రాయలసీమ ప్రజల ఆకాంక్షలు

| సాహిత్యం | వ్యాసాలు

రాయలసీమ ప్రజల ఆకాంక్షలు

- పెనుగొండ భాషా | 20.01.2019 11:37:16am


అవును ! నిజమే మనుషులన్నాక కోరికలు లేకుండా ఉంటాయా ? ఎందుకు ఉండవు ఉంటాయి ఉండాలి కూడా . అది ప్రకృతి సహజం. అదే ఒక ప్రాంతం వారు అయితే ? నిరంతరం కరువు కాటకాలతో అల్లాడే వారు అయితే కోరికలు ఆకాంక్షలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అవి న్యాయమైనవి కూడా అయితే? ఆ కోరికలు తీరడానికి ప్రజలు దశాబ్దాల పాటు ఎదురు చూస్తుంటే, వర్ణించడం వీలు అవుతుందా ? అస్సలు వీలు కాదు. భారత దేశంలోనే అతి వేగంగా చావు అంచుల దాకా, పోతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాయలసీమే.

మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో, అచ్చం అలాగే 2014 న తెలంగాణ నుండి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ఒకటే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అయిన, ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో అయిన, రాయలసీమ పైన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రాయలసీమ ప్రజలను కేవలం ఓటర్లు గా తప్ప, మనుషులుగా లెక్క కట్టడం లేదు. అప్పుడయిన ఇప్పుడయిన, ఈ ప్రాంతం లో ఉన్నవి కేవలం 52 యం.యల్.ఏ సీట్లు మాత్రమే. అధికారం లోకి రావాలంటే మెజారిటీ సీట్ల కోసం, కోస్తా నాయకుల మీద ఆధారపడక తప్పని పరిస్థితి.

సీమ నాయకులకు ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉన్న మోజుతో, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను, కోస్తా పెట్టుబడి, భూస్వామ్య, పెత్తందారుల పాదాల కింద తాకట్టు పెడుతున్నారు. రాయలసీమ నుండి మెజారిటీ మంది సి.యం. కుర్చీలో ఉన్న, ఈ ప్రాంతానికి చేసినది శూన్యం.1956 లో కర్నూల్ లో ఉన్న రాజధాని హైదరాబాద్ కు పోవడంతోనే, సీమ మరినంత వెనుకబాటుకు గురికావడానికి బీజం పడింది. 1953-1956 వరకు సీమ ప్రజలకు రాజధాని మున్నాళ్ళ ముచ్చటగా మారిపోయినది..ఈ ప్రాంత ముఠానాయకుల, పెత్తందారుల క్రింద సీమ ప్రజలు అడుగడుగున నష్టపోతూనే ఉన్నారు.

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు కేటాయించ వలసి ఉన్నది. రాయలసీమ సాగునీటి అవసరాలు తీరిన తరువాతనే, దిగువకు వదలాలనే పెద్ద మనుషుల ఒప్పందంను కృష్ణా నదిలో జల సమాధి చేశారు. ఈ రెంటిలో ఒక్కటి కూడా రాయలసీమ కు ఇవ్వలేదు. 2014 లో సీమకు రావాల్సిన రాజధాని పాయ,2019లో హైకోర్టు పాయ. సీమకు పాలక వర్గాలు ఒట్టి చేతులు చూపాయి. విభజన హామీలను తుంగలో తొక్కారు. ఎయిమ్స్ , ఐ‌ఐటిా ,సెంట్రల్ యూనివర్సిటీ లాంటి వన్ని కోస్తా కు తరలించుకొని పోయారు. సెక్రటేరియట్ లో సీమకు దక్కాల్సిన ఉద్ద్యోగాలు కూడా దక్కలేదు. కనీసం హైకోర్టును కూడా సీమకు కేటాయించలేదు. హైకోర్టు సీమకు బిక్షకాదు హక్కు అని కొట్లాడవలసిన,పాలక, ప్రతిపక్షాలు తమకేం పట్టానట్టుగా మిన్నకుండిపోయాయి. చరిత్ర పొడుగునా సీమకు ద్రోహం చేస్తూనేఉన్నారు. అధికారం అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్నారు. అధికార వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ది సాద్యమ్ కాదనే కనీస నియమం కూడా పాటించక పోవడం.మరీ దుర్మార్గం.

1996 లో చంద్రబాబు జీవో నెం:69 తీసుకొని వచ్చి, రాయలసీమ రైతులకు శాశ్వత ఉరితాడు బిగించాడు. రాయలసీమ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా అనేక అవమానాలు పంటి బిగువున భరిస్తూవస్తున్నారు.ఒకప్పుడు రతనాలను రాసులుగా పోసి అమ్మేవారని, శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలతో సుసంపన్న రాజ్యాంగ ఉండేదని చరిత్ర చెప్తున్న కొన్ని ఆనవాలు. అవును నిజమే ? రాయలసీమ ఇప్పటికీ ఎప్పటికీ సంపన్న ప్రాంతమే. రాయలసీమలో అపారమైన ఖనిజ సంపద ఉంది.ప్రపంచంలో ఎక్కడ దొరకని ఎర్ర చందనం రాయలసీమ సొంతం. ఇనుము, సున్నపురాయి, మ్యాంగనీసు, బైరటీసు, పుల్లరిన్, యురేనియం వంటి విలువైన ఖనిజాలు రాయలసీమ గర్భంలో పుష్కలంగా ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమలు సీమ అంతటా ఉన్నాయి. రాయలసీమ నుండి చేసే ఎగుమతులలో , సిమెంట్,ఎర్రచందనం, ముడి ఇనుము వంటి ఉత్పత్తులలో ప్రధమ స్థానం లో ఉన్నది.

అంతే కాక ఆడవాళ్ళ అక్రమ రవాణా, వ్యభిచారం, వలస కూలీల ఎగుమతులలో కూడా దేశంలోని మొదటి పది ప్రాంతాలలో రాయలసీమ ప్రాంతం కూడా ఒకటి. దేశంలోనే ఎక్కువ కరువులను ఎదుర్కొన్నా ప్రాంతం కూడా రాయలసీమే. అవును ఇది నిజంగా నిజమే. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వందల టి.యం. సి ల నీరు తుంగభద్ర,కృష్ణా నదుల గుండా వృధాగా దిగువకు పోతున్న ఒడిసి పట్టుకొని తన దప్పిక తీర్చుకోలేని దైన్య స్థితిలో రాయలసీమ ఉన్నది.

రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా ఉండటానికి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే ముఖ్య కారణం. తమ రాజకీయ పలుకుబడి కోసం, అధికారం కోసం, నిత్యం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ పబ్బం గడుపుకొనటం నిత్యకృత్యం అయినది. చరిత్ర పొడుగునా మోసపోయిన ప్రాంతమంటూ ఉంటే అది తప్పకుండ రాయలసీమ ప్రాంతమే అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు ముఖ్య కారణం ఈ ప్రాంతంలోని ముఠా నాయకుల ఐక్యత. తమ స్వార్ద పూరిత ప్రయోజనలకోసం, ప్రజలను , ప్రజల ఆకాంక్షాలను బలి పీఠం మీద పెడుతున్నారు.

రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమైనవి.నకిలీ విత్తనాలు, పురుగుమందులు రైతుల మెడలకు ఉరి తాళ్ళను పేనుతున్నాయి. అదునుకు పడని వాన, ముందు చూపులేని అధికారుల కారణంగా రైతాంగం నిత్యం సంక్షోభం లో కొట్టు మిట్టాడుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమయానికి అందని కారణం గా సకాలంలో రైతులు పంటలు వేయ కోలేక పోతున్నారు . సమయానికి బ్యాంకులు రుణాలు ఇవ్వని కారణం కూడా ఒకటి.

పంట కాలువలకు, అధికారులు నీళ్ళు ఎప్పుడు వదులుతారో తెలియదు. ఒకవేళ వదిలిన ఎన్ని రోజులు ఇస్తారో కూడా తెలియని విచిత్రమైన పరిస్థితి. ఇంకా చివరి ఆయుకట్టు రైతుల పరిస్థితి దుర్భరం. ఇన్ని కష్టాలు పడి, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందక రైతులో తమ పొలాల గట్ల మీద, చెట్లకు ఉరి తాళ్ళను బిగించి ఉయ్యాలలా ఊగుతూ తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.

అనంతపురం జిల్లాల రైతుల పరిస్థితి ఇంకా దీనం. ఉన్న తమ పొలాలలో బోర్లు వేయాలంటే కనీసం 1000-1200 అడుగుల దాకా వెళ్ళాల్సిందే .ఒకవేళ వెళ్ళిన కనీసం తేమ కూడా తగులుతుందో లేదో తెలియని స్థితి. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో బోర్లు వేసి నీళ్ళు పడక, పొట్ట చేత పట్టుకొని , బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు, చెల్లించలేక, అప్పు వారు ఇంటిమీద కు వచ్చి నానా భూతులు అంటుంటే , మనసు చంపుకొని బ్రతికేవారు కొందరైతే, ఇంకొందరు దూర ప్రాంతం వెళ్ళి భాష రాని చోట పడరాని పాట్లు పడుతున్నారు.

దొరికిన రోజు కడుపు నింపుకొని ,దొరకని రోజు మంచి నీళ్ళతో సరిపెట్టుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలోని కదిరి మరియు బెంగళూరు కు దగ్గరలోని సరిహద్దు గ్రామాలలోని స్త్రీ లు అలాగే కడప జిల్లాలోని రాయచోటి ,సుండుపల్లి తదితర ప్రాంతాలలోని మహిళలు ముంబై, చెన్నై, పుణె,ఢిల్లీ, కలకత్తా లలోని వ్యభిచార గృహాలలో పడుపు వృత్తి చేస్తూ, దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పడుపు వృత్తి చేయటానికి ఇష్టం లేక పోయిన, తప్పనిసరి పరిస్థితిలలో కుటుంబాలను పోషించుకోవటానికి తప్పడం లేదు.

ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలవటం లేదు. ఒక కుటుంబానికి 100 రోజులు మాత్రమే పనికల్పిస్తారు. అది కూడా నామ మాత్రమే. ఒకవేళ కల్పించిన ఒక కుటుంబం లో నలుగురు ఉంటే పని కల్పించేది కేవలం ఇరవై ఐదు రోజులే. ఇంకా మిగతా రోజులు ఏం తినాలి? ఎలా బ్రతకాలి ? కుటుంబాన్ని పోషించే మార్గం ఎలా? పిల్లల చదువు ఆలన-పాలన చూడాలంటే ఊరు వదలాల్సిందే.

పొలాలు భీళ్లుగా మారాయి. నేల నాలుకలు తెరుచుకుంది. కనీసం త్రాగు నీటికి కూడా ఇబ్బంది పాడాల్సిందే ఏ కాలంలోనైనా? పశువుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతా మంచిది. పశువులకు మేత పెట్టలేక రైతులు వారపు సంతలలో కోతలకు( కాటికి)పంపుతున్నారు.

అనంతపురం జిల్లా రాబోయే పది, ఇరవై సంవత్సరాలలో పూర్తిగా ఎడారిగా మరాబోతోంది. (ఇప్పటికే కొంత మారిందనుకోండి ). ఆ ప్రాంత ప్రజానీకాన్ని కాపాడుకోవాలంటే తుంగభద్ర సమాంతర కాలువ ఒకటే శరణ్యం. హోస్పెట్ లోని తుంగభద్ర డ్యామ్ లో పూడిక వలన నీటి నిలువ లభ్యత ప్రతి యేట తగ్గుతా ఉన్నది. జిల్లాలో నీటిని నిలువ చేసుకోవడానికి రిజర్వాయర్లు నిర్మించాలి. చెరువుల వ్యవస్థ ను పటిష్టం చేయాలి. చిత్రావతి ,పెన్నా నదులను కృష్ణా నది తో అనుసంధానం చేయటం వలన శాశ్వత కరువు ను నివారించవచ్చు.

రాయలసీమ ముఖద్వారం కర్నూలు ప్రజల పరిస్థితివిచిత్రమైనది.తూర్పు ప్రాంతం కె.సి కెనాల్, తెలుగు గంగా కాలువ లతో కనీసం ఒక పంట అయిన పండించుకోవచ్చు. ఇందుకు విరుద్దంగా ఉంటుంది పడమటి ప్రాంతం. పక్కనే తుంగభద్ర , వేదవతి, హగరి, హంద్రీ నదులు ప్రవహిస్తున్నా తగిన రిజర్వాయర్లు, లేకపోవడం వలన వందల టి.యం .సి. ల నీళ్ళు వృధాగా కృష్ణార్పణం అవుతున్నాయి. హోస్పెట్ లోని తుంగభద్ర డ్యామ్ దిగువ నుండి కర్నూలు దగ్గరలో తుంగభద్ర నది కృష్ణాలో కలిసే ప్రాంతం వరకు , ప్రతి సంవత్సరం దాదాపు 140-180 టి.యం .సి. ల నీరు లభ్యమవుతున్నాయి.

అంటే రాయలసీమకు కేటాయించిన నికర (హక్కున్న జలాలు ) జలాలు దాదాపు 122 టి.యం.సి.ల కంటే తక్కువే.కేటాయించిన నికర జలాలలో ప్రతి సంవత్సరం 60-70 టి.యమ్.సి ల కంటే ఎక్కువ వాడుకున్నది లేదు. ఎందుకంటే నీరు నిలువ చేసుకోవడానికి తగినన్ని రిజర్వాయర్ లేకపోవడమే అందుకు కారణం. ఈ సమస్యకు పరిష్కారం కృష్ణానది మీద సిద్దేశ్వరం అలుగు మాత్రమే? ఎందుకంటే ఒక్క ఎకరా భూసేకరణ అవసరం లేకుండా కేవలం 500 కోట్ల ఖర్చు తో 50 టి.యమ్.సి. ల నిలవ సామార్ద్యమ్ తో నిర్మించుకోవచ్చు. దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమి సాగు చేసుకోవచ్చును. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రజల చిరకాల కోరిక స్వప్నం అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

అలాగే తుంగభద్ర నది మీద కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని గుండ్రేవుల గ్రామం వద్ద 20టి.యం.సి. ల సామర్డ్యమ్తో రిజర్వాయర్ నిర్మించుకోవచ్చు. కె.సి.కెనాల్ (కర్నూలు-కడప కాలువ) ఆయుకట్టు ను స్థిరికరించుకోవచ్చును. సిద్దేశ్వరం మరియు గుండ్రేవుల ప్రాజెక్టులు రాయలసీమ ,తెలంగాణ సరిహద్దులలో ఉండటం మూలంగా, రెండు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రెండు ప్రభుత్వాలు కలిసి పని చేయాలి. పాత మహబూబ్ నగర్ జిల్లాతోపాటు రాయలసీమ లోని నాలుగు జిల్లాలకు ఉపయోగకరం.

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కు నికర జలాలు కేటాయింపులు జరగాలి. యుద్ద ప్రాతిపదికన పనులు నిర్మాణం చేయాలి. తెలుగుగంగ ప్రాజెక్టు గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతా మంచిది? ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులు (గాలేరు నగరి, తెలుగు గంగ) దాదాపు 30 సంవత్సరాలు అవుతున్న ప్రధాన మరియు పంట కాలువల నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేయలేదు.

కోస్తా ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలు, అభివృద్ది, ప్రాజెక్టుల పనుల మీద చూపించిన శ్రద్ద, రాయలసీమ ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడంలో పాలక, ప్రతి పక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. కోస్తా ప్రజల అభివృద్దే మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్దిగా చూపించే, పాలకుల దుర్మార్గాలను ఎండగట్టడంలో రాయలసీమ ప్రజలు కొంచెం వెనకబడి ఉండటం వాస్తవమే. అమరవతిని తమ రాజధానిగా సీమ ప్రజలు భావించడం లేదు. ఇప్పటికీ కూడా రాజధానికి పోవాలంటే తగిన రవాణా, రైలు మార్గాల వసతి రాయలసీమ కు అందుబాటులో లేవు. విధ్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వెనక బడిన రాయలసీమ యువతి,యువకులు కోస్తా ప్రాంత వారితో ఏవిధంగా కూడా పోటీ పడలేరు. దాదాపు వంద సంవత్సరాల క్రితం నుండే ఆ ప్రాంత ప్రజలు ఆర్దికంగా, సామాజికంగా చైతన్యం కలిగిన మూలంగా, పోటీ పడలేని పరిస్థితి.

రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షలు హైకోర్టు, రాజధాని, కనీస సౌకర్యాలైన నీళ్ళు, నిధులు, నియమకాలలో తమ వాటా తమకు దక్కాలంటే ప్రత్యేక రాష్ట్రం తోనే సాధ్యమని, ఆ వైపుగా సీమ యువత అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా మనుగడ సాగించడానికి రాయలసీమ కు అన్నీ రకాల అవకాశాలు సమృద్దిగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నుండి రాయలసీమ విడిపోతేనే ప్రత్యేక హోదా సీమ దక్కుతుంది. కొత్త రాజధాని వస్తుంది. కొత్త హైకోర్టు నిర్మాణం చేసుకోవచ్చు. కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయి. జాతీయ ప్రాజెక్టులు గా సీమలోని ప్రాజెక్టు లని గుర్తించ వచ్చు.స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం మూలంగా తరతరాలుగా వలస వెలుతున్న కూలీలకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించట మూలంగా వలసలను నివారించవచ్చు. విద్య,వైధ్య రంగాలలో అభివృద్ది జరగాలంటే ప్రత్యేక రాయలసీమ తోనే సాధ్యమని, రాయలసీమ ప్రజలు ఆత్మగౌరవం వైపుగా అడుగులు వేస్తున్నారు.

No. of visitors : 428
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


జైలు గోడ‌ల వెన‌క

పెనుగొండ బాషా | 16.08.2018 12:17:00am

ఈ అక్రమ కేసుల్లో జైల్లుపాలైన రాజకీయ ఖైదీలు, ఇతర కేసులలో జైలు జీవితం గడిపిన వాళ్ళు ఇంటికి వచ్చిన తరువాత చూచూస్తే వాళ్ళ కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్నాయి. క...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •