దాటలేని కన్నీటి కొలనులు. శరీరాలకే గానీ మనసులకి మలినమంటని కొండ మల్లెలు" (తడారని గీతం) అని వాకపల్లి మీద రాస్తాడు. "ఎగిరిపోయినవి ఎగిరిపోయాక ఉన్న పక్షులు గూల్లొదిలి పోయాక పిట్టల్లేని చెట్టైపోయిందీ లక్షింపేట, కన్నీటి ముసురు పట్టిన ఆకాశమైపోయిందీ లక్షింపేట, వల్లకాటి నిశ్శబ్దాన్ని నెత్తిన మోస్తుందీ లక్షింపేట" అని నల్ల కలువల నెత్తుటి దారుల్లో అన్న కవితలో రాస్తాడు. బాధ కలుగుతుంది. కవి, కులం చేస్తున్న అరాచకాన్ని కళ్ళకు గట్టినట్టు రాయడమే మనల్ని హత్తుకుంటుంది. అలానే కార్పొరేట్ చదువులపై రాసిన కవిత్వమూ, బాల్యాన్ని పదిలం చేసుకొమ్మని చెప్పే వాక్యాలూ చాలా బాగుంటాయి.

"ప్రాణంలేని బొమ్మల మధ్య ప్రేమను పంచలేని కదిలే బొమ్మల మధ్య కేవలం ప్రాణమున్న ఓ బొమ్మలా వాడు" (మట్టినంటని బాల్యం) "ఎగిరే పక్షికీ... పారే నదికీ.. విరిసే పూవుకూ నిషేధం విధిస్తారిక్కడ; మొలకెత్తని విత్తనాలై సందేహాలు మనసు మట్టిపొరల్లోనే మగ్గిపోతాయి" (శిక్ష) అని కూడా ప్రకటిస్తాడు. నిజమే. అతని ఆక్రోశంలో కవిత్వం కోసం వెతకం. అతడు చెప్పాలనుకున్న విషయం కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతుంది. ఆ భావచిత్రానికి ముగ్ధులైపోతాం.అలానే స్త్రీలమీద జరుగుతున్న అత్యాచారాలమీద, బ్రూణహత్యలమీద అతని కలం కత్తిలా దూసిన కవితలూ బాగుంటాయి. ఏకంగా మొదట్నుంచీ చివరిదాకా అతను సమాజంలో జరుగుతున్నఅనేకానేక మార్పుల్ని కవిత్వీకరించిన దాఖాలానే ఎక్కువ కనిపిస్తుంది. అతను తిరుగాడుతున్న ప్రాంతాల్లో, అతను చూస్తున్న దృశ్యాల్లో సామాన్యుడు పడుతున్న బాధలే కవిత్వం నిండా కనిపిస్తాయి. ఇంకా స్పష్టంగా ప్రపంచీకరణ కప్పేస్తున్న చిక్కటి ముసుగు మీద అతని అసహనమూ కనిపిస్తుంది. మార్పు ఎప్పుడూ వస్తువుని ప్రభావితం చేస్తుంది. వస్తువు అభివృద్ధికారకంగానే వివిధ రూపాల్ని పొంది సమాజంలో ఎన్నో విన్యాసాల్ని చేస్తుంది కనుక, ఈ కవి కవిత్వంమొత్తం అతనెంచుకున్న కవితా వస్తువే హైలెట్ గా కనిపిస్తుంది. భూతల స్వర్గంకాదు, రైతు లేకపోతే ఎంతటి గొప్ప రాజధానైనా భూతాల స్వర్గమనడం లాంటివి ఆకట్టుకుంటాయి. కానీ అతని కవిత్వ రూప విషయంలో కాస్త ఇబ్బంది అనిపించింది. చాలా కవితలు కధలా మొదలవుతాయి, ఉపోద్గాతాన్నిస్తాయి, నేరుగా వెళ్లవు. పైగా చాలా విపులంగా ఉంటాయి. సుదీర్ఘత అనివార్య లక్షణం గా కనిపిస్తుంది. సంక్షిప్త భావ ప్రకటన చాలా కొద్ది కవితల్లోనే దర్శనమిస్తుంది. బ్రెవిటీ గురించి, కవిత్వంలో దాని ప్రాముఖ్యతని గురించి ఎన్ని ఉదాహరణులు తీసుకున్నా తక్కువైపోతాయి. గాఢతని నిర్ణయించే ఆలక్షణంతో ఉన్న ఉరికొయ్య, చెరశాల, మడిచెక్క, చరిత్రచీకటి తీరం మీద, చూపు, మరబొమ్మ, సంత, భూమిలాంటి తల్లి కవితలు చాలా బాగుంటాయి. అవి ప్రశంసార్హమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి.

స్పష్టత ఎంత వసరమో, గాఢత కూడా అంతే అవసరం కదా ? ఆ విషయంలో కవిత్వ రూపమింకా పాత ధోరణిలోనే ఉందనిపిస్తుంది. పాత అని ఎందుకన్నానంటే, నేడీ రోజున కవిత్వ నిర్మాణం ఎన్ని కొత్త పోకడలు పోతోందో, భాషా నియమాల్ని సైతం తోసిరాజంటుందో ప్రేత్యేకంగా చెప్పనక్కరలేదు. పరిధి చాలా విశాలమైన సందర్భంలో ఉన్నాం. ఎక్స్ప్రెషన్ చదువరుల్ని చటుక్కున ఆకట్టుకోకపోతె అది ఎక్కువ సేపు నిలబడుతున్న సాక్ష్యాలు లేవు. అయితే స్వామినాయుడు ఆలోచనాత్మక వాక్యాలన్నీ నిడివితో పోటీ పడి మనల్ని మళ్ళీ మళ్ళీ చదివిస్తాయా అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. కానీ ఉద్దానం గురించి అతను మాత్రమే మాట్లాడాలి, పార్వతీపురం ఏజన్సీలో రైతుల కష్టం గురించి అతనే మాట్లాడాలి, ఉత్తరాంధ్రా తీరం వెంబడి పారిశ్రామిక వాడల్లో ప్రజల బాధలు గురించి అతనే చెప్పాలి, వలస వెళ్లిపోతున్న తన ప్రాంత మనుషుల గురించి అతనెంతగానో బాధపడతాడు. అంటే ఇవన్నీ ఇంకెవరూ చెప్పట్లేదా అంటే, చెప్తున్నారేమో గానీ, స్వామినాయుడు మాత్రం నిజాయితీగా గిజ గిజ లాడిపోతున్నాడు. ఆ యాతనే ఈ పుస్తకంలోని కవిత్వానికున్న జీవ లక్షణం. అందుకు అతన్ని మనసారా హత్తుకోవాలి. అతని కవిత్వం మట్టిని, అందులోని మనిషి ఉనికిని జీవనవోత్సవం చేసుకోవాల్సిన అనివార్యతని ఎరుకపరుస్తుంది. పైపై అత్తరు పూయదు.

మట్టివాసనలోంచి మనల్నీ కవిత్వం ముంచి పైకి లేపుతుందంతే. సందేహమే లేదు.

No. of visitors : 213
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •