రాయలసీమ బతుకు పోరాటం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

రాయలసీమ బతుకు పోరాటం

- పి.వరలక్ష్మి | 04.01.2019 11:14:11pm

రతనాలసీమ కాదు, రాళ్లసీమ కాదు, కరువున కాలి బొగ్గైన సీమ జీవితాలు ఇవి. ఈ జీవితాల గురించి సీమ రచయితలు చాలా రాసారు. ఏముంటుందక్కడ? కరువే కదా! అన్నంత తేలిక కాదు. మనిషి ప్రకృతితో పడే ఘర్షణ చిన్న విషయం కాదు. జీవధార ఆవిరవుతుంటే జీవితాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. వ్యక్తిగా, కుటుంబంగా, సమూహంగా పడే తండ్లాటలో అన్ని భావోద్వేగాలతో మనిషిగా గెలవడం, మనిషిగా ఓడిపోవడం గురించి చెప్తాయి ఈ కథలు. ఈ అనుభవం చేతనే రాయలసీమ కథకులకు జీవితపు లోతు తెలుసు. గాఢత్వం తెలుసు. అయినా మనుషుల గురించి కదా, ఎంత రాసినా చెప్పవలసిందేదో మిగిలే ఉందనిపిస్తుంది. కాలంతో పాటు చేసే ప్రయాణమూ ఉంటుంది. రాయలసీమ ప్రయాణమూ, ప్రయత్నమూ, ఘర్షణా ఒక దగ్గర ఘనీభవిస్తాయి. ఇంత సాంకేతికత అభివృద్ధి చెందీ మానవులు గుక్కెడు నీళ్లకు తనకలాడ్డమా అన్న ప్రశ్న దగ్గరికొస్తాయి.

దశాబ్దాల క్రితం నీళ్ల కోసం గొంతెత్తింది సీమ. పంటలు మారాయి. సాంకేతికత మారింది. మార్కెట్‌ విస్తరించింది. రాయలసీమ గొంతు మాత్రం తడవలేదు. ప్రకృతైనా కనికరిస్తుందేమో గాని మార్కెట్‌ మరింత కర్కశంగా రైతును పిండేస్తుంది. ప్రకృతిదేముంది? ఎడారుల్లో సైతం మనుషులు గొప్పగా బతకడం లేదా? పెట్టుబడి సృష్టించిన అసమానతల నుండి నీటిని మళ్లించే సాంకేతికత కూడా రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యం కింద అణిగిపోతుంది. ఈ ఆధిపత్యాన్ని నేటి రాయలసీమ ఉద్యమం గతంలోకన్నా బాగా గుర్తించింది. అందువల్లే ఇటీవల వస్తున్న సాహిత్యం గుణాత్మకంగా అభివృద్ధి చెందింది. ఈ సందర్భమే నలుమూలల నుండి రాయలసీమ గొంతును వినిపించిన రచయితలను, చరిత్ర గర్భంలో దాగిన రాయలసీమ సాహిత్య ఉనికిని వెలికితీస్తూ ఉంది. ప్రాంతీయ స్పృహతో అసమానతలను గుర్తించి ప్రశ్నించే అస్తిత్వ చైతన్యం ఇప్పటి సాహిత్యకారులకు అబ్బింది.

మూడున్నర దశాబ్దాల క్రితం రచయితగా సాహిత్య ప్రపంచం ముందుకొచ్చిన దేవిరెడ్డి వెంకటరెడ్డి ఇన్నేళ్ల తర్వాత తన కథా సంకలనాన్ని ʹసీమ బొగ్గులుʹ పేరుతో తీసుకురావడం ఇప్పడు మనమనుకుంటున్న సందర్భంతో కలిసింది. వెంకటరెడ్డిగారు రాయలసీమ అభ్యుదయ సాహిత్య ఒరవడి నుండి, 70లలో ఎగసిన విప్లవ సాహిత్యోద్యమం నుండి సాహిత్య వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. విరసం తొలినాళ్లలో సంస్థ సభ్యుడిగా ఉన్నారు. వర్గదృక్పథంతో వ్యవస్థను సునిశితంగా వ్యాఖ్యానించిన తొలితరం రచయితల ప్రభావం ఆయనపై ఉంది. శ్రీశ్రీ, త్రిపురనేని మధుసూదనరావు వంటి వాళ్ల ప్రభావం నుండి తప్పించుకోలేని కాలం అది. సకల దుర్మార్గాలకూ మూలమైన వ్యవస్థను, అది మానవ సంబంధాల్లో ప్రతిఫలించే తీరును సాహిత్యం ఎలా పట్టుకోగలదో కొకు, రావిశాస్త్రి, కారా మాస్టారు వంటి వాళ్లు తమ కథల ద్వారా నిరూపిస్తున్నారు. వ్యవస్థ లోపలి మనిషినీ, మనిషి లోపలి వ్యవస్థను మానవ జీవితపు సూక్ష్మ శకాలాల్లో సైతం అద్భుతంగా పట్టివ్వగలిగే శక్తి కథానికకుంది. తెలుగు సాహిత్యంలో అద్భుతమైన ప్రయోగాలను చేసింది కథ. ప్రత్యేకంగా ఈ ప్రాంతం నుండి రారా, సొదుం జయరాం వంటివాళ్ల ప్రత్యక్ష ప్రభావం కూడా వెంకటరెడ్డిగారి మీద ఉన్నట్టు కనపడుతుంది. అందుకే ఆయన కథలన్నీ ఎంతో పొందికగా, సూటిగా చిక్కగా అల్లిన వచనంతో ఉంటాయి. కథా నిర్మాణంలో ఒక్క వాక్యం కాదు కదా, ఒక్క పదం కూడా అదనంగా పడినట్లు కనపడదు. 60లు, 70ల నాటి ప్రగతిశీల రచయితల శైలిని వొంటబట్టించుకున్నారు కాని ఎందుకో 83నాటికి గానీ మొదటి కథ ఈయన రాయలేదు.

నిరుపేద కుటుంబం నుండి వచ్చిన నేపథ్యం కూడా వెంకటరెడ్డిగారిని బక్కజీవుల గురించి రాసేలా చేసుండవచ్చు. మొదటి కథలోనే అంగడి గుమాస్తా బతుకును పరిచయం చేస్తారు. దరిద్రాన్ని అవలీలగా భరించొచ్చనుకున్న ప్రేమజంటకు సంసార జీవితం ఊహల నుండి నేలమీదికి దించుతుంది. ʹబక్కెద్దులు సోగకు కట్టబడినాయనిʹ అర్థమవుతుంది భర్తకు. జీవితం కంపుకొడుతున్నదని అంటూ ʹఆర్ద్రంగా చెప్పటానికి నేనేం రచయిత్రినిʹ కానంటుంది భార్య. ఈ వాస్తవంలోనే ఒకరిలోఒకరు లీనమయ్యే బాంధవ్యమూ ఎక్కడో ఉంది. ఈ కథ తర్వాత మళ్లీ రాయడానికి 21 ఏళ్లు ఎందుకు పట్టిందో గాని, నేరుగా ఎండిన రాయలసీమ నేల మీద కొత్త చిగుల్లేత్తే జీవితాల్లోకి ఆయన కథ ప్రవేశించింది. ఇవి నిజంగా కొత్త పంటను వాగ్దానం చేసే చిగుర్లేనా అంటే కాకపోవచ్చు. కాని మనుషులు జీవిస్తారు. ఈ జీవించే మనుషులే రేపటికి కొనసాగింపు. అందుకే వెంకటరెడ్డిగారి కథల్లో ఆత్మహత్యలుండవు.

పంటలెండిపోతే జీవితం ఆగిపోతుందా? దెబ్బతిని లేచి నిలబడ్డానికి మనిషి జీవితంతో చేసే పోరాటం తప్పనిసరిగా ఉంటుంది. సేద్యం వాసనే వద్దనుకొని పట్నం వచ్చి రెక్కల కష్టం నమ్ముకునే రైతు బిడ్డ మాధవ, రాబోయే తరానికి ఈ నరకయాతన వద్దనుకొని కూతుర్ని మోటారు మెకానిక్కుకు ఇవ్వాలనుకునే సుభద్ర, పిల్లల చదువుకోసమే పట్నం దారి పట్టి బేల్దారి పనిలో దిగిన సోమిరెడ్డి, గ్రామీణ సంప్రదాయపు కట్టుబాట్లు ఛేదించి కులాంతర వివాహం చేసుకునే భారతి ఎవరి పరిధిలో వాళ్లు భవిష్యత్తు మీద ఆశను నిలుపుకుంటారు. దశాబ్దాలుగా కాలువ నీళ్ల కోసం ఎదురుచూపులే మిగిలి, ప్రకృతి దోబూచులాటలో ఓడిపోయి అమ్ముకుందామన్నా భూములు కొనేవాడు లేని స్థితి ఉంటే, ఇక చాలు ఈ రైతు బతుకు అనుకోకుండా ఎలా ఉంటారు? కాలువ కోసం చేసిన ఉద్యమంలో దెబ్బలు తిని, జైలుపాలై, అప్పులు, అవమానాల పాలై వ్యవస్థ కౄరత్వాన్ని చూసిన ʹబుద్ధుడుʹ రైతు జీవితమే వదిలేసుకొని బజ్జీల బండి పెట్టుకొని బతకడం ఒక వైపు నుండి చూస్తే విషాదమే. కాని నష్టమంతా లెక్కేసి ఇక్కడ తేలాక ఇక నిబ్బరంగా ఉందంటాడు.

నీళ్లను మళ్లించే ఆధునిక సాంకేతికత ఇటువైపు చూడకపోయినా రాజ్యం మాత్రం మారుమూల పల్లెల్లోకి విస్తరించింది. అందరి చేతుల్లో కార్డులు పెట్టి అందరికీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించింది. కాలువ నీళ్లు వస్తాయా రావా? రావాలంటే ఏం చేయాలి? గిట్టుబాటు ధర వస్తుందా రాదా? దళారీ మార్కెట్‌ వ్యవస్థను ఎలా ఎదుర్కోవాలి? రాయలసీమలో ఈ తరహా చర్చ ఉండదు. సేద్యం మొదలయ్యేటప్పటి నుండి పంట రుణం, భీమాల చుట్టూ రైతులు తిరుగుతారు. దొంగ పాస్‌బుక్కులకు రుణాలు, ఇన్సురెన్సులు పొందే వాళ్లు ఒక పక్క అయితే, రైతుగానే గుర్తింపు లేని కౌలుదార్లు ఒకవైపు. బ్యూరోక్రసీ పై నుండి కింది దాకా అన్ని అవలక్షణాలతో రైతు వద్దకు వచ్చేసింది. నీళ్లు మాత్రం రావు. ముప్పై ఏళ్ల క్రితం కథా రచన ప్రారంభించి ఒక గెంతుతో ఈ కాలంలోకి వచ్చి తన కథని నిలిపే ప్రయత్నం చేసారు వెంకటరెడ్డిగారు.

ఈ మధ్య కాలంలో కథా నిర్మాణం, కథన పద్ధతిలో ఎన్నో ప్రయోగాలు వచ్చాయి. చాలా మార్పులకు లోనయ్యాయి. ముఖ్యంగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాల ప్రభావం వల్ల భాష చాలా మారింది. మాండలికాలకు యాస కూడా జతయ్యింది. అయితే ప్రాంతీయ భాషలో రాసే చాలా మంది రచయితలు యాస మాత్రమే ప్రయోగించి అద్భుతమైన మాండలిక పదాలను పట్టుకోలేకపోతున్నారు. అట్లా చూసినప్పుడు ఈ తరం వాళ్లకు తెలియని ఎన్నో మాండలిక పదాలు ఈ కథల్లో నిండుగా ఉన్నాయి. ʹమితువుʹ, ʹబెలుకుʹ, ʹదేఖీలుʹ, ʹనట్టుదొగే పనిʹ, ʹఉడ్డాʹ, ʹగాటిపాటʹ, ʹముక్కట్లుʹ, ʹవలపక్రంʹ, ʹమళిగʹ - ఇవి మచ్చుకు కొన్ని. వాక్యాల్లో, కథనంలో సొగసు ఉంది. అలవోకగా చదువుకుంటూ పోతే ఇది మన నుండి వేగంగా జారిపోతుంది. అందుకని ఒక్కోచోట ఒక్కోవాక్యం కవితా పాదాల్లా చదువుకోవాలనిపిస్తుంది. ముందుమాటలో సాధారణంగా చేసే ముఖస్తుతి కాదిది. భాష, చిక్కటి వ్యక్తీకరణ నుండి ఈ కథలకు వచ్చిన శక్తి గురించే చెప్పడం.

రెండు కథల్లో కులం ప్రస్తావన వస్తుంది. కులవ్యవస్థ అట్టడుగు నుండి అస్తిత్వ స్పృహతో వస్తున్న కథలు తెలుగుసాహిత్యానికి గొప్ప చేర్పు మాత్రమే కాక, మొత్తంగా దృక్పథాన్ని, వ్యక్తీకరణను ప్రజాస్వామికీకరించేందుకు తోడ్పడ్డాయి. సాంఘిక వివక్ష ఆధారంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల గురించి పైకులాల్లో చాలా సాధారణంగా వ్యక్తమయ్యే తప్పుడు అవగాహనను ఎలా చూడాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఇందులో ఒక కథ చదివినప్పుడు. ఈ తరం లౌక్యంగా ఆలోచించడం మొదలు పెట్టారని, కులాంతర వివాహాల ద్వారా కులవ్యవస్థ బీటలు వారుతుందని మరో కథలో ఒక ఆకాంక్ష వ్యక్తమవుతుంది. రాజ్యానికి, ఆధిపత్య కులవ్యవస్థకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఒకదానికొకటి దన్ను. అంతరాల వ్యవస్థను రాజ్యం ఎట్లా కాపాడుతుందో, అట్లాగే వ్యవస్థ ప్రభావాల్లో వ్యక్తులు కూడా అంత సులభంగా కులం హద్దులు దాటి బైటికి రారు. ఒకవైపు నుండే చూస్తే అనేక చిక్కులు వస్తాయి. ఈ కథలకు అటువంటి పరిమితి ఏర్పడిందని చెప్పక తప్పదు. అయితే శ్రమదోపిడికి పితృస్వామ్యం అదనపు అంగంగా ఎట్లా పనిచేస్తుందో చెప్పిన కథలో వ్యవస్థ స్వభావాన్ని రచయిత అతి సునిశితంగా పట్టుకుంటారు (సీతా వర్ధిల్లు). చాలా అరుదైన కథల్లో ఇది ఒకటి. వర్గదృక్పథాన్ని, వర్గపోరాట ఆకాంక్షను సూదిలో దారంగా పట్టుకొచ్చిన కథలు రచయితగా నిలిచిన, నిలవాల్సిన స్థానాన్ని స్పష్టంగా చెబుతాయి. ఇతివృత్తం కన్నా కథనం వల్లే చదివించే కథలు.

ఇంకో విషయం కూడా చెప్పాలి. రాయలసీమ కథకులు, ముఖ్యంగా 80లలో రచనలు చేసిన వాళ్లు కరువుతో పాటు ఫ్యాక్షన్‌ను చిత్రించకుండా పోరు. వెంకటరెడ్డిగారు వాటి జోలికి పోలేదు. ఈ అనుభవం ప్రత్యక్షంగా లేని ప్రాంతం, వ్యక్తులు తగినంతగా సీమలో ఉన్నారు. ఒకే మూసలో రాయలసీమను చూసేవాళ్లకు ఇది కొత్తగా అనిపించవచ్చు.

రచయిత జీవితానుభవం రిత్యా, సుదీర్ఘ సాహిత్యానుబంధం రిత్యా చూస్తే రాయలవలసిన వాటికన్నా ఈయన చాలా తక్కువ కథలు రాసారనిపించకపోదు. ఇటీవలే రాసిన కథను చూసినా మరిన్ని మంచి కథలు రాసే శక్తి మెండుగా ఉంది. కాబట్టి ఇప్పటి రాయలసీమ ఉద్యమ సందర్భంతో, మొత్తంగా నేటి సంక్షుభిత కాలంతో మన రచయిత రాయబోయే కథలు సంభాషిస్తాయని ఆశిద్దాం.

No. of visitors : 611
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •