ముస్లిం జీవితాల వాస్తవిక కథలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ముస్లిం జీవితాల వాస్తవిక కథలు

- డా. వెల్దండి శ్రీధర్‌ | 20.01.2019 11:40:09am

ʹʹనాకొక పంథా ఉంది. వాదం, వాదన ఉంది. నాకు కొంత మంది పాఠకులు ఉన్నారు. నేను వాళ్ల గురించే రాస్తాను. వాళ్ల కోసమే రాస్తాను.ʹʹ -ʹదహనంʹ కథలో రచయిత.

వేంపల్లె షరీఫ్‌కు తన పాఠకులెవరో తెలుసు. తను రాయాల్సిన జీవితాలేంటో తెలుసు. తను ఎవరి వైపు నిలబడాలో తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే వేంపల్లె షరీఫ్‌ చాలా స్పష్టత ఉన్న రచయిత. తనకంటూ ఒక దృక్పథమున్న రచయిత. ఒకరి జీవితాల గురించి మరొకరు సానుభూతితో రాసేకన్నా ఎవరి జీవితాలు వారే రాసుకుంటే వాళ్ల గాయపు నొప్పి నేరుగా పాఠకుల మనసుల్లోకి దిగిపోతుందనే దృష్టితో అస్తిత్వ ఉద్యమాలు రగులుకున్నాయి. తెలుగు కథా సాహిత్యంలో ముస్లిం మైనార్టీ అస్తిత్వాన్ని మొదట రగిలించిన షేక్‌ సత్యాగ్ని వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు చాలా మంది ముస్లిం రచయితలు తమదైన శైలిలో అద్భుతమైన కథలు రాస్తున్నారు. అట్లా ఎదిగి వచ్చిన యువకెరటం వేంపల్లె షరీఫ్‌. ఇంతకు ముందే ʹజుమ్మాʹ కథా సంపుటి ద్వారా కేంద్రసాహిత్య అకాడమి యువ పురస్కారాన్ని పొందిన షరీఫ్‌ తరువాత ʹతియ్యని చదువుʹ (పిల్లల కథలు), తాజాగా ʹటోపి జబ్బార్‌ʹ వెలువరించారు. ఇటీవల ʹకథామినార్‌ʹ ముస్లిం మైనార్టీ కథల సంకలనానికి మరొకరితో కలిసి సంపాదకత్వం కూడా వహించారు. అంతేగాక ʹకథనంʹ పేరుతో యూట్యూబ్‌ వాహికగా ఇప్పటి డిజిటల్‌ తరానికి ఉత్తమ తెలుగు కథల్ని వినిపించడానికి ప్రయత్నిస్తున్నారు కూడా. ముస్లిం వాస్తవిక జీవితాల మీద సాగిపోయిన ʹటోపి జబ్బార్‌ʹ కథా సంపుటిలోని కథల తీరు తెన్నులపై ఒక విహంగ వీక్షణం.

ఈ కథా సంపుటిలోని 11 కథలు దేనికది ఒక చిన్ని తుఫాన్‌ను సృష్టించి మనల్ని ఏదో సుడిగుండంలోకి నెట్టివేస్తాయి. ఇందులోని ʹదారి తప్పిన కలʹ, ʹకోయేట్‌ లెక్కʹ రాయలసీమ కరువు విషాదం నుండి పుట్టిన కథలు. ఎ. పి. జె. అబ్దుల్‌ కలాం ʹకలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయండిʹ అని చెప్పాడు. కానీ ఇక్కడ ఎలాంటి కలలు కనాలో కూడా తెలియని అమాయక జీవులున్నారు. ʹʹఈ నీళ్లు ఎంత పని జేచ్చాండాయి నాజియా. తల్లికి బిడ్డను కాకుండా చేస్తున్నాయి. బిడ్డను తల్లికి కాకుండా చేస్తున్నాయి. పక్షి, పురుగు, చెట్టు, పుట్ట అన్నీ మలమలా మాడి సచ్చిపోతాండాయి. మనోళ్లకేమో కలలు గుడక ఎట్ట గన్నాల్నో తెలియడం ల్యా. నీ వదినేమో.. మొగపిల్లోడు ఉంటే బావుండును అంటుంది... నీ కూతురేమో గోషా కావాల్ల.. అంటాది. మనగ్గావాల్సింది నీళ్లు కదూ..అయ్యుంటే యియన్నీ ఎందుకు.. మల్ల నీళ్ల గురించి ఎవురూ ఎందుకడుగరు? మనం కనాల్సిన కలను వదిలేసి మరేదో కలను కంటున్నాం. అదీ గదా రువాడే ఆట.ʹʹ ఇదీ రాయలసీమ జీవితాల ʹదారి తప్పిన కలʹ.

కలలే సరిగా కనని వారు కరువుకు ఎదురు నిలిచి ఇక్కడ ఎట్లా బతుకుతారు? అందుకే పేదరికపు గోడల మధ్య, నమ్మకాల పరదాల వెనక భార్యా, పిల్లల్ని వదిలేసి, ఊరి నిండా అప్పులు చేసి ఎడారి దేశాలకు వలసపోతుంటారు. అక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించింది ఇంటికి పంపితే ఇక్కడ భార్య, పిల్లలు రూపాయి కూడా వాడుకోవడానికి వీలు లేకుండా అప్పుల వాళ్లు గుంజుకు పోతుంటారు. ఇదీ నిజ జీవితపు మెలో డ్రామా. ఈ ʹకోయేట్‌ లెక్కʹలు ఎన్నటికీ తీరవు. జీవితాలు కనీసం ఇంత మామిడికాయ కొనుక్కొని తినే స్వాతంత్య్రం కూడా లేకుండా దారుణంగా గడిచిపోతుంటాయి.

ఇందులో భాష చుట్టూ తిరిగే కథలు ʹఅమ్మ బొమ్మʹ, ʹఇద్దరు తల్లుల బిడ్డ.ʹ ఏ తెలుగు పుస్తకమైనా ʹఅʹ అంటే ʹఅమ్మʹ, ʹఇʹ అంటే ʹఇల్లుʹతోనే మొదలవుతుంది. కాని ప్రఖ్యాత చిత్రాకారులు ʹబాపుʹ తన బొమ్మలతో గీసిన తెలుగు వాచకంలో ʹఅʹ అంటే ʹఅరటిʹ అని అరటి చెట్టు బొమ్మ గీశాడు. ఇక్కడే కథకునికి కథా వస్తువు దొరికినట్లయింది. అంత పెద్ద చిత్రాకారుడు కొన్నేండ్లుగా వస్తోన్న అమ్మ బొమ్మను కాదని అరటి బొమ్మను ఎందుకు గీశాడు? ఒకప్పటి తెలుగు వాచకంలో అమ్మ బొమ్మ ఏ రూపు రేఖలతో ఉంది? అది చదివిన పిల్లలు ఇది మా అమ్మ బొమ్మ కాదనే స్ప ృహను పొందేంతటి చైతన్యం ఎలా వచ్చింది? ʹబొట్టున్నా లేకపోయినా అమ్మ అమ్మే. అమ్మకు మతమేంటి? అందరికీ మతాలుంటాయి కానీ అమ్మకుండవు.. అమ్మ ప్రేమమూర్తిʹ కదా! పిల్లల మనుసుల్లోకి మతం ఎలా ప్రవేశించింది? ఇలా ఎన్నో ప్రశ్నల్ని రగిల్చే కథ ʹఅమ్మబొమ్మʹ. ఇది దేశ లౌకికత్వాన్ని ప్రశ్నించే కథ. మెజారిటి హిందుత్వం మైనార్టీ ప్రజలపై ఎలా రుద్దబడుతుందో కూడా చెప్పి మనల్ని ఆలోచనా తరంగాల్లోకి విసిరేసే కథ.

ప్రాథమిక విద్యా స్థాయి నుండి మనం ఎంత సేపటికి విద్యార్థి రాతనే పరీక్షిస్తున్నాం కాని సమకాలీన కాలానికి అత్యవసరమైన మ్యూనికేషన్‌ స్కిల్స్‌లో ప్రధానమైన భాషణం మీద దృష్టి పెట్టడం లేదు. తెలుగు మాతృభాషగా ఉండి, తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలందరికి ప్రాథమిక స్థాయి నుండే అంటే ఒకటవ తరగతి నుండే తెలుగు పండితుని అవసరం ఉన్నది. ఉచ్ఛారణ, రాత రెండూ బాల్యం నుండే అలవడాల్సిన సామర్థ్యాలు. కాని మనం ఎంత సేపటికి రాత పరీక్షలే పెడుతున్నాం. మాట్లాడే సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని కథకుడు ఉత్తమ పురుష కథనంలో చెప్పడం చాలా బాగా నప్పింది.

మనసులోపలి సున్నితపు పొరల్ని ముళ్లులా గుచ్చే కథ ʹఒంటిచెయ్యిʹ. పిల్లల్ని దండించడంలో ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు ముందుంటారు మన దేశంలో. విదేశాల్లోలాగా పిల్లల్ని దండిస్తే కూడా చర్యలు తీసుకునే కఠినమైన చట్టాలు మన దేశంలో ఇంకా రాలేదు. కొండొకచో ఉన్నా వాటి అమలు మిగతా చట్టాల్లాగే పేలవంగా ఉంది. నిజానికి మనమంతా ʹఒంటిచేయిʹతోనే సంచరిస్తున్నాం. కొందరైతే రెండు చేతులు కోల్పోయి ఉన్నారు. ఇంకా కొందరైతే తలలు లేని మొండెంలతోనే జీవిస్తున్నారు. పిల్లల విషయంలో గొప్ప మార్పును కోరే కథ. ప్రతి ఒక్కరిని ఒక కుదుపు కుదిపే కథ.

యవ్వనపు తొలి వాకిట్లో నిలబడ్డ ఇద్దరు కౌమార దశ విద్యార్థుల ప్రేమ కథ ʹటోపి జబ్బార్‌ʹ. జబ్బార్‌ తల మీద టోపి లేకుండా తను ఇష్టపడిన అమ్ములుకు కనపడడానికి నానా అవస్థలు పడుతుంటాడు. కానీ అమ్ములు తిరుపతికి వెళ్లి గుండు చేయించుకొని ʹʹవోడు ఏదో అంటాడని నేను దేవుని కార్యానికి దూరంగా ఉండాల్నా?ʹʹ అని ప్రశ్నించి గుండు మీదే పాఠశాలకు రావడానికి ఏమాత్రం ఇబ్బంది పడదు. అమ్ములు గుండు మీదే స్కూల్‌కి రావడానికి, జబ్బార్‌ తల మీద టోపి ధరించలేక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌కు లోనవడానికి మన సమాజంలో కారణాలు చాలా ఉన్నాయి. మెజారిటీ, మైనార్టీ సమాజాల అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కథ మత వివక్షని ఎండగడుతుంది.

ʹʹఆడపిల్ల యాడున్నా డామినేషన్‌. అది తమ్ముడు కావచ్చు. అన్న కావొచ్చు. మొగుడు కావొచ్చు. మొగోడు యాడున్నా ఆడదాన్ని సెప్పు సేతల్లో పెట్టుకోవాలని సూస్తాడు. వాణ్ని అడ్డుకోవాలంటే నేటి ఆడపిల్లకు ʹగొళ్లʹలాంటి ఆయుధం ఏదో ఒకటి కావాల. ఆఖరికి ఆ ఆయుధం మీద కూడా మొగోడు పడతాడు. ఏ ఆయుధం అండతో ఆడది రెచ్చిపోతాండాదో.. ఆ ఆయుధాన్ని విరిచేసి తన మాటకు తిరుగులేకుండా చేసుకుంటాడుʹʹ మొగోడు. స్త్రీ జీవితం చుట్టూ అల్లుకున్న ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ఈ కథ ఎన్నో విషయాలు నేర్పుతుంది. కథకుడు అన్నట్లు ఈ రోజు స్త్రీకి ఎన్నో ఆయుధాలు కావాల్సి వస్తోంది. లేకుంటే ఆమె మనుగడ చాలా కష్టమై పోతోంది. కనీసం ఆ ఆయుధం ʹగోళ్లుʹ అయిన పరవాలేదు.

ఈ సంపుటిలోని కథన్నింటిలో కథాకథనంలో, శిల్పచాతుర్యంలో గొప్ప కథ ʹతలుగుʹ. సావుగొడ్డును కోసుకొని మాంసం అమ్ముకొని బతికే బోరేవాలా దౌలును పైస బలుపుతో వెంకటప్ప చేసిన దోపిడీని కథకుడు చాలా వాస్తవాదీన రేఖ మీద నడిపించి పాఠకులు కదిలిపోయేలా చేస్తాడు. న్యాయం చేయమని పెద్దమనుషుల్ని తీసుకుపోయినా దౌలుకు న్యాయం జరగకపోగా భౌతికదాడి, అవమానం మిగులుతాయి. పిల్లినైనా గదిలో వేసి బాదుతుంటే పులి అయిపోయినట్టు చివరికి దౌలు తిరగబడితే గాని వెంకటప్ప దారికి రాడు. దౌలుకు న్యాయం జరగదు. ధ్వన్యాత్మకంగా గొప్ప విప్లవ పాఠాల్ని బోధించే ఈ కథ వర్తమాన తెలుగు కథల్లో నిలిచిపోయే కథ.

ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజులే పట్టేట్టు ఉంది. ఈ సంపుటిలోని ʹఅంకెలుʹ కథ ఈ రకమైన రాజకీయ కోణాన్ని ఆవిష్కరించే కథ. ముస్లింలంటే ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసే రాజకీయ నాయకులున్నంత కాలం ఈ దేశం ఇట్లాగే కాలవడ్తుంది. రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని వాళ్లు ప్రజల్ని చూసే తీరును తీవ్రంగా ఖండించే కథ ఇది.

వర్తమాన దేశంలో గోవు చుట్టు ఎంత రాజకీయం నడుస్తుందో మనం చూస్తున్నదే. ʹదహనంʹ కథలోని ఒక ఆవు ʹʹనువ్వు నన్ను ఏమైనా అను. కానీ మనిషితో మాత్రం పోల్చొద్దు. మనిషి స్వార్థపరుడు. ఎప్పుడూ తన కోసమే ఆలోచిస్తాడు నీలాగా. ఆ వాదం ఈ వాదం అంటూ ఉన్మాదంలో కొట్టుకుపోతాడు. ఈ భూమ్మీద తనతో పాటు సకల జీవరాశులూ ఉన్నాయని ఎప్పుడూ గుర్తెరగడు. తన ఉనికికి అడ్డమొస్తే దేన్నయినా అంతమొందిస్తాడు.ʹʹ అంటుంది. మన మూర్ఖత్వం వల్ల ఇప్పటికే ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయి. మెల్లమెల్లగా పులి కూడా ఆ జాబితాలో చేరబోతోందని చెప్పకనే చెప్పిన కథ. మనిషిలో ఇంకా ఏదో ʹదహనంʹ కావాలనే సూచనతో సంకేతాత్మకంగా సాగిన కథ.

అమాయక ప్రజల్ని ఎన్నో రకాలుగా ఎడ్యుకేట్‌ చేయడానికి ఉపయోగించాల్సిన బలమైన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వాళ్ల టిఆర్‌పి రేటింగ్‌ పెంచుకోవడానికి ఈ రోజు వేటిని ప్రసారం చేస్తోందో చూస్తే సిగ్గనిపిస్తుంది. మామూలుగా ʹకుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కను కరిస్తే వార్తʹ అని జర్నలిజంలో ఒక ప్రాథమిక పాఠం. కానీ ఇప్పుడు ఏది పడితే అదే వార్తయిపోయి టీవీల్లో మళ్లీ మళ్లీ తిరుగుతూనే ఉంది. మారాల్సిన ఎలక్ట్రానిక్‌ మీడియా దృష్టికోణాన్ని సూచిస్తుందీ కథ.

ఈ కథా సంపుటితో వేంపల్లె షరీఫ్‌ మానవ సమాజానికే ఒక షాక్‌ ట్రీట్‌మెంటిచ్చాడు. ముస్లిం మైనార్టీ అస్తిత్వ దృక్పథం ఏర్పడడానికి లేదా ముస్లింలను చూడాల్సిన తీరును ఈ కథలు చాలా సున్నితంగా చెప్తాయి. ఎన్నో ఆర్థిక కోణాల్ని, మానవ సంబంధాల్ని చర్చించిన కథలివి. కథకుని మన్నికైన వస్తువు ఎన్నిక అబ్బురపరుస్తుంది. పైకి చాలా చిన్న విషయాలుగా కనబడే వాటి నుండి కథను తీసుకొని వాటిని అంతే సున్నితంగా పాఠకులకు చేరవేయడం ఇందులో కనిపించే ఒక కథాకళ. మనముందుతరం కథకులు కథ చెప్పడంలోని ఎన్నో శైలీ, శిల్పాలకు కొత్తదారులు చూపారు. ఈ మార్గంలో అనేక రహదారులు నిర్మించారు. దురదృష్టవశాత్తు ఇప్పటి తరం కథకులు వాటి నుంచి ఏమీ నేర్చుకోలేదేమోననపిస్తుంది. ఎందుంటే అనేక కథలు మూస ధోరణిలోనే వస్తున్నాయి. కానీ ఈ కథలు దానికి అపవాదుగా నిలుస్తాయి. వేంపల్లె షరీఫ్‌ శిల్పపరంగా చాలా ప్రయోగాలు చేసినట్టు కనిపిస్తుంది. దీనికి నిదర్శనంగా చాలా కథల్ని చెప్పవచ్చు. ముఖ్యంగా ʹఒంటిచెయ్యిʹ, ʹదహనంʹ, ʹతలుగుʹ, ʹగోళ్లుʹ కథలు చాలా మంచి శిల్పంతో సాగిన కథలు. మిగతా కథలు కూడా పైకి చాలా సరళంగా సాగినట్టు కనిపించినా అవి రాయడం చాలా కష్టమైన పని. సమూహం మధ్య కూర్చొని కథ చెప్పినట్టు కనిపిస్తుంది. అనేక ప్రశ్నలు, జీవితం, సంఘర్షణ, ఒకానొక దృక్పథం, కొత్తదారుల వెంట సాగే కథనం, రాయలసీమ మాండలిక సొబగు, నిర్దిష్ట పోరాటం.. ఇలా ఎన్నో విషయాలు తొంగి చూసే కథలివి. పుస్తకమంతా చదివి మూసేసిన తరువాత కూడా చాలా కాలం వెంటాడే కథలు. ఈ కథలు కథల్లో కంటే కథ బయటే ఇంకా ఎక్కువ అర్థమవుతాయి. మనలో ఒక మార్పు, ఒక కదలికను తెచ్చి కాసింత సంస్కారాన్ని హృదయపు గోడలకు పూసి పోయే కథలు.

No. of visitors : 1040
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియాʹ

వెల్దండి శ్రీధర్‌ | 16.07.2017 08:31:51am

ఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........
...ఇంకా చదవండి

దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన

డా. వెల్దండి శ్రీధర్‌ | 01.10.2018 05:23:40pm

రోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు......
...ఇంకా చదవండి

దళిత దృక్పథం, ధిక్కార స్వరం

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 06.12.2018 12:09:20am

ఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి......
...ఇంకా చదవండి

వేయి అంచుల ʹజీవితంʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 21.12.2018 01:31:51am

ప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు......
...ఇంకా చదవండి

సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 04.01.2019 10:50:11pm

ఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి... ...
...ఇంకా చదవండి

పాతబడిన దేహపు రొద ʹవృద్ధోపనిషత్‌ʹ

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 16.06.2019 10:11:38am

ప్రేయసి పాతబడుతుందేమో కాని ప్రేమ పాతబడదు. యవ్వనపు తొలివాకిట్లో నిలబడి నచ్చిన సుందరిని ఎదనిండా నింపుకున్నప్పుడు ఏదో కొత్త ......
...ఇంకా చదవండి

సాహితీ కృషీవలుడు టి. జి. ఆర్‌. ప్రసాద్‌

డా. వెల్దండి శ్రీధర్‌ | 17.05.2019 09:46:23am

బాలల కథకుడిగా సాహితీరంగంలో అడుగుపెట్టిన ప్రసాద్‌గారు 1980 - 1990 మధ్య సుమారు 510 బాలల కథలను రాసి ఒకనాటి పసి హృదయాలపైన తనదైన ముద్రవేశారు. ఈ కథలన్నీ చదివితే ఇ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •